బెల్టుషాపులపై ఉద్యమం
అనంతపురం అర్బన్ : మద్యం వ్యాపారాన్ని నియంత్రించి, బెల్టుషాపులను ప్రభుత్వం ఎత్తివేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని మహిళ సంఘాల నాయకురాళ్లు హెచ్చరించారు. బెల్టుషాపులు ఎత్తివేయాలనే అంశంపై శనివారం స్థానిక నీలం రాజశేఖర్రెడ్డి భవన్లో ఏపీ మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి ఎ.పద్మావతి అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఐద్వా జిల్లా కార్యదర్శి సావిత్రి, వైఎస్ఆర్ మహిళ విభాగం నగర అధ్యక్షురాలు శ్రీనదేవి, హెచ్ఆర్సీ ప్రతినిధి మునీరా, మహిళ సమాఖ్య గౌరవాధ్యక్షురాలు చిరంజీవమ్మ, జిల్లా అధ్యక్షురాలు వరలక్ష్మి మాట్లాడారు.
బెల్టు షాపులు ఎత్తివేసి, మద్యాన్ని నియంత్రిస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ ఇచ్చారన్నారు. అధికారంలోకి వచ్చి మూడేళ్లవుతున్నా హామీని నిలబెట్టుకోలేదని దుమ్మెత్తిపోశారు. మద్యం వల్ల నేరాలు ఎక్కువవుతున్నాయని, ప్రత్యేకించి మహిళలపై దాడులు, అత్యాచారాలు చోటు చేసుకుంటున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి మద్యపానాన్ని అరికట్టాలని, బెల్టుషాపులు ఎత్తివేయాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మహిళా సమాఖ్య ఉపాధ్యక్షురాలు పార్వతిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.