త్వరలో యూఎస్ కు మహిళ దేశాధ్యక్షురాలు
అమెరికా అధ్యక్ష పీఠాన్ని అతి త్వరలో మహిళ అధిరోహించనుందని ప్రస్తుత దేశాధ్యక్షుడు ఒబామా సతీమణి మిషెల్లీ ఒబామా వెల్లడించారు. మహిళ అధ్యక్షురాలిని ఎన్నుకునేందుకు యూఎస్ సిద్ధంగా ఉందని తెలిపారు. మంగళవారం వాషింగ్టన్లో యూఎస్ అధ్యక్ష భవనం సిబ్బంది కుటుంబ సభ్యులతో ఏర్పాటు చేసిన భేటీలో మిషెల్లీ పాల్గొన్నారు. ఈ సందర్బంగా రానున్న ఎన్నికల్లో మహిళ దేశాధ్యక్షురాలిగా ఎన్నికవుతారా అంటూ వారు అడిగిన ప్రశ్నకు మిషెల్లీ ఒబామాపై విధంగా స్పందించారు.
దేశంలో ఎవరైనా అధ్యక్ష పీఠాన్ని అధిరోహించవచ్చు అని అన్నారు. అందుకు కులమతాలు, ఆర్థిక అసమానతలు ఎట్టి పరిస్థితుల్లో అడ్డుగోడలు కావని మిషెల్లి వివరించారు. మిషెల్లీ చెప్పిన సమాధానంతో వైట్ హౌస్ ప్రాంగణం చప్పట్లతో మారు మోగింది. అయితే 2016లో అమెరికా దేశాధ్యక్ష పదవికి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో యూఎస్ మాజీ సెక్రటరీ ఆఫ్ స్టేట్ హిల్లరీ క్లింటన్ ఆ ఎన్నికల బరిలో డెమోక్రటిక్ అభ్యర్థిగా అధ్యక్ష పదవికి పోటీచేయనున్న సంగతి తెలిసిందే.