జిన్ను సారా జూడనొక్క తీరుగనుండు
తాగి చూడ వాటి టేస్టు వేరు
మధువులందు మేలి మధువులే వేరయా
వైనుతేయుని మాట వలపు బాట!
మబ్బు మబ్బుగా ఉన్న వాతావరణంలో మందుబాబుల మనసు ‘మద్య’మావతి రాగాలాపన చేయడం కద్దు. నిత్య ‘తీర్థ’ంకరులకు ‘మందు’బాబులనే పేరు బహుశ జిన్ కారణంగానే వచ్చి ఉంటుంది. ఇంగ్లండ్‌లో జిన్ను ఒకానొక కాలంలో ఔషధంగానే పరిగణించేవారు. పిత్తాశయంలో, కిడ్నీల్లో రాళ్లు ఏర్పడిన రోగులకు, గౌట్ రోగులకు అప్పటి ఇంగ్లిష్ వైద్యులు జిన్‌తో చికిత్సలు కూడా చేసేవారు. జిన్ ప్రభావంతో అవి నయమైనట్లు ఆధారాలైతే లేవు. పదిహేడో శతాబ్దికి చెందిన డచ్ వైద్యుడు ఫ్రాన్సిస్కస్ సిల్వియస్ దీనిని కనిపెట్టినట్లు చరిత్రకారుల ఉవాచ. అనతికాలంలోనే ఇది ఇంగ్లండ్‌లో ప్రాచుర్యం పొందింది.
అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం లెసైన్సులు లేకుండానే జిన్ అమ్ముకునేందుకు వెసులుబాటు కల్పించింది. బ్రిటిష్ వారి ద్వారానే జిన్ భారత్‌కు చేరుకుంది. బ్రిటిష్ వారు ఇక్కడికొచ్చిన కొత్త రోజుల్లో దోమల జోరు కారణంగా మలేరియా బెడద తీవ్రంగా ఉండేది. దీనికి విరుగుడుగా జిన్‌కు జోడీగా భారత్‌లో దొరికే టానిక్ వాటర్‌ను ‘ఉప’ద్రవంగా వాడేవారు. జిన్, దానికి తోడుగా క్వినైన్ కలిసిన టానిక్ వాటర్ లేకుంటే, బహుశ మనకు స్వాతంత్య్ర పోరాటమే అవసరం ఉండేది కాదేమో! బ్రిటిష్ వారిని తరిమికొట్టే పనిని ఇక్కడి దోమలే విజయవంతంగా పూర్తి చేసేవి. ఇంతటి ఘనచరిత్ర గల ద్రవం జిన్‌తో ఈ వారం...
‘మధు’రోక్తి
మధువు అపార్థానికి గురైన పోషక పదార్థం
- పీజీ వుడ్‌హౌస్,
ఇంగ్లిష్ వ్యంగ్య రచయిత
స్మూత్ టానిక్
జిన్ : 45 మి.లీ.
వోడ్కా : 15 మి.లీ.
టానిక్ వాటర్ : 50 మి.లీ.
కొబ్బరినీరు : 90 మి.లీ.
గార్నిష్ : పలుచని నిమ్మచెక్క, ఐస్‌క్యూబ్స్
- వైన్‌తేయుడు