womaniser
-
ఆధారాల్లేకుండా భర్తను స్త్రీలోలుడు, తాగుబోతు అనడం క్రూరమే..
సాక్షి, ముంబై: బాంబే హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఎలాంటి ఆధారాలు లేకుండా భర్తను స్త్రీలోలుడు(తిరుగుబోతు), తాగుబోతు అంటూ భార్య ఆరోపించడం క్రూరత్వమే అవుందని కోర్టు వెల్లడించింది. దంపతులకు విడాకులు మంజూరు చేస్తూ గతంలో ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ తాజాగా బాంబే హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. కాగా స్థానికంగా ఉండే రిటైర్డ్ ఆర్మీ అధికారి దంపతుల వివాహాన్ని రద్దు చేస్తూ 2005 నవంబర్‌లో పుణె ఫ్యామిలీ కోర్టు తీర్పునిస్తూ.. విడాకులు మంజూరు చేసింది. అయితే ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ భార్య బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. మహిళ హైకోర్టు అప్పీల్ విచారణ పెండింగ్‌లో ఉన్న సమయంలోనే ఆర్మీ అధికారి మరణించడంతో అతని చట్టపరమైన వారసుడిని ప్రతివాదిగా చేర్చాలని కోర్టు ఆదేశించింది. మహిళ తన అప్పీల్లో భర్తకు ఇతర మహిళలతో సంబంధాలు ఉన్నాయని, ఆల్కహాలిక్ అని పేర్కొంది. ఈ దురలవాట్ల కారణంగా తన వైవాహిక జీవితం సజావుగా సాగలేదని, తనకు అందాల్సిన ప్రతిఫలాలు దక్కలేదని ఆరోపించింది. దీనిపై జస్టిస్ నితిన్ జామ్దార్,షర్మిలా దేశ్‌ముఖ్‌లతో కూడిన డివిజన్ బెంచ్ విచారణ చేపట్టింది. ఎటువంటి ఆధారాలు లేకుండా భర్తపై అసత్య ఆరోపణలు చేయడం వల్ల సమాజంలో అతని పరువు, మర్యాదలను దెబ్బతీసినట్లవుతందని, ఇది క్రూరత్వానికి సమానమని బెంచ్ తీర్పునిచ్చింది. మహిళ ఆరోపణలు చేసింది గానీ.. వాటిని రుజువు చేసేందుకు ఆమె ఎలాంటి ఆధారాలను సమర్పించలేదని కోర్టు పేర్కొంది. వారి వివాహాన్ని రద్దు చేస్తూ ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు తన ఉత్తర్వులో సమర్థించింది. అయితే భర్తపై పిటిషనర్ తప్పుడు, పరువు నష్టం కలిగించే ఆరోపణలు చేసి మానసిక వేదనకు గురి చేసిందని ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. భార్య క్రూరత్వం, తప్పుడు ఆరోపణలు.. తన పిల్లలు, మనవరాళ్ల నుంచి అతన్ని వేరు చేసిందని ప్రస్తావించారు. ఈ మేరకు కోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘పిటిషనర్ భర్త సమాజంలోని ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి.. ఆర్మీ మేజర్‌గా పదవీ విరమణ చేశారు. ఇలాంటి వారికి సంబంధించి తప్పుడు, నిరాధారమైన ఆరోపణలు చేయడం మానసిక వేదనను కలిగిస్తుంది. తాగుబోతు, స్త్రీలోలుడు అని ముద్ర వేయడం ద్వారా సమాజంలో నాయన ప్రతిష్టను దెబ్బతీస్తుంది. దీని వల్ల ఆరోపణలు చేసినవారితో కలిసి జీవించడం సాధ్యం కాదు’ అని హైకోర్టు పేర్కొంంటూ ఆమె పిటిషన్‌ను కొట్టివేసింది. -
నేను స్త్రీలోలుడినా! 'అజార్'తో సీనియర్ క్రికెటర్ షాక్!
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ అజారుద్దీన్ జీవితం వివాదాలమయం. ఇప్పుడు ఆయన జీవితకథ ఆధారంగా తెరకెక్కిన 'అజార్' సినిమా చుట్టూ వివాదాలు ముసురుకుంటున్నాయి. ఇమ్రాన్ హష్మీ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాపై ఇప్పటికే పలువురు ఆగ్రహం వ్యక్తం చేయగా.. తాజగా మాజీ క్రికెటర్ రవిశాస్త్రి కూడా ఈ చిత్రంలో తన పాత్రను చిత్రించిన తీరు చూసి షాక్ తిన్నాడంట. తనను ఇంత దారుణంగా సినిమాలో చూపిస్తారా? అని ఆయన మండిపడుతున్నట్టు తెలుస్తోంది. 'అజార్' సినిమాలో రవిశాస్త్రి పాత్రను గౌతం గులాటీ పోషించాడు. సినిమాలో ఏ క్రికెటర్ పేరును పూర్తిగా ఉపయోగించలేదు. కానీ అజార్ క్రికెట్ ఆడుతున్నప్పుడు సహ క్రికెటర్లు పిలుచుకొనే పొట్టిపేర్లనే ఇందులో వాడారు. అందులో భాగంగానే అజార్, రవి, నవజ్యోత్, మనోజ్, కపిల్ వంటి పేర్లను ఉపయోగించారు. వీళ్లందరూ అజార్‌తో కలిసి క్రికెట్ ఆడినవాళ్లే. కాబట్టి సహజంగానే సినిమాలో వీరి ప్రస్తావన ఉంటుందని అంతా భావించారు. అయితే, గౌతం గులాటీ 'రవి'గా కనిపించిన పాత్రను పూర్తిగా స్త్రీలోలుడిగా చిత్రించడం, ఓ సీరిస్ సందర్భంగా తన వెంట ఉన్న భార్యను మోసం చేసి అతను అమ్మాయితో గడిపినట్టు చూపించడం రవిశాస్త్రిని దిగ్భ్రాంత పరిచిందట. రవిశాస్త్రి కుటుంబం కూడా ఆయనను ఇలా చూపించారేమిటని మండిపడుతున్నారు. తన పాత్రను చూపించిన తీరును తప్పుబడుతూ ఇప్పటికే రవిశాస్త్రి బీసీసీఐ అధికారులకు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. తన పాత్రను తప్పుగా చూపించడంపై ఇప్పటికే మనోజ్ ప్రభాకర్ చట్టపరమైన చర్యలు తీసుకుంటానని 'అజార్' చిత్రయూనిట్‌ను హెచ్చరించారు. అజారుద్దీన్ మాజీ భార్య సంగీత బిజ్లానీ కూడా సినిమాలో తనను చూపిన తీరుపట్ల అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆ కక్షే కారణమా! క్రికెట్ ఆడుతున్న సమయంలో అజారుద్దీన్‌కు రవిశాస్త్రికి గొడవలు ఉన్నాయని చెప్తారు. అజారుద్దీన్ మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడినట్టు వెలువడిన స్టింగ్ ఆపరేషన్ వెనుక హస్తం ఉన్న క్రికెటర్లలో రవిశాస్త్రి కూడా ఉన్నాడనే వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో రవిశాస్త్రిపై తన కక్షను తీర్చుకోవడానికి ఈ సినిమాలో ఆయన పాత్రను ఇలా విపరీతంగా చిత్రీకరించేందుకు అజార్ సహకరించి ఉంటాడని వినిపిస్తోంది.