వేర్వేరు కారణాలతో ముగ్గురి ఆత్మహత్య
యాదగిరిగుట్ట : జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో ముగ్గురు వేర్వేరు కారణాలతో ఆత్మహత్యకు పాల్పడ్డారు. వివరాలిలా.. యాదగిరి గుట్ట మండలం మహబూబ్పేట లో గురువారం సంతోష (36 ) అనే మహిళ ఆర్థిక ఇబ్బం దులు తాళలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. కొంత కాలంగా సంతోష కుటుంబం ఆర్థిక ఇబ్బం దులతో కొట్టుమిట్టాడుతోంది. భర్త మల్లేశ్ అనారోగ్యం పాలవగా, కష్టపడి ఇద్దరు పిల్లలను చదివిస్తోంది. వారి కున్న రెండెకరాల్లో వేసిన పత్తి వర్షాలు లేక ఎదగడంలేదు. దీంతో ఆమె కొంత కాలంగా మనోవేదనకు గురవుతుం డేది. ఈ నేపథ్యంలో గురువారం తెల్లవారుజామున పొలానికి వెళ్లి అక్కడే పురుగుల మందు తాగింది. ఆమె పరిస్థితిని గమనించిన చుట్టుపక్క రైతులు ద్విచక్రవాహనంపై భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సాయంత్రం మృతి చెందింది. కేసు నమోదుచేసినట్టు ఎస్ఐ రాజశేఖర్రెడ్డి తెలిపారు.
పిట్టంపల్లిలో వ్యక్తి..
చిట్యాల : ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తి గురువారం వైద్యం పొందుతూ మృతి చెందినట్లు చిట్యాల ఏఎస్ఐ నాగలక్ష్మి తెలిపారు. మండలంలోని పిట్టంపల్లికి చెందిన బిల్లపాటి కృష్ణారెడ్డి(52) కొన్నిరోజులుగా ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతుండేవాడు. ఈ నేపథ్యంలో మనస్తాపానికి గురై ఈనెల 2వ తేదిన గ్రామ శివారులోని పొలంలో పురుగులమందు తాగాడు. చాలాసేపటి తర్వాత గుర్తించిన కుటుంబసభ్యులు అదేరోజు హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. నాల్గురోజులుగా చికిత్స పొందుతున్న కృష్ణారెడ్డి గురువారం ఉదయం చనిపోయాడు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసినట్లు ఏఎస్ఐ తెలిపారు.
తమ్ముడు మందలించాడని..
భువనగిరి అర్బన్ : కల్లు తాగొద్దని తమ్ముడు మందలించడంతో భువనగిరి పట్టణానికి చెందిన బుక్కా విజయేందర్(25)ను అనే యువకుడు మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడాడు. తండ్రి బుక్కా నర్సింహ్మ ఇటీవలే చనిపోయాడు. అప్పటినుంచి కల్లుకు బానిసైన విజయేందర్ పనులు మానేసి తాగుతుండేవాడు. అన్న పరిస్థితి చూడలేక అతని తమ్ముడు గట్టిగా మందలించడంతో మనస్తాపానికి గురై పగిడిపల్లి-భువనగిరి రైల్వేష్టేషన్ల మధ్య ఉన్న పట్టాలపై రైలుకిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటనపై రైల్వే ఎస్ఐ దయాకర్ కేసు నమోదుచేసుకొని పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.