సమాజంలో మహిళల పాత్ర కీలకం
సూర్యాపేట : ప్రస్తుత సమాజంలో మహిళల పాత్రే కీలకమని రాష్ట్ర విద్యుత్, ఎస్సీ కులాల అభివృద్ధి శాఖామంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. మంగళవారం సూర్యాపేట పబ్లిక్‌క్లబ్‌లో భానుపురి మహిళా సమాఖ్య ప్రథమ సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రవేశపెడుతున్న ప్రతి సంక్షేమ పథకాన్ని కూడా మహిళల పేరున అమలు చేస్తున్నట్లు తెలిపారు. అభివృద్ధిలో కీలకపాత్ర పోషించేది మహిళలేనని..
సమాజం కుటుంబ వ్యవస్థపై ఆధారపడి ఉంటుందన్నారు. కుటుంబం మహిళల చైతన్యంపై మనుగడ సాధిస్తుందని పేర్కొన్నారు. జిల్లాలోని 2 లక్షల మంది స్వయం సహాయక సంఘాల మహిళలు నడుం బిగించి రాష్ట్రంలోనే సూర్యాపేట జిల్లాను అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపారని చెప్పారు. కుటుంబ వార్షిక ఆదాయాన్ని పెంచే విధంగా ప్రభుత్వం ఇస్తున్న ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం జిల్లాలోని 799 మహిళ స్వయం సహాయ సంఘాలకు రూ. 25 కోట్ల చెక్కును పంపిణీ చేశారు. కలెక్టర్ కె.సురేంద్రమోహన్ మాట్లాడుతూ సామాజిక మార్పు, ఆర్థికాభివృద్ధికి స్వయం సహాయక సంఘాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు.
నూతనంగా ఏర్పడిన సూర్యాపేట జిల్లాలోని 584 గ్రామ సంఘాలు, 18148 స్వయం సహాయక సంఘాల్లోని 2 లక్షల మంది సభ్యులకు మార్గనిర్దేశం చేసేందుకు భానుపురి జిల్లా సమాఖ్యను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. 2016-17లో అర్హత కలిగిన 13,286 సంఘాలకు రూ. 215 కోట్ల లింకేజీని ఇవ్వాలని లక్ష్యం నిర్ణయిస్తే ఇప్పటివరకు 3723 సంఘాలకు రూ.119 కోట్ల 17 లక్షల లింకేజీ ఇచ్చినట్లు తెలిపారు. అలాగే స్త్రీనిధి ద్వారా 6075 సంఘాలకు రూ.68 కోట్ల ఆర్థిక సహాయాన్ని అందించినట్లు చెప్పారు. ఈ ఖరీఫ్ రూ. 5 కోట్ల విలువైన ధాన్యాన్ని మహిళ సంఘాల ద్వారా ఇప్పటి వరకు కొనుగోలు చేయించినట్లు పేర్కొన్నారు.
తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ మాట్లాడుతూ స్వయం సహాయ సంఘాలు నిజాయితీగా ప్రభుత్వం ఇచ్చిన సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ గండూరి ప్రవళిక మాట్లాడుతూ ప్రభుత్వం మహిళల సంక్షేమానికి ఎనలేని కృషి చేస్తుందన్నారు. కార్యక్రమంలో ఎస్పీ జె.పరిమళహననూతన్, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు నీలిమ, ఉపాధ్యక్షురాలు నాగేంద్ర, కోశాధికారి లక్ష్మమ్మ, డీఆర్డీఓ సుందరి కిరణ్‌కుమార్, లీడ్ బ్యాంకు మేనేజర్ సూర్యం, ఈఎస్ శ్రీనివాసరావు, డీఎఫ్ఓ సోహెల్, వ్యవసాయ శాఖ అధికారిని జ్యోతిర్మయి, కమిషనర్ సురేందర్ పాల్గొన్నారు.