woman president
-
స్వాతిముత్యం: ఆరోగ్యం ఆనందం
చాలామంది వ్యక్తిగత, వృత్తిగత జీవితాన్ని రెండు ప్రపంచాలు చేసుకుంటారు. సరిహద్దులు గీసుకుంటారు. స్వాతి పిరామల్‌కు మాత్రం అలాంటి సరిహద్దులు లేవు. తనకు వైద్యరంగం అంటే ఎంత ఇష్టమో, ఇష్టమైన వంటకాలను చేయడం అంటే కూడా అంతే ఇష్టం. స్వాతి ఆధ్వర్యంలో జరిగే బోర్డ్ మీటింగ్‌లలో హాట్ హాట్ చర్చలే కాదు, ఆమె వండిన హాట్ హాట్ వంటకాలు కూడా దర్శనమిస్తాయి. ‘ఉరుకులు, పరుగులు వద్దు. కూల్‌గా, నవ్వుతూ పనిచేద్దాం’ అని తరచు చెప్పే శాస్త్రవేత్త, పారిశ్రామికవేత్త స్వాతి పిరామల్ తాజాగా ఫ్రాన్స్ అత్యున్నత పౌరపురస్కారం ‘ది షెవాలియే డి లా లీజియన్ దానర్ ఆర్ నైట్ ఆఫ్ ది లీజియన్ ఆఫ్ హానర్’ అందుకున్నారు. అంతగా పరిచయం అక్కర్లేని పేరు స్వాతి పిరామల్. సంప్రదాయ గుజరాతీ కుటుంబానికి చెందిన స్వాతి తొలిసారి అడుగుపెట్టింది మాత్రం తనకు ఎంతమాత్రం పరిచయం లేని రంగంలోకి! ఆస్ట్రేలియన్ ఫార్మాస్యూటికల్ కంపెనీ నికోలస్ లేబోరేటరీస్ కొనుగోలు చేసినప్పుడు తనకు, భర్త అజయ్ పిరామల్‌కు బొత్తిగా ఏమీ తెలియదు. తన చేతిలో మాత్రం ఎంబీబీయస్ డిగ్రీ ఉంది. నడుస్తూ నడుస్తూనే, ప్రయాణిస్తూనే ఎన్నో విషయాలు తెలుసుకున్నారు. రాత్రనకా, పగలనకా కష్టపడ్డారు. ఆ కష్టం వృథా పోలేదు. అనతి కాలంలోనే కంపెనీ అగ్రస్థానంలోకి వెళ్లింది. ఈ రంగానికి సంబంధించిన పనితీరు విషయానికి వస్తే ‘ఇలాగే’ అన్నట్లుగా ఉండేది. ‘ఇలా కూడా చేయవచ్చు’ అని కూల్‌గా నిరూపించింది స్వాతి పిరామల్. ‘వ్యక్తిగత, వృత్తిజీవితాలకు మధ్య ఉండే సరిహద్దు రేఖను స్వాతి చెరిపేశారు’ అనే మాట వినబడుతుంటుంది. అయితే ఈ కామెంట్‌ను ఆమె ప్రశంసగానే స్వీకరిస్తుంది. ఇంట్లో వంట చేస్తూనే, టీ తయారు చేస్తూనే క్లయింట్స్‌తో స్వాతి మాట్లాడే దృశ్యం సా«ధారణం. చాలా సందర్భాల్లో క్లయింట్స్ ఆమె ఆతిథ్యం స్వీకరిస్తూనే వ్యాపార విషయాలు మాట్లాడుతుంటారు. ఈ దృశ్యాన్ని చూస్తుంటే స్వాతి తన బంధువులు, స్నేహితులతో కలిసి భోజనం చేస్తున్నట్లు అనిపిస్తుంది తప్ప క్లయింట్స్‌తో కలిసి బిజినెస్ విషయాలు చర్చిస్తున్నట్లుగా ఉండదు! ‘ఔషధాలను అమ్మడానికి మాత్రమే మా పని పరిమితమైనది కాదు. సమస్యలకు పరిష్కారాలు అన్వేషించడం, ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం ముందు జాగ్రత్తలు సూచించి, ఆచరించేలా చేయడం కూడా’ అంటుంది స్వాతి పిరామల్. ఇండియా అపెక్స్ చాంబర్ ఆఫ్ కామర్స్ తొలి మహిళా ప్రెసిడెంట్‌గా చరిత్ర సృష్టించిన స్వాతి పిరామల్ సైన్స్, ఔషధరంగాల్లో సేవలు, భారత్–ఫ్రాన్స్ సంబంధాల బలోపేతానికి చేస్తున్న కృషికి తాజాగా ఫ్రాన్స్ అత్యున్నత పౌర పురస్కారం అందుకుంది. ‘మీ ఖాతాలో ఇన్ని విజయాలు ఉన్నాయి కదా, మీరు ఏ విజయాన్ని చూసి ఎక్కువ గర్వపడతారు?’ అని అడిగితే – ‘ఏదీ లేదు’ అని గలగలమని నవ్వుతుంది స్వాతి. మనం ఆశ్చర్యం నుంచి తేరుకునేలోపే ఇలా అంటుంది... ‘నా మనవరాలు తన రిపోర్ట్ కార్డ్‌తో నవ్వుతూ నా వైపు పరుగెత్తుకు వస్తున్న దృశ్యాన్ని చూస్తున్నప్పుడు, ఈ ప్రపంచంలో అత్యున్నత స్థానంలో ఉన్నట్లు గర్వపడతాను’. ముంబై కేంద్రంగా పనిచేస్తున్న పిరామల్ గ్రూప్ వైస్–చైర్పర్సన్ స్వాతి పిరామల్ ఎన్నో విజయాలు దక్కించుకున్న పారిశ్రామికవేత్త మాత్రమే కాదు. ‘సమాజానికి తిరిగి ఇవ్వాలి’ అనే సిద్ధాంతాన్ని బలంగా నమ్ముతున్న వ్యక్తి. వ్యాపార రంగంలోకి అడుగుపెట్టక ముందు మెడికల్ స్కూల్ ఫ్రెండ్స్‌తో కలిసి ఉచిత వైద్యశిబిరాలు నిర్వహించేది. ఆరోగ్య విషయాలపై వీధి నాటికలు తయారు చేసి ఫ్రెండ్స్‌తో కలిసి వాటిలో నటించేది. ప్రస్తుతం ‘పిరామల్ ఫౌండేషన్’ తరపున సామాజికసేవా కార్యక్రమాలు చేపడుతోంది. ‘ప్రజల ఆరోగ్యం, ఆవిష్కరణలు, కొత్త ఔషధాలపైనే నా ప్రధాన దృష్టి’ అని చెబుతుంది స్వాతి పిరామల్. -
టాంజానియా సామియా!
పురుషులతో సమానంగా రాజకీయాలను శాసిస్తున్నారు నేటితరం మహిళలు. న్యూజిలాండ్, బార్బడోస్, డెన్మార్క్, ఈస్టోనియా వంటి దేశాలను మహిళా అధ్యక్షులు సమర్థవంతంగా పాలిస్తూ... దేశాభివృద్ధిలో తమదైన ముద్ర వేస్తున్నారు. తాజాగా ఈ దేశాల సరసన టాంజానియా దేశం కూడా చేరింది. టాంజానియా దేశపు మాజీ అధ్యక్షుడు మరణించడంతో.. ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వహిస్తోన్న సామియా సులుహు హసన్ దేశపు తొలి మహిళా అధ్యక్షురాలిగా శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. తూర్పు ఆఫ్రికా దేశమైన టాంజానియా చరిత్రలో ఇప్పటివరకు మహిళలెవరూ అధ్యక్షులు కాలేదు. మూడురోజుల క్రితం మాజీ అధ్యక్షుడు జాన్ మగుఫులీ కరోనా, గుండెసంబంధ సమస్యలతో మరణించారు. దీంతో ఉపాధ్యక్షురాలైన సామియా సులుహు హసన్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టి దేశంలో తొలి మహిళా అధ్యక్షురాలిగా చరిత్ర సృష్టించారు. టాంజానియా రాజ్యాంగం ప్రకారం.. ఏదైనా కారణంతోగానీ, లేదా అధ్యక్షుడు మరణించినప్పుడు ఉపాధ్యక్షులుగా ఉన్నవారే అధ్యక్ష బాధ్యతలను చేపట్టాల్సి ఉంటుంది. అంతకుముందు ఉన్న అధ్యక్షుడి పదవీ కాలం ఎన్ని సంవత్సరాలు ఉంటే అన్ని ఏళ్లు అధ్యక్షులుగా కొనసాగవచ్చు. 1960 జనవరి 27 పుట్టిన సామియా అంచెలంచెలుగా ఎదుగుతూ దేశానికి అధ్యక్షురాలుగా ఎదిగారు. అత్యధికంగా ముస్లిం జనాభా కలిగిన జంజీబార్ ప్రాంతంలో పుట్టిన సమియాను పిపోడే అని ప్రేమగా పిలుస్తారు. జంజీబార్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్షియల్‌లో స్టాటిస్టిక్స్ చదివిన సామియా, ముజంబే యూనివర్సిటీలో అడ్వాన్స్డ్ డిప్లామా ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో డిగ్రీ పట్టాపొందారు. సామియా సెకండరీ ఎడ్యుకేషన్ పూర్తయ్యాక ప్రణాళికా, అభివృద్ధి మంత్రిత్వ శాఖ లో క్లర్క్‌గా పనిచేశారు. ఆ తరువాత ఆమె డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా మాంచెస్టర్ యూనివర్సిటీ నుంచి ఎకనామిక్స్‌లో పోస్టుగ్రాడ్యుయేట్ డిప్లొమా పట్టా పొందారు. వ్యవసాయ అధికారి హఫీద్ అమీర్‌ను సామియా వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమార్తె, ముగ్గురు కుమారులు. సామియా కుమార్తె కూడా జంజీబార్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌లో సభ్యురాలిగా పనిచేస్తున్నారు. రాజకీయాల్లో సామియాది 20 ఏళ్ల ప్రస్థానం. 