టాటాలకు సెబీ షాక్
ముంబై: మిస్త్రీ పేల్చిన బాంబుతో వరుసగా మూడో రోజు కూడా టాటా షేర్లు కుప్పకూలిపోతున్నాయి. ముఖ్యంగా రతన్ టాటాతోపాటు, గ్రూప్ కార్యకలాపాలపై సైరస్ మిస్త్రీ తీవ్ర విమర్శల నేపథ్యంలో టాటా గ్రూపు షేర్లన్నీ నేలచూపులు చూస్తున్నాయి. అటు ట్రేడర్లు, ఇటు ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గు చూపుతుండటంతో ఇండియన్ హోటల్స్ కౌంటర్ ఏకంగా 13 శాతానికిపైగా పతనమైంది. ఈ బాటలో టాటా పవర్, టాటా మోటార్స్, టాటా కమ్యూనికేషన్స్, టాటా కెమికల్స్ టాటా గ్లోబల్ బెవరేజెస్ , టాటా కాఫీ , టాటా ఇన్వెస్ట్మెంట్ , టాటా టెలీ సర్వీసెస్, కౌంటర్లలో అమ్మకాలు జోరు కొనసాగుతోంది. ఇంట్రాడేలో కనిష్ట స్థాయికి దిగజారాయి. ఇప్పటికే భారీ నష్టాలను మూటగట్టుకున్నటాటా గ్రూప్ మార్కెట్ విలువ తాజా నష్టాలతో సుమారు రూ. 40,000 కోట్లమేరకు చేరింది.
మరోవైపు ఈవ్యవహారంపై మార్కెట్లు రెగ్యులేటర్ సెబీ రంగంలోకి దిగింది. కార్పొరేట్ పాలన నిబంధనల ఉల్లంఘన జరిగిందా అనే
అంశాన్ని పరిశీలిస్తున్నామని తెలిపింది. ఒకవేళ గతంలో ఏదైనా మొత్తాన్ని రద్దు చేసుంటే, వాటి పూర్తి వివరాలు తెలియజేయాలని, ఆ సమాచారం స్టాక్ ఎక్స్ఛేంజ్ లకు తెలియజేయకుండా లావాదేవీలు జరిపివుంటే వాటి వివరాలు ఇవ్వాలని బీఎస్ఈ, ఎన్ఎస్ఈ ఆదేశించింది. కాగా వారసత్వ సంస్థలను నష్టాల్లో నడుపుతున్న కారణంగా టాటా గ్రూప్ సుమారు రూ. 1.18 లక్షల కోట్లు (18 బిలియన్ డాలర్లు) రద్దు చేయాల్సిన పరిస్థితి ఏర్పడనుందని సైరస్ మిస్త్రీ రాసిన లేఖతో టాటా గ్రూప్ లిస్టెడ్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్లు భారీ అమ్మకాలకు దిగారు.