పోలీసులకు చుక్కలు చూపిస్తున్న మొయినాబాద్ యువతి హత్య కేసు
రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ యువతి హత్య కేసులో సస్పెన్స్ వీడటం లేదు. నాలుగు రోజులుగా ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. ఒక్క ఆధారం దొరకకుండా నిందితులు జాగ్రత్తపడటంతో కేసులో ఎలాంటి పురోగతి కనిపించడం లేదు .హత్య చేసి చాకచక్యంగా తప్పించుకు తిరుగుతూ పోలీసులకే చుక్కలు చూపిస్తున్నారు. చనిపోయిన యువతి ఎవరు, ఎందుకు చంపారు, అసలు చంపిదెవరు అనే విషయాలపై ఇంకా స్పష్టత రావడం లేదు.
అసలేం జరిగిందంటే..మొయినాబాద్ మండలంలోని బాకారం గ్రామ శివారులో డ్రీమ్ వ్యాలీ రిసార్ట్‌కు వెళ్ళే మార్గంలో సోమవారం పట్టపగలే యువతిని హతమార్చి, పెట్రోల్ పోసి తగలబెట్టారు.మంటల్లో కాలిపోతున్న గుర్తు తెలియని మృతదేహాన్ని గమనించిన స్థానిక రైతులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకునే సమయానికి మృతదేహాం కాలుతూనే ఉండడంతో రైతుల సాయంతో మంటలు ఆర్పారు. అప్పటినుంచి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటన స్థలంలో సగం కాలిపోయిన సెల్ ఫోన్ లభించగా.. దానిని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. మృతురాలి వయసు 25 ఏళ్లు ఉంటుందని భావిస్తున్నారు.
పోలీసులకు ఈ కేసు సవాల్‌గా మారింది. ఏడు బృందాలను ఏర్పాటు చేసి విచారిస్తున్నా.. వివరాలు తెలియరావడం లేదు. బాధితురాలి ఫోన్ లభించినా.. అందులో సిమ్‌కార్డు తొలగించడం, మొయినాబాద్ చుట్టుపక్కల ఉన్న ఏ పోలీస్ స్టేషన్లో కూడా మిస్సింగ్ ఫిర్యాదు అందకపోవడంతో కేసును ఛేదించడం కష్టతరంగా మారుతోంది. మొబైల్ ఫోను పూర్తిగా కాలిపోవడంతో ఐఎంఈ నెంబర్ సిమ్ కార్డు గుర్తించే పనిలో ఉన్నారు పోలీసులు. ఆధారాలు లేకపోవడంతోనే దర్యాప్తులో ఆలస్యం అవుతుందని ఇటు పోలీసులు కూడా చెబుతున్నారు.
ప్రస్తుతం యువతి మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీలో ఉంచారు. డ్రీమ్ వ్యాలీ రిసార్ట్ పరిసరాలను, సీసీ కెమెరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. హత్య ప్రదేశంలో మరిన్ని ఆధారాల కోసం పోలీసులు, క్లూస్ టీమ్ జల్లెడపడుతోంది. ఆ యువతి ప్యాంట్ వెనక భాగం జేబుకు ఉన్న ఓ స్టిక్కర్ లభ్యమైంది.ఒక దారిలో వచ్చి మరో దారిలో నిందితుల పోయి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. యువతిని ఎక్కడో చంపి బైక్ మీద తీసుకువచ్చి ఇక్కడ కాల్చివేసినట్లుగా పోలీసులు అనుమానం చెందుతున్నారు.