మద్యం ధరలకు రెక్కలు
జిల్లాలో అదనంగా వసూలు
ఎమ్మార్పీ నిబంధనలు హుష్‌కాకి
పశ్చిమగోదావరి జిల్లా అధికారుల తనిఖీలు
మూడు వైన్‌షాపులు సీజ్
సాక్షి, విజయవాడ : జిల్లాలో మద్యం ధరలకు రెక్కలొచ్చాయి. నెల రోజుల క్రితం వరకు ఎమ్మార్పీకే విక్రయించిన వ్యాపారులు మళ్లీ ధరలను పెంచారు. ఎమ్మార్పీతో నిమిత్తం లేకుండా సగటున ఫుల్‌బాటిల్‌పై రూ. 15 నుంచి మద్యం సీసా ధరను బట్టి రూ.40 వరకు పెంచి విక్రయిస్తున్నారు. జిల్లాకు చెందిన అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, మంత్రి సహకారంతో ఇష్టానుసారంగా విక్రయాలకు తెరలేపారు. జిల్లాలో 335 వైన్‌షాపులకు గాను ప్రస్తుతం 296 చోట్ల విక్రయాలు జరుగుతున్నాయి. మిగిలిన 39 షాపులు ఇంకా కేటాయించలేదు. ఎక్సైజ్ అధికారులు మళ్లీ 12వ నోటిఫికేషన్ ద్వారా షాపులను కేటాయించడానికి కసరత్తు చేస్తున్నారు. ఈ క్రమంలో మద్యం వ్యాపారులు రాజకీయ లాబీయింగ్ ద్వారా ఎమ్మార్పీ నిబంధనను తుంగలో తొక్కారు.
అధికారులు కూడా సహకారం అందిస్తున్నారనేది బహిరంగ రహస్యం. లెసైన్స్ కాలపరిమితి మూడు నెలల్లో ముగుస్తుందని, వ్యాపారంలో పోటీ ఉన్న కారణంగా ఎక్కువ రేటుకు విక్రయించుకోవడానికి సహకరించాలనే వ్యాపారుల ప్రతిపాదనకు మౌఖిక అంగీకారం లభించింది. ఈ ఏడాది నూతన శ్లాబ్ విధానం వల్ల బాగా నష్టం వస్తుందని, తప్పని పరిస్థితుల్లో ఎక్కువ ధరకు కొన్ని షాపులు తీసుకోవాల్సి వచ్చిందనేది వ్యాపారుల వాదన. ఈ క్రమంలో జిల్లాలో రేట్లు పెంచి విక్రయిస్తున్నారు.
గతంలో ముడుపుల కేసులు రాష్ట్రస్థాయిలో ప్రకంపనలు సృష్టించి జిల్లాలో కూడా పలువురు అధికారులు ఇబ్బందులు పడ్డారు. దీంతో మామూళ్లకు దూరంగా ఉన్న అధికారులు మళ్లీ ఆ దిశగా ఆదాయంపై దృష్టిపెట్టారు. మామూళ్లు తీసుకుని అధిక ధరకు విక్రయాల వ్యవహారాన్ని పట్టించుకోవడం లేదు. మరోవైపు నిబంధనల ఉల్లంఘన వ్యవహారాలను పరిశీలించే ఎక్సైజ్ స్టేట్ టాస్క్‌ఫోర్స్ టీమ్ కూడా ఈ ఒప్పందం తర్వాత అంతగా దాడులు నిర్వహించలేదు.
కేసుల నమోదు..
ఈ నేపథ్యంలో జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో అధిక ధరలకు విక్రయిస్తున్నవారిపై కేసులు నమోదయ్యాయి. అది కూడా జిల్లా అధికారులకు సంబంధం లేకుండా పొరుగు జిల్లా అధికారులు వచ్చి ఇటీవల జిల్లాలో తనిఖీలు నిర్వహించారు. పశ్చిమగోదావరి జిల్లా ప్రొహిబిషన్ అధికారులు ఈ వారంలో మూడు రోజులపాటు తనిఖీలు జరిపారు. కమిషనర్ ఆదేశాల మేరకు వచ్చిన బృంద సభ్యులు జిల్లాలో దాదాపు 40 షాపులను తనిఖీ చేశారు. తిరువూరు, నందిగామ, విసన్నపేటల్లో అధిక ధరలకు విక్రయిస్తున్నారని గుర్తించి ఆ షాపులను సీజ్ చేశారు. ఈ విషయాన్ని మన జిల్లా అధికారులు ఆలస్యంగా తెలుసుకోవడం గమనార్హం.