సకాలంలో డబ్బు చెల్లిస్తేనే ఇళ్లు
సాక్షి, ముంబై: మహారాష్ట్ర గృహ నిర్మాణ అభివృద్ధి సంస్థ (మాడా) ఇళ్ల విజేతలు తాత్కాలిక మంజూరు పత్రం (పీఓఎల్) పొందిన వారు మొత్తం డబ్బులు చెల్లించాలని మాడా సూచించింది. పీఓఎల్ లభించిన అనంతరం 180 రోజులలో ఇళ్ల డబ్బులు చెల్లించకపోతే, ఆ ఇంటిని మరొకరికి ఇస్తామని తేల్చి చెప్పింది. ఈ నిర్ణయాన్ని ముంబై మాడా విభాగం ఇటీవల అమల్లోకి తీసుకొచ్చింది.
దీంతో మాడా ఇళ్ల విజేతలు ముఖ్యంగా పీఓఎల్ అందుకున్నవారందరు 180 రోజులలో మొత్తం డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. లేకపోతే ఇళ్లును కోల్పోవాల్సిందే. సాధారణంగా మాడా ఇళ్ల లాటరీ డ్రాలో విజేతలకు అన్ని పత్రాలను పరిశీలించిన తర్వాత పీఓఎల్ ఇస్తారు. ఇంటి ధరలో 25 శాతం డబ్బులను 30 రోజుల్లో, మిగిలిన 75 శాతం డబ్బులను 60 రోజుల్లోపు చెల్లించాలని అధికారులు చెబుతారు. డబ్బులు చెల్లించ డంలో జాప్యం చేసిన వారికి 13.5 శాతం జరిమానా విధించి, మరో 90 రోజుల గడువును ఇస్తారు.
అయినా అనేకమంది డబ్బులు చెల్లించడం లేదని తెలిసింది. దీంతో మాడా నిర్మించి ఇచ్చిన నివాస ఇళ్లు ఎవరికి ఇవ్వకుండా వారి పేర్లపై అలాగే ఉన్నాయని ఓ సర్వేలో వెల్లడైంది. ఈ నేపథ్యంలో మాడా 180 రోజుల్లో ఇంటి డబ్బులు చెల్లించాలని, లేకపోతే వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న మరోవ్యక్తికి ఆ ఇళ్లు కేటాయించాలని గత అక్టోబర్ నెలలో నిర్ణయం తీసుకుంది.
దీన్ని ముంబై విభాగం ఇటీవలే అమల్లోకి తీసుకొచ్చింది. 2012, 2013 సంవత్సరాల్లో లాటరీలో ఇళ్లు లభించిన వారికి పీఓఎల్ పంపించడం ప్రారంభించింది. మరోవైపు అనేక మంది పీఓఎల్ ఆలస్యంగా లభించిందన్న ఫిర్యాదులు కూడా ఉంటాయి. ఈ నేపథ్యంలో మరో 15 రోజులు ఆలస్యమైన వారికోసం గడువు పెంచనున్నారు.