కిడ్నాప్ కాదు.. హైడ్రామా..!
{పియుడితో కలసి వెళ్లిపోయి కిడ్నాప్ డ్రామా ఆడిన మహిళ
రాజేంద్రనగర్‌లో మహిళ కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు
హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన రాజేంద్రనగర్‌లో మహిళ కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. ఇంటి నుంచి వెళ్లిపోయి ప్రియుడితో కలసి ఆ మహిళే కిడ్నాప్ డ్రామా ఆడినట్లు పోలీసులు నిర్ధారించారు. శంషాబాద్ డీసీపీ శ్రీనివాస్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని ఉప్పర్‌పల్లికి చెందిన మహేశ్‌కుమార్, రాధిక అలియాస్ అరుణజ్యోతి(23) భార్యాభర్తలు. ఈ నెల 6న గుడికి వెళుతున్నట్లు చెప్పి వెళ్లిన రాధిక తిరిగి ఇంటికి రాలేదు. దీంతో మహేశ్ 7వ తేదీన రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే 10వ తేదీన మహేశ్ మొబైల్ ఫోన్‌కు వాట్సప్‌లో రాధికను హింసిస్తున్న ఫొటోలు వచ్చాయి. రాధికను కి డ్నాప్ చేశామని, రూ. మూడు లక్షలు ఇస్తే ఆమెను వదిలేస్తామంటూ గుర్తుతెలియని వ్యక్తి మహేశ్‌కు మెసేజ్ పంపాడు. దీంతో రాజేంద్రనగర్ పోలీసులకు మహేశ్ సమాచారం అందించడంతో సెల్ నంబర్ ఆధారంగా నిందితుడు రిజ్వాన్ అని గుర్తించారు. అతను కోల్‌కతాలో ఉన్నట్లు గుర్తించి అక్కడికి వెళ్లి రిజ్వాన్‌తో పాటు కిడ్నాప్ డ్రామా ఆడిన రాధికను కూడా అరెస్ట్ చేసి నగరానికి తీసుకువచ్చారు.
పాత పరిచయంతోనే: రాధికకు 2011లో సోషల్ నెట్వర్క్ ద్వారా బిహార్‌కు చెందిన రిజ్వాన్(20)తో పరిచయం ఏర్పడింది. అతడు ఖైరతాబాద్‌లోని ఓ హోటల్లో పనిచేసేవాడు.
ఈ నెల 6న రిజ్వాన్ రాధికకు ఫోన్ చేయడంతో అతడిని కలిసేందుకు అత్తాపూర్ కాలహనుమాన్ ఆలయం వద్దకు వెళ్లింది. ఆ తర్వాత ఇద్దరు కలసి ఎక్కడికైనా వెళ్లి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని, అక్కడి నుంచి కోల్‌కతాకు పారిపోయారు. రిజ్వాన్ వద్ద ఉన్న డబ్బు ఖర్చయిపోవడంతో మహేశ్ దగ్గర నుంచి డబ్బు గుంజాలనే ఉద్దేశంతో ఇద్దరూ కలసి కిడ్నాప్ డ్రామాకు తెరతీశారు. రాధిక చేతులు కట్టిపడేసి, సింధూరం నీళ్లు ఆమెపై చల్లి చిత్రహింసలు పెడుతున్నట్లుగా వీడియో తీసిన రిజ్వాన్ దానిని మహేశ్‌కు పంపించాడు. రాధికను విడిచిపెట్టాలంటే రూ.3 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. సెల్ నంబర్ ఆధారంగా కేసును చేధించిన పోలీసులు ఇద్దరినీ కోల్‌కతాలో అదుపులోకి తీసుకున్నారు. రాధికపై కూడా కేసు నమోదు చేసినట్లు శంషాబాద్ డీసీపీ శ్రీనివాస్ తెలిపారు.