కాలమే మారుస్తుంది
మనోగతం
ఆకలేసినా, దాహం వేసినా నా భార్యని పిలవమని నా నోటికి చెప్పక్కర్లేదు. ఇంటికీ, భర్తకి, పిల్లలకు మాత్రమే సమయం కేటాయించే ఆడవాళ్లకు ఆ మూడే ప్రపంచం. కానీ ఇప్పుడు కాలం మారిపోయింది కదా! ఇప్పుడంటే ఈ రోజని కాదు...మార్పు వచ్చి ముప్పైఏళ్లవుతుంది. ఎప్పుడైతే భర్తతో పాటు భార్య కూడా ఉద్యోగం చేయడం మొదలుపెట్టిందో అప్పుడే మార్పు వచ్చేసింది. ‘‘నా ముఖం మారింది.
ఇల్లాలిగా ఇంత వండి పడేసి హాయిగా పిల్లల కోసం, భర్త కోసం ఎదురుచూడాల్సిన మేం ఉద్యోగాలపేరుతో వందమందికి వండిపెడుతున్నట్లుంది. ఇంట్లో పని గురించి ఆఫీసులో చెప్పలేం, ఆఫీసులో ఒత్తిడి గురించి ఇంట్లో చెప్పలేం’’ అని మా పక్కింటి ఆంటీ మా ఆవిడతో అంటుంటే విన్నాను. దానికి నా భార్య... ‘‘పెళ్లయిన కొత్తలో మావారు నన్ను ఉద్యోగం చేయొద్దన్నారండి. నేనే... పట్టుబట్టి, పోట్లాడి మరీ ఉద్యోగంలో చేరాను. ఇప్పుడు సరదా తీరిపోతోంది. ఇంట్లో ఖర్చులు పెరిగిపోయాక ఉద్యోగం మానాలంటే మనసొప్పడంలేదు’’ అంటూ నా భార్య వాపోవడం కూడా విన్నాను.
మా ఇద్దరి ఆఫీసులు పక్కపక్కనే ఉంటాయి. ఒకోసారి ఇద్దరం కలిసి ఇంటికొస్తాం. ఒకోసారి జాలేస్తుంటుంది. వద్దంటే ఉద్యోగంలో చేరింది. వంట సరిగ్గా కుదరలేదని, నన్నూ పిల్లల్ని సరిగ్గా పట్టించుకోవడం లేదని చిన్న చిన్న గొడవలతో పదేళ్లు గడిపేశాం. ఇప్పుడు తను నిజంగా విసుగొచ్చి ఉద్యోగం మానేస్తే నా చేతిలో చిల్లి గవ్వ మిగలదు. అలాగని ఆమెకు పనుల్లో సాయం చేయగలనా అంటే నా వల్లకాదు. ఏం సాయం చేయాలి. పొద్దునే చీపురు పట్టుకుని ఊడ్చలేను కదా! గిన్నెలు కడగలేను కదా! ఒకసారి నా భార్య ఆఫీసు నుంచి వచ్చేటప్పటికి పది దాటిపోయింది.
నేను నా ఇద్దరు పిల్లలు (మగపిల్లలు) ఎదురుచూస్తూ కూర్చున్నాం. కొద్దిగా అన్నం ఉంటే చిన్నాడికి పెట్టాను. పెద్దాడు ఫ్రిజ్ తెరిచి పండ్లకోసం వెదికాడు. ఇంట్లో ఏమీ లేవు. ‘నాన్నా మీకు వంట చేయడం రాదా...’ అన్నాడు పెద్దాడు. ‘వచ్చు.. కాని ఎప్పుడూ చేయలేదురా...’ అన్నాను. ‘అమ్మ ఎప్పుడు రావాలి, ఎప్పుడు వండాలి. వచ్చేటప్పటికి అమ్మకు కూడా ఆకలి వేస్తుంది కదా!’ అన్నాడు. నాకు చాలా సిగ్గనిపించింది. వెంటనే నా భార్యకు ఫోన్ చేశాను.
అన్నం వండడానికి కుక్కర్లో నీళ్లెన్ని పోయాలో అడిగాను. పప్పు చేయడానికి కూడా అదే పద్ధతని చెప్పింది. అరగంటలో వంట రెడీ అయిపోయింది. మేం ఇద్దరం తింటుంటే తనొచ్చింది. ‘అమ్మా... నాన్న వంట చేశారు. నువ్వు కూడా మాతో తిను’ అని కొడుకన్న మాటలకు ఇంత మొహం చేసుకుని పళ్లెం అందుకుని అన్నం వడ్డించుకుంది. కొడుకు అడిగే వరకూ పొయ్యి దగ్గ-రికి వెళ్లలేదు నేను. నా కొడుకు అలా అడిగించుకోడు. మార్పుకున్న ప్రత్యేకతే అది కదా!
- కమల్, దిల్షుక్నగర్