టాంజానియా సామియా! | Samia Suluhu Hassan becomes Tanzania first woman President | Sakshi
Sakshi News home page

టాంజానియా సామియా!

Published Sat, Mar 20 2021 6:30 AM | Last Updated on Sat, Mar 20 2021 6:30 AM

Samia Suluhu Hassan becomes Tanzania first woman President - Sakshi

సామియా సులుహు హసన్‌

పురుషులతో సమానంగా రాజకీయాలను శాసిస్తున్నారు నేటితరం మహిళలు. న్యూజిలాండ్, బార్బడోస్, డెన్మార్క్, ఈస్టోనియా వంటి దేశాలను మహిళా అధ్యక్షులు సమర్థవంతంగా పాలిస్తూ... దేశాభివృద్ధిలో తమదైన ముద్ర వేస్తున్నారు. తాజాగా ఈ దేశాల సరసన టాంజానియా దేశం కూడా చేరింది. టాంజానియా దేశపు మాజీ అధ్యక్షుడు మరణించడంతో.. ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వహిస్తోన్న సామియా సులుహు హసన్‌ దేశపు తొలి మహిళా అధ్యక్షురాలిగా శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు.

తూర్పు ఆఫ్రికా దేశమైన టాంజానియా చరిత్రలో ఇప్పటివరకు మహిళలెవరూ అధ్యక్షులు కాలేదు. మూడురోజుల క్రితం మాజీ అధ్యక్షుడు జాన్‌ మగుఫులీ కరోనా, గుండెసంబంధ సమస్యలతో మరణించారు. దీంతో ఉపాధ్యక్షురాలైన సామియా సులుహు హసన్‌ అధ్యక్ష  బాధ్యతలు చేపట్టి దేశంలో తొలి మహిళా అధ్యక్షురాలిగా చరిత్ర సృష్టించారు.     

టాంజానియా రాజ్యాంగం ప్రకారం.. ఏదైనా కారణంతోగానీ, లేదా అధ్యక్షుడు మరణించినప్పుడు ఉపాధ్యక్షులుగా ఉన్నవారే అధ్యక్ష బాధ్యతలను చేపట్టాల్సి ఉంటుంది. అంతకుముందు ఉన్న అధ్యక్షుడి పదవీ కాలం ఎన్ని సంవత్సరాలు ఉంటే అన్ని ఏళ్లు అధ్యక్షులుగా కొనసాగవచ్చు.

1960 జనవరి 27 పుట్టిన సామియా అంచెలంచెలుగా ఎదుగుతూ దేశానికి అధ్యక్షురాలుగా ఎదిగారు. అత్యధికంగా ముస్లిం జనాభా కలిగిన జంజీబార్‌ ప్రాంతంలో పుట్టిన సమియాను పిపోడే అని ప్రేమగా పిలుస్తారు. జంజీబార్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫైనాన్షియల్‌లో స్టాటిస్టిక్స్‌ చదివిన సామియా, ముజంబే యూనివర్సిటీలో అడ్వాన్స్‌డ్‌ డిప్లామా ఇన్‌ పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌లో డిగ్రీ పట్టాపొందారు. సామియా సెకండరీ ఎడ్యుకేషన్‌ పూర్తయ్యాక ప్రణాళికా, అభివృద్ధి మంత్రిత్వ శాఖ లో క్లర్క్‌గా పనిచేశారు. ఆ తరువాత ఆమె డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌ ద్వారా మాంచెస్టర్‌ యూనివర్సిటీ నుంచి ఎకనామిక్స్‌లో పోస్టుగ్రాడ్యుయేట్‌ డిప్లొమా పట్టా పొందారు.

వ్యవసాయ అధికారి హఫీద్‌ అమీర్‌ను సామియా వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమార్తె, ముగ్గురు కుమారులు. సామియా కుమార్తె కూడా జంజీబార్‌ హౌస్‌ ఆఫ్‌ రిప్రజెంటేటివ్స్‌లో సభ్యురాలిగా పనిచేస్తున్నారు.

రాజకీయాల్లో సామియాది 20 ఏళ్ల ప్రస్థానం. 2000వ సంవత్సరంలో లో రాజకీయాల్లో ప్రవేశించిన ఆమె.. జంజీబార్‌ హౌస్‌ ఆఫ్‌ రిప్రజెంటేటివ్‌ కు ప్రత్యేక సభ్యురాలిగా ఎంపికయ్యారు. అప్పటి టాంజానియా అధ్యక్షుడు అమనీ అబేది కరుమే క్యాబినెట్‌లో ఉన్నతస్థాయి మహిళా మంత్రిగా కూడా పనిచేశారు. జంజీబార్‌ పర్యాటక శాఖ, ట్రేడ్‌ అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్, యూత్‌ ఎంప్లాయిమెంట్, మహిళా శిశు అభివృద్ధి శాఖా మంత్రిగా  పనిచేశారు. రాష్ట్ర మంత్రిగానేగాక, కేంద్ర వ్యవహారాల ఇంఛార్జి మంత్రిగా కూడా ఆమె పనిచేశారు. మకుండుచి నియోజక వర్గ ఎంపీగా 2010 నుంచి2015 వరకు బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న చామా చా మాపిండుజీ(సీసీఎం) పార్టీతరపున  2015లో యునైటెడ్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ టాంజానియాకు సమియా పదో వైస్‌ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టారు.    

జంజీబార్‌ నుంచి ఎన్నికైన తొలి ప్రెసిడెంట్‌గానూ, తూర్పు ఆఫ్రికా దేశాల్లో రెండో మహిళా ప్రెసిడెంట్‌గానూ సామియా నిలుస్తారు. ఆఫ్రికా దేశమైన రువాండాకు 1993 జూలై 18 నుంచి అగాతే ఉవిలింగియమానైన్‌ తొలి మహిళా అధ్యక్షురాలిగా పనిచేశారు. ఈమె మరణించే వరకు పదవిలో కొనసాగారు. తాజాగా బాధ్యతలు చేపట్టిన సామియా 2025 వరకు పదవిలో కొనసాగనున్నారు.


టాంజానియా అధ్యక్షురాలిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సామియా సులుహు హసన్‌
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement