మహిళా బాసులు ఎక్కడ?
న్యూయార్క్: ఆకాశంలో సగభాగం తమదేనంటూ అన్ని రంగాల్లో మగవాళ్లకు దీటుగా దూసుకుపోతున్నామని భావించే మహిళలు కార్పొరేట్ రంగంలో ఎక్కడున్నారు? వారిలో ఎంతశాతం మంది బాసులుగా ఉన్నారు? అభివృద్ధి చెందిన అగ్రరాజ్యాలు, వర్థమాన దేశాలు కూడా మహిళా కార్పొరేట్ బాసుల్లో ఇంకా వెనకబడే ఉన్