2000వ సంవత్సరంలో లో రాజకీయాల్లో ప్రవేశించిన ఆమె.. జంజీబార్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ కు ప్రత్యేక సభ్యురాలిగా ఎంపికయ్యారు. అప్పటి టాంజానియా అధ్యక్షుడు అమనీ అబేది కరుమే క్యాబినెట్లో ఉన్నతస్థాయి మహిళా మంత్రిగా కూడా పనిచేశారు. జంజీబార్ పర్యాటక శాఖ, ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్, యూత్ ఎంప్లాయిమెంట్, మహిళా శిశు అభివృద్ధి శాఖా మంత్రిగా పనిచేశారు. రాష్ట్ర మంత్రిగానేగాక, కేంద్ర వ్యవహారాల ఇంఛార్జి మంత్రిగా కూడా ఆమె పనిచేశారు. మకుండుచి నియోజక వర్గ ఎంపీగా 2010 నుంచి2015 వరకు బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న చామా చా మాపిండుజీ(సీసీఎం) పార్టీతరపున 2015లో యునైటెడ్ రిపబ్లిక్ ఆఫ్ టాంజానియాకు సమియా పదో వైస్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టారు. జంజీబార్ నుంచి ఎన్నికైన తొలి ప్రెసిడెంట్‌గానూ, తూర్పు ఆఫ్రికా దేశాల్లో రెండో మహిళా ప్రెసిడెంట్‌గానూ సామియా నిలుస్తారు. ఆఫ్రికా దేశమైన రువాండాకు 1993 జూలై 18 నుంచి అగాతే ఉవిలింగియమానైన్ తొలి మహిళా అధ్యక్షురాలిగా పనిచేశారు. ఈమె మరణించే వరకు పదవిలో కొనసాగారు. తాజాగా బాధ్యతలు చేపట్టిన సామియా 2025 వరకు పదవిలో కొనసాగనున్నారు. టాంజానియా అధ్యక్షురాలిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సామియా సులుహు హసన్ -
త్వరలో యూఎస్ కు మహిళ దేశాధ్యక్షురాలు
అమెరికా అధ్యక్ష పీఠాన్ని అతి త్వరలో మహిళ అధిరోహించనుందని ప్రస్తుత దేశాధ్యక్షుడు ఒబామా సతీమణి మిషెల్లీ ఒబామా వెల్లడించారు. మహిళ అధ్యక్షురాలిని ఎన్నుకునేందుకు యూఎస్ సిద్ధంగా ఉందని తెలిపారు. మంగళవారం వాషింగ్టన్లో యూఎస్ అధ్యక్ష భవనం సిబ్బంది కుటుంబ సభ్యులతో ఏర్పాటు చేసిన భేటీలో మిషెల్లీ పాల్గొన్నారు. ఈ సందర్బంగా రానున్న ఎన్నికల్లో మహిళ దేశాధ్యక్షురాలిగా ఎన్నికవుతారా అంటూ వారు అడిగిన ప్రశ్నకు మిషెల్లీ ఒబామాపై విధంగా స్పందించారు. దేశంలో ఎవరైనా అధ్యక్ష పీఠాన్ని అధిరోహించవచ్చు అని అన్నారు. అందుకు కులమతాలు, ఆర్థిక అసమానతలు ఎట్టి పరిస్థితుల్లో అడ్డుగోడలు కావని మిషెల్లి వివరించారు. మిషెల్లీ చెప్పిన సమాధానంతో వైట్ హౌస్ ప్రాంగణం చప్పట్లతో మారు మోగింది. అయితే 2016లో అమెరికా దేశాధ్యక్ష పదవికి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో యూఎస్ మాజీ సెక్రటరీ ఆఫ్ స్టేట్ హిల్లరీ క్లింటన్ ఆ ఎన్నికల బరిలో డెమోక్రటిక్ అభ్యర్థిగా అధ్యక్ష పదవికి పోటీచేయనున్న సంగతి తెలిసిందే.