Woman With Beard
-
సినీ ఫక్కీలో చోరీయత్నం.. ఎన్నో ట్విస్టులు!
కాలిఫోర్నియా: చోరీకి యత్నించిన మహిళ ఏం చేయాలో పాలుపోక బ్యాంకు నుంచి పరారయింది. చివరికి ఆమెని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన కాలిఫోర్నియాలోని వెస్ట్ డాన్ విల్లేలో గత మంగళవారం చోటుచేసుకుంది. అయితే ఇందులో కొన్ని ఆసక్తికర ట్విస్టులు ఉన్నాయి. చోరీకి యత్నించిన మహిళ పేరు జెన్నిఫర్ రే మెక్ క్లారీ(36). ఆమె రెండు రోజుల కిందట వెస్ట్ డాన్ విల్లేలోని బ్యాంకులో చోరీకి యత్నించింది. మహిళగా వెళ్తే తనను ఎవరూ లెక్కచేయరని భావించి, పురుషుడిగా కనిపించడానికి తనకు గెడ్డం ఉన్నట్లు కనిపించాలని నలుపురంగు రుద్దుకుంది. బ్లాక్ టీ షర్ట్, బ్లాక్ ప్యాంటు ధరించిన ఆ మహిళ బ్లాక్ కళ్లద్దాలు, క్యాప్ తో బ్యాంకులో ప్రవేశించింది. ఓ ఉద్యోగి వద్దకు వెళ్లి ఎలాంటి ఆయుధం చూపించకుండానే డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఆమెను మహిళ అని గుర్తించారనుకుని భయపడి బ్యాంకు నుంచి వెంటనే కాలికి బుద్దిచెప్పింది. బ్యాంకు నుంచి సమాచారం అందుకున్న డాన్ విల్లే పోలీసులు సీసీటీవీ ఫుటేజీ పరిశీలించారు. డబ్ల్యూ ఈఐ పింటాడో రోడ్-డయాబ్లో రోడ్ జంక్షన్లో అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తిని అరెస్ట్ చేశామని, విచారణ చేయగా ఆమె మహిళ అని వెల్లడైందన్నారు. డబ్బు కోసం బ్యాంకుకు వెళ్లి చోరీకి యత్నించినట్లు విచారణలో ఒప్పుకుంది. కేసు నమోదు చేసిన పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు. గతంలో పోలీసు జాబ్ కు ఎంపికైన జెన్నిఫర్ 18 నెలల ప్రొబేషనరీ టైమ్ తర్వాత 2010లో ఆమె ఫర్మార్మెన్స్ బాగాలేదని ఉద్యోగం నుంచి తొలగించారు. అప్పటినుంచీ ఇలా ఏదోఒక తరహాలో ఆమె చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే గతంలో డిపార్ట్ మెంట్ తో సంబంధం ఉన్న మహిళ ఇలా చేయడంపై షాక్ కు గురయ్యామని చెప్పారు. -
గడ్డం మహిళ గిన్నిస్ రికార్డు
లండన్: మగవాళ్లు కాస్త గడ్డం ఎక్కువ పెంచగానే ఎంట్రా దేవదాసులా మారిపోయావా ఏంటి అని ఫ్రెండ్స్ ఆటపట్టిస్తుంటారు. ఈ మధ్యకాలంలో చాలామంది గడ్డం పెంచేస్తున్నారు. మగవాళ్లు గడ్డం పెంచితే అందులో వింతేమి ఉండదు.. అయితే అదే ఆడవాళ్లు గడ్డం పెంచడం.. ఏకంగా గిన్నిస్ రికార్డులో చోటు దక్కించుకోవడం చాలా ఆశ్చర్యంగా ఉంది కదండీ. బ్రిటన్కు చెందిన సిక్కు మోడల్ హర్నామ్ కౌర్. ఆగ్నేయ ఇంగ్లండ్ బెర్క్ షైర్ ప్రాంతంలో ఆమె నివాసం ఉంటోంది. అయితే ఆమె ఏకంగా ఆరు అంగుళాల పొడవుగా గడ్డం పెంచేసింది. ఆమెను చూసిన వాళ్లు ఔరా అని అశ్చర్యపోతుంటారు. ఈ విషయాన్ని తెలుసుకుని గిన్నిస్బుక్ వాళ్లూ ఆమెకు రికార్డు ఇచ్చేశారు. అతి పిన్న వయసు (24 ఏళ్ల 282 రోజులు)లో ఇలా భారీ స్థాయిలో గడ్డం పెంచిన మహిళగా ఆమె ప్రపంచ రికార్డు నెలకొల్పినట్లు గిన్నిస్ వారు ప్రశంసాపత్రం అందజేశారు. గిన్నిస్ బుక్లో తన పేరు నమోదు కావడంపై ఆమె హర్షం వ్యక్తం చేసింది. 2016తన జీవితంలో మరిచిపోలేని ఏడాది అని, గత మార్చిలో లండన్ ఫ్యాషన్ వీక్ లో గడ్డంతో పాల్గొన్న తొలి మహిళా మోడల్ తానని వెల్లడించింది. గడ్డం కథ ఇదే.. చిన్నప్పటి నుంచి హర్నామ్ కౌర్ పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ తో బాధపడుతోంది. దీని కారణంగా పురుషులకు వచ్చినట్లే ఆమెకు యుక్త వయసు రాగానే మీసం, గడ్డం వస్తున్నాయి. ఇది చూసి ఆమె తోటివాళ్లు ఆటపట్టించేవారు. అయినా సరే ఏదైనా సాధిస్తానని ఆత్మవిశ్వాసంతో నలుగురిలో ధైర్యంగా తిరగటం అలవాటు చేసుకుంది. గిన్నిస్ రికార్డుతో తన ఆత్మవిశ్వాసం రెట్టింపయిందని, తాను ఏదైనా సాధించగలనని మోడల్ హర్నామ్ కౌర్ ధీమా వ్యక్తం చేసింది.