బ్యాంకు క్యూలో మాజీ ప్రియుడు...
బ్యాంకుల వద్దకు డబ్బుల కోసం వెళ్తే ఇంకా చాలా పనులే అవుతున్నాయి. మహారాష్ట్రలోని నాసిక్‌లో ఇలాగే జరిగింది. ఒక మహిళ (23) డబ్బులు తెచ్చుకుందామని త్రయంబక్ రోడ్డులోని ఓ బ్యాంకు వద్దకు వెళ్తే.. అక్కడ క్యూలైనులో గతంలో ఆమెను మోసం చేసి పారిపోయిన మాజీ ప్రియుడు కనిపించాడు. అయితే.. అక్కడ ఇద్దరూ కలిశారనుకుంటే మీరు తప్పులో కాలేసినట్లే. నాలుగేళ్ల క్రితం అతడు తమ బంధాన్ని తెంచుకుని ఎటో వెళ్లిపోయాడని తీవ్రంగా ఆగ్రహించిన సదరు మహిళ.. బ్యాంకు పని వదిలిపెట్టి మాజీ ప్రియుడి పని పట్టింది. ముందుగా వెంటనే తన నాన్న, అన్నలకు విషయం చెప్పింది. వెంటనే వాళ్లిద్దరూ కూడా అక్కడకు వచ్చారు. ముగ్గురూ కలిసి నడిరోడ్డు మీద అందరూ చూస్తుండగా అతగాడిని పట్టుకుని చితక్కొట్టారు. తర్వాత అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
నాలుగేళ్ల క్రితం అతడు తనను మోసం చేసి వెళ్లిపోయాడని, అప్పటినుంచి అసలు ఎక్కడున్నాడో కూడా తెలియదని సత్పూర్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆమె పేర్కొంది. అతడిని ప్రశ్నించడానికి తొలుత పోలీసు స్టేషన్‌కు తీసుకొచ్చామని, అయితే ఒంటి నిండా గాయాలు ఉండటంతో ముందుగా ప్రభుత్వాస్పత్రికి పంపామని పోలీసులు చెప్పారు. అతడిపై ఐపీసీ సెక్షన్లు 323, 504, 506 కింద కేసు నమోదు చేశారు.