woman thief arrested
-
మహిళా దొంగల ముఠా హల్చల్
సాక్షి, బోధన్: నవీపేట బస్టాండ్ ప్రాంగణంలో సోమవారం సాయంత్రం మహిళా దొంగల ముఠా హల్చల్ చేసింది. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన పది మంది మహిళల ముఠా వీధుల్లో పూసలు అమ్ముతున్నట్లు నమ్మించి, బస్టాండ్‌లో తోటి ప్రయాణికులతో మాట కలిపారు. బస్టాండ్‌లోకి వచ్చి పోమే ప్రయాణికులను గమనిస్తూనే చుట్టు పక్కల ప్రయాణికులతో మాటామంతి చేశారు. నవీపేటకు చెందిన ఓ మహిళ రూ.3 లక్షల చీటీ డబ్బులను బ్యాగులో వేసుకుని నిజామాబాద్ బస్సు ఎక్కింది. గమనించిన ముఠా సభ్యులు బస్సులో ఎక్కే ప్రయత్నం చేస్తూనే బ్యాగును పట్టుకున్నారు. గమనించిన సదురు మహిళ అప్రమత్తం కావడంతో తోటి ప్రయాణికులు ముఠాను మందలించారు. బస్సులోంచి దింపేశారు. సంతృప్తి చెందని ముఠా సభ్యులు ఎలాగైన పని కానించాలని మళ్లీ బస్టాండ్‌కు వచ్చారు. అంతలోనే హోల్‌సేల్ బట్టల దుకాణంలో మునీమ్‌గా పని చేసే నారాయణ నవీపేటలో రూ.48 వేల కలెక్షన్ చేసుకుని తిరుగు ప్రయాణానికి బస్టాండ్‌కు వెళ్లాడు. ఇతనిని గమనించిన ముఠా సభ్యులు చాకచాక్యంగా రూ.48 వేల బ్యాగును కొట్టేశారు. ఆ బ్యాగుతో ఇద్దరు మహిళలు ఆటోలో నిజామాబాద్ వైపు వెళ్లిపోయారు. గమనించిన బాధితుడు కేకలు వేస్తూ పరుగులు తీయగా రూ.10 వేలను కొద్ది దూరంలో పారేసి ఆటోలో వెళ్లిపోయారు. దీంతో స్థానికులు అనుమానాస్పదంగా ఉన్న మరో ఎనిమిది మంది మహిళలను నిలదీశారు. వారిని పోలీసులకు అప్పగించారు. బాధితుడు నారాయణ ఫిర్యాదు మేరకు అనుమానిత మహిళలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు. -
బస్సులో మహిళ చేతివాటం! ఏకంగా కండక్టర్‌కే..
సాక్షి, పట్నంబజారు(గుంటూరు): ఆర్టీసీ బస్సులో మహిళ చేతివాటం ప్రదర్శించిన ఘటన మంగళవారం జరిగింది. పాత గుంటూరు పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌వో సురేష్‌బాబు, ఆర్టీసీ బస్ కండక్టర్ కేబీ పరమానందం తెలిపిన వివరాల ప్రకారం... బాపట్ల డిపోకు చెందిన బస్సు మంగళవారం చేబ్రోలు చేరుకుంది. కండక్టర్ పరమానందం పక్కనే ఓ మహిళ నిలబడి ఉంది. చేబ్రోలు నుంచి నారాకోడూరు వరకు వచ్చే లోపల కొన్ని టిక్కెట్లు కొట్టిన ఆయన చిల్లర కోసం నగదు తీసుకుని ప్రయాణికులకు ఇచ్చారు. నారాకోడూరు నుంచి బస్సు బయలుదేరిన తర్వాత మరికొంత మంది ఎక్కటంతో టిక్కెట్లు ఇచ్చి బ్యాగును తెరవటంతో నగదు కనిపించలేదు. ఉలిక్కిపడ్డ కండక్టర్ పరమానందం ప్రయాణికులను నగదు విషయం అడిగారు. ఎవరిలోనూ స్పందనలేదు. అయితే ఒక మహిళ తీరు అనుమానాస్పదంగా ఉండటంతో కండక్టర్, డ్రైవర్లు నిలదీశారు. ఈ క్రమంలో ఆమె చీరలో నుంచి నగదు కిందపడటాన్ని గమనించి, మహిళ తీసిందని నిర్ధారణకు వచ్చారు. నేరుగా బస్సును స్టేషన్‌కు తీసుకెళ్లారు. సదరు మహిళను విచారించిన పాతగుంటూరు పీఎస్ ఎస్‌హెచ్‌వో సురేష్‌బాబు, ఆమె పేరు మరియమ్మ అని చెబుతోందని, అయితే అదీ కూడా సరైన పేరు అయి ఉండకపోవచ్చని అభిప్రాయపడ్డారు. సదరు మహిళను సీసీఎస్ పోలీసులకు అప్ప గించారు. కేసు చేబ్రోలు పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. సదరు మహిళ నుంచి కండక్టర్ రూ.17,400 స్వాధీనం చేసుకున్నారు. -
మాయమాటలతో కలిసిపోతుంది.. కొట్టేస్తుంది
తిరుపతి క్రైం: నగరంలో ఆటో, బస్సుల్లో ప్రయాణికులతో కలసిపోయి మాయమాటలతో హ్యాండ్‌బ్యాగ్‌లు, బంగారు ఆభరణాల చోరీకి పాల్పడే ఘరానా మహిళా దొంగను క్రైం పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. క్రైం డీఎస్పీ రవిశంకర్‌రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. తమిళనాడు రాష్ట్రం సేలం జిల్లా అట్టీయాంపట్టికి చెందిన రేవతి (34), ముత్తమ్మ, సెల్వి, లక్ష్మిలతో కలసి ముఠాగా ఏర్పడింది. వీరు తిరుపతిలో బస్సులు, ఆటోల్లో ప్రయాణికుల ఆభరణాలు చోరీ చేసే వారు. ఈ క్రమంలోనే దొంగిలించిన నగలను తిరుపతిలో అమ్ముకునేందుకు పథకం పన్నారు. మిగిలిన సభ్యుల కోసం ప్రధాన నిందితురాలు రేవతి తిరుపతి ఆర్టీసీ బస్టాండు వద్ద వేచి ఉండగా క్రైం సీఐ భాస్కర్‌రెడ్డి అరెస్టు చేశారు. 228 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.6.84 లక్షలు ఉంటుందని డీఎస్పీ పేర్కొన్నారు. ఈ ముఠాపై తిరుపతి క్రైం పోలీసు స్టేషన్ పరిధిలో 3 కేసులు, ఈస్టు పీఎస్ పరిధిలో ఒక కేసు నమోదైనట్లు పేర్కొన్నారు. మిగిలిన వారి కోసం గాలిస్తున్నామన్నారు. భారతిని చాక చక్యంగా అరెస్టు చేసిన సీఐ శరత్చంద్ర, పద్మలత, ఎస్ఐ రమేష్‌బాబులకు మనీ రివార్డులు వచ్చేలా ఎస్పీకి సిఫార్సు చేస్తామని డీఎస్పీ చెప్పారు. -
మహిళా దొంగ అరెస్టు
సాక్షి, ఒంగోలు క్రైం: బస్సుల్లో ప్రయాణిస్తున్న వారి బ్యాగులను మాయం చేసే మహిళా దొంగను ఒంగోలు సీసీఎస్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ఈ మేరకు సీసీఎస్ పోలీసులు సాయంత్రం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మహిళా దొంగకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. పోలీసుల కథనం ప్రకారం.. పేర్నమిట్టకు చెందిన వనర్చి శారద ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల బ్యాగులు మాయం చేయడంలో నేర్పరి. ఆమె వద్ద నుంచి నాలుగున్నర సవర్ల బంగారు ఆభరణాలు, వెండి కాళ్ల పట్టీలు స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ సుమారు రూ.లక్ష వరకు ఉంటుంది. టంగుటూరు ఎస్ఐ హజరత్తయ్య ఆధ్వర్యంలో సీసీఎస్ పోలీసులు టంగుటూరు బస్టాండ్ సెంటర్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న వనర్చి శారదను అదుపులోకి తీసుకొని విచారించడంతో ఆమె చేసిన దొంగతనాలు బయటపడ్డాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో దొంగతనాలు చేసినట్లు కూడా ఆమె అంగీకరించింది. మహిళా దొంగను పట్టుకున్న సీసీఎస్ ఎస్ఐ నారాయణ, ఏఎస్ఐ వెంకటేశ్వరరెడ్డి, బాలాజీనాయుడు, చంద్రశేఖర్, కోటయ్య, శేషు, రామకృష్ణలను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారని సీసీఎస్ డీఎస్పీ కేశన వెంకటేశ్వరరావు తెలిపారు. -
మహిళా దొంగ అరెస్ట్
ప్రొద్దుటూరు: స్థానిక ఎర్రగుంట్ల బైపాస్ రోడ్డులో మంగళవారం అనుమల శోభ అనే మహిళా దొంగను రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె నుంచి రూ.1 లక్షా 92 వేలు విలువ చేసే 95 గ్రాముల బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ వివరాలను సీఐ ఓబులేసు రూరల్ పోలీస్‌స్టేషన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. గతేడాది డిసెంబర్ 20న ఆటోనగర్ సమీపంలోని ఎఫ్జీ ఫంక్షన్ హాల్లో ఓ మహిళ బ్యాగ్‌లో నుంచి గుర్తుతెలియని వ్యక్తులు 90 గ్రాముల బంగారు నగలను చోరీ చేశారు. బాధితులు ఫిర్యాదు చేయడంతో అదే రోజు తాలుకా పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. అలాగే ఈ నెల 15న అన్వర్ థియేటర్ వద్ద ఓ మహిళ బస్సు ఎక్కుతుండగా గుర్తుతెలియని వ్యక్తి ఆమె బ్యాగులో ఉన్న ఐదు గ్రాముల బంగారు చైన్‌ను అపహరించాడు. ఈ రెండు కేసులకు సంబంధించి నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్న సమయంలో మంగళవారం ఎర్ర గుంట్ల బైపాస్‌రోడ్డు వద్ద ఉన్న అనుమల శోభ అక్కడికి వచ్చిన పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించింది. వెంటనే ఆమెను అదుపులోకి తీసుకొని బ్యాగును పరిశీలించగా చైను, జుంకీలు, నెక్లెస్, బుట్ట కమ్మలు ఉన్నాయి. బంగారు ఎక్కడిదని ప్రశ్నించగా ఎఫ్జీ ఫంక్షన్‌హాల్‌లోనూ, రెండు రోజుల క్రితం అన్వర్ థియేటర్ వద్ద బంగారు ఆభరణాలను చోరీ చేసినట్లు ఆమె అంగీకరించింది. కడపలోని రామాంజనేయపురానికి చెందిన శోభపై ప్రొద్దుటూరు వన్‌టౌన్, కడప వన్‌టౌన్, బద్వేలులో రెండు కేసులు ఉన్నాయి. ఈమె భర్త, అక్క, బావలు కూడా పాత నేరస్తులని, వారిపై కూడా కేసులున్నట్లు సీఐ తెలిపారు. ఆమెను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపిస్తున్నామన్నారు. విలేకరుల సమావేశంలో ఎస్ఐలు చలపతి, మహేష్, ఆంజనేయులు, జిఎండి బాషా, సిబ్బంది పాల్గొన్నారు.