ఆ ఇద్దరు ట్రంప్‌పై దుమ్మెత్తిపోశారు!
రిపబ్లికన్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేసేందుకు సిద్ధమవుతున్న డొనాల్డ్ ట్రంప్‌పై ఇద్దరు మహిళా నేతలు విరుచుకుపడ్డారు. డెమొక్రటిక్ పార్టీ ఫ్రంట్ రన్నర్ హిల్లరీ క్లింటన్, అమెరికా ప్రథమ పౌరురాలు, అధ్యక్షుడు ఒబామా సతీమణి మిషెల్లి ఒబామా ట్రంప్ విధానాలపై దుమ్మెత్తిపోశారు.
సాన్‌బెర్నార్డినోలో జరిగిన ర్యాలీలో హిల్లర్లీ మాట్లాడుతూ ట్రంప్ అమెరికా అధ్యక్షుడైతే నియంత అయ్యే అవకాశముందని హెచ్చరించారు. మనకు అధ్యక్షుడు కావాలి కానీ నియంత కాదని ఆమె పేర్కొన్నారు. అమెరికాలోని వలసదారులను కించపరిచడం తప్ప ఆయన ప్రచారంలో మరేమీ లేదని, ఇది పూర్తిగా పొలిటికల్ స్టంటేనని ఆమె అభిప్రాయపడింది.
న్యూయార్క్ సిటీ కాలేజీలో మిషెల్లి ప్రసంగిస్తూ ట్రంప్ విధానాలను తప్పుబట్టారు. వలసదారులను అడ్డుకునేందుకు సరిహద్దుల్లో గోడలు కడతామన్న ట్రంప్ వ్యాఖ్యలు సరికావని ఆమె పేర్కొన్నారు. భయాలకు లొంగిపోయి గోడలు కడతామని అనుకోవడం సరికాదని, ఇతర దేశాల్లో జన్మించి ఇక్కడ స్థిర నివాసం ఏర్పరుచుకున్న చాలామంది అమెరికాను ప్రపంచంలో గొప్ప దేశంగా నిలబెట్టేందుకు కృషి చేశారని మిషెల్లి గుర్తుచేశారు.