చైతన్య రాజును బాగా బెదిరించారు: జేసీ
కాంగ్రెస్ పెద్దల బెదిరింపుల వల్లే రాజ్యసభ ఎన్నికల బరిలో రెబల్ అభ్యర్థిగా రంగంలోకి దిగిన చైతన్య రాజు పోటీ నుంచి తప్పుకున్నారని ఆ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్య్ జేసీ దివాకర్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆదాల ప్రభాకర్ రెడ్డి సమైక్యవాదం వినిపించడానికే రాజ్యసభ ఎన్నికలలో పోటీ చేస్తున్నారని చెప్పారు. శనివారం ఆయన హైదరాబాద్లో విలేకర్లతో మాట్లాడారు. ఫిబ్రవరి 7న జరిగే రాజ్యసభ ఎన్నికల ఫలితాలతో ఢిల్లీ పెద్దల కళ్లు తెరిపిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
రాజ్యసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ముగ్గురు అభ్యర్థులను ప్రకటించిందని, నాలుగో అభ్యర్థిని కూడా ప్రకటించి ఉంటే బాగుండేదని ఆయన అభిప్రాయపడ్డారు. నాలుగో అభ్యర్థి కూడా తప్పక విజయం సాధించేవారని అన్నారు. నాలుగో అభ్యర్థిని ప్రకటించకుండా కాంగ్రెస్ పార్టీ పెద్ద తప్పు చేసిందని వ్యాఖ్యానించారు. అలాగే రాజ్యసభ ఎన్నికలలో ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు టిక్కెటు ఇస్తే బాగుండేదని జేసీ దివాకర్ రెడ్డి పేర్కొన్నారు.