పార్టీలకు ‘ఉమేనిఫెస్టో’
విడుదల చేసిన పౌర, ఉద్యమ సంఘాల ప్రతినిధులు
ఆరు సూత్రాలతో కార్యాచరణ పత్రం
న్యూఢిల్లీ: మహిళలను శక్తిమంతులుగా చేసే పథకాలతో రాజకీయపార్టీలు తమ మేనిఫెస్టోలు రూపొందించాలని పౌర, ఉద్యమ సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు సాధికారత, స్వేచ్ఛ, భద్రత తదితర అంశాలతో కూడిన ఆరు పాయింట్ల ‘ఉమేనిఫెస్టో’ను విడుదల చేశారు. వాటిపై పార్టీలు స్పందించాలని కోరారు.
ఆ డిమాండ్లలో ముఖ్యాంశాలు..
- మహిళలపై దాడులు, లింగవివక్ష అంతమొందించేందుకు సుధీర్ఘమైన, సమగ్రమైన, సరిపడినన్ని నిధులతో కూడిన విద్యావిధానాన్ని ప్రభుత్వరంగంలో రూపొందిస్తామని చెప్పాలి.
- మహిళలపై దాడులు నియంత్రించడానికి ప్రతి ప్రభుత్వ సంస్థ చట్టాలను అమలు పరచడానికి పక్కా కార్యాచరణ రూపొందించాలి. వాటికి పార్టీలు సహకరించాలి.
- మహిళా బిల్లు కార్యరూపం దాల్చడానికి అన్ని పార్టీలు మద్దతివ్వాలి. అలాగే అన్ని కౌన్సిళ్లలో, కమిటీల్లో, టాస్క్ఫోర్సుల్లో మహిళలకు తగిన ప్రాతినిధ్యం కల్పిస్తామని హామీ ఇవ్వాలి.
- తీవ్రమైన నేరాల్లో బాధితులకు సమగ్రమైన సేవలనందించాలి. పోలీసుల ఆధ్వర్యంలో 24 గంటలు పనిచేసే సహాయక, రక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయాలి. సత్వరం ఆర్థిక సహాయం అందించే చర్యలు చేపట్టాలి. వీటిని పార్టీలు, రాష్ట్ర ప్రభుత్వాలు తప్పనిసరిగా చేస్తామని చెప్పాలి.
- మగువలను కించపరిచేలా మాట్లాడేవారిని, లింగవివక్ష చూపేవారిని, లోక్సభలో ప్రవర్తన తదితర అంశాల ఆధారంగా ఎన్నికల్లో పోటీచేయకుండా నిరోధించే కోడ్ తీసుకురావడానికి పార్టీలు మద్దతివ్వాలి.
- పట్టణాల్లోగానీ, గ్రామాల్లోగానీ అత్యాచారం లాంటి తీవ్రఘటనల్లో వెంటనే స్పందించే సహాయక బృందాలు ఏర్పాటు చేస్తామని పార్టీలన్నీ మాటివ్వాలి.