మహిళా కుబేరులు పైపైకి..!
* ఆసియాలోనే అధిక వృద్ధి
* యూబీఎస్ పీడబ్ల్యూసీ నివేదిక
న్యూఢిల్లీ: మహిళా బిలియనీర్ల సంఖ్య ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉంది. వీరి సంఖ్య 20 ఏళ్లలో ఏడు రెట్లు పెరిగిందని యూబీఎస్-పీడబ్ల్యూసీ నివేదిక పేర్కొంది. ఇతర ప్రాంతాలతో పోల్చితే ఆసియాలోనే మహిళా సంపన్నుల సంఖ్య వేగంగా వృద్ధి సాధిస్తోందని, ఆసియాలో పురుష సంపన్నుల కంటే మహిళా సంపన్నుల సంఖ్య వేగంగా పెరుగుతోందని వెల్లడించింది.
గత 20 ఏళ్లలో పురుష సంపన్నుల సంఖ్య 5 రెట్లు పెరగ్గా, మహిళా సంపన్నుల సంఖ్య 7 రెట్లు పెరిగిందని ఈ నివేదిక పేర్కొంది. యూబీసీ గ్రూప్ ఏజీ, పీడబ్ల్యూసీ సంస్థలు సంయుక్తంగా ద చేజింగ్ ఫేసెస్ ఆఫ్ బిలియనీర్స్ పేరుతో రూపొందించిన ఈ నివేదిక వెల్లడించిన కొన్ని ముఖ్యాంశాలు..,
* 1995లో 22గా ఉన్న మహిళా బిలియనీర్ల సంఖ్య 2014లో 6.6% వృద్ధితో 145కు పెరిగింది. ఇదే కాలానికి పురుష సంపన్నుల సంఖ్య 233 నుంచి 5.2% వృద్ధితో 1,202కు పెరిగింది.
* ప్రాంతాల పరంగా చూస్తే ఆసియాలోనే మహిళ సంపన్నులు పెరుగుతున్నారు. 1995లో మూడుగా ఉన్న వీరి సంఖ్య 2014లో 25కు పెరిగింది. యూరోప్‌లో 21 నుంచి 57కు, అమెరికాలో 37 నుంచి 63కు పెరిగింది. శాతాల పరంగా చూస్తే ఆసియాలో 8.3 శాతం, యూరప్‌లో 3 శాతం, అమెరికాలో 2 శాతం చొప్పున వృద్ధి నమోదైంది.
* మహిళా సంపన్నులు ఎంటర్ప్రెన్యూర్లుగానూ, కుటుంబ నిర్వహణలోనూ రాణిస్తున్నారు.
* మహిళా సంపన్నులు కుటుంబ వ్యాపారాల్లో విజయాలు సాధిస్తుండడమే కాకుండా దాతృత్వంలోనూ తామేమీ తీసిపోమని నిరూపిస్తున్నారు.
* మొత్తం ప్రపంచంలోని మహిళా సంపన్నుల్లో ఐదో వంతు ఆసియాలోనే ఉన్నారు. వయస్సుపరంగా చూసినా ఆసియాలోని వాళ్లే పిన్నవయస్కులు.
* ఆసియా మహిళా సంపన్నుల్లో దాదాపు సగం మంది తొలితరం ఎంటర్ప్రెన్యూర్లే. వారసత్వంగా వచ్చిన సంపదతో సంపన్నులైన మహిళలే యూరప్, అమెరికాల్లో అధికంగా ఉన్నారు.
* ఇక కుబేరుల క్లబ్ నుంచి జారిపోతున్న వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటోంది. 1995లో కుబేరులుగా వున్న 255 మందిలో 2014 నాటికి 126 మందే మిగిలారు. చనిపోవడం వల్ల, కుటుంబాలు విడిపోవడం వల్ల, వ్యాపారాలు సరిగ్గా లేకపోవడం వల్ల ఇలా కుబేరుల క్లబ్ నుంచి పలువురు జారిపోయారు. అయితే కొత్త సంపన్నులు వచ్చిచేరడంతో ఈ జాబితా పెరుగుతూ వుంది. 2014లోఉన్నమొత్తం 1,347 కుబేరుల్లో 1,221 మంది కొత్తవారే కావడం విశేషం.
* కన్సూమర్, రిటైల్, టెక్నాలజీ, ఆర్థిక సేవల రంగాల్లో వ్యాపారాలు నిర్వహిస్తున్న కుబేరుల సంపద అంతకంతకూ పెరిగిపోతోంది. పారిశ్రామిక, రియల్ ఎస్టేట్, ఆరోగ్య రంగాల్లోని బిలియనీర్ల సంపద తగ్గుతోంది.
* ప్రపంచవ్యాప్తంగా బిలియనీర్లలో టెక్నాలజీ రంగం నుంచి ఎక్కువమంది ఉన్నారు.