యూనిట్ కు రూ.6 చెల్లిస్తే ఓకే..
♦ తెలంగాణలో పవన విద్యుత్ ప్రాజెక్టులు పెట్టిస్తాం
♦ విండ్ టర్బైన్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ‘‘తెలంగాణలో పవన విద్యుత్ ప్రాజెక్టులు పెట్టేందుకు కంపెనీలు సిద్ధంగానే ఉన్నాయి. అయితే కిలోవాట్ అవర్‌కు (కేడబ్ల్యుహెచ్) ధర కనీసం రూ.5.50 నుంచి రూ.6 ఉండాలి’’ అని ఇండియన్ విండ్ టర్బైన్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (ఐడబ్ల్యుటీఎంఏ) స్పష్టం చేసింది. ప్రభుత్వం గనక ఈ ధర ప్రకటిస్తే కంపెనీలను తీసుకొస్తామని అసోసియేషన్ చైర్మన్, ఆర్ఆర్బీ ఎనర్జీ డిప్యూటీ ఎండీ సర్వేష్ కుమార్ గురువారమిక్కడ మీడియాకు తెలిపారు. ‘తెలంగాణలో పవన విద్యుత్ రంగంలో ఇప్పుడైతే ఎలాంటి ఉత్పత్తీ జరగటం లేదు. కొన్ని కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి కానీ... దీనికి ప్రభుత్వం తగిన ప్రోత్సాహక ధర ప్రకటించాల్సి ఉంది. ప్రాజెక్టుల ఏర్పాటులో విధానపర అడ్డంకులను తొలగించాలి. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఇతర రాష్ట్రాలకు భిన్నంగా, ఆకట్టుకునే రీతిలో పవన విద్యుత్ పాలసీని ప్రకటించాలి’’ అని చెప్పారాయన.
అయిదేళ్లలో 10,000 మెగావాట్లు...
తెలంగాణలో వచ్చే ఐదేళ్లలో 8-10 వేల మెగావాట్ల మేర పవన విద్యుత్‌ను ఉత్పత్తి చేసే అవకాశాలున్నాయని అసోసియేషన్ వైస్ చైర్మన్, సుజ్లాన్ ఎనర్జీ స్ట్రాటజిక్ బిజినెస్ డెవలప్మెంట్ ప్రెసిడెంట్ చింతన్ షా తెలిపారు.ఒక్కో మెగావాట్‌కు ప్రత్యక్షంగా 30, పరోక్షంగా 60 మందికి ఉపాధి లభిస్తుందని సీఐఐ రెన్యువబుల్ ఎనర్జీ కౌన్సిల్ చైర్మన్, గమేసా విండ్ టర్బైన్స్ సీఎండీ రమేష్ కైమల్ వెల్లడించారు. ఒక్కో మెగావాట్‌కు రూ.6-6.5 కోట్లు ఖర్చవుతుందని ఐడబ్ల్యుటీఎంఏ సెక్రటరీ జనరల్ డి.వి.గిరి పేర్కొన్నారు.
ప్రాజెక్టుల ఏర్పాటుకు సిద్ధం: గమేసా విండ్ టర్బైన్
పవన విద్యుత్ రంగంలో ఉన్న గమేసా విండ్ టర్బైన్స్ తెలంగాణలో ప్రాజెక్టులు ఏర్పాటు చేసేందుకు రెడీగా ఉంది. ప్రభుత్వం ప్రకటించబోయే టారిఫ్‌పై నిర్ణయం ఆధారపడి ఉందని కంపెనీ వెల్లడించింది. కిలోవాట్ అవర్‌కు (కేడబ్ల్యుహెచ్) ధర రూ.5.50 నుంచి రూ.6 ఉంటే ప్రాజెక్టులు నెలకొల్పేందుకు సిద్ధమని గమేసా సీఎండీ రమేష్ కైమల్ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. కంపెనీ చేతిలో ప్రస్తుతం 1,300 మెగావాట్ల మేర ఆర్డర్లున్నాయని వెల్లడించారు. తెలంగాణలో 1,400 మెగావాట్ల మేర ప్రాజెక్టులు ఏర్పాటు చేసేందుకు రెడీ అని వెల్లడించారు. ఒక్కో మెగావాట్‌కు సుమారు రూ.6.5 కోట్లు ఖర్చు అవుతుంది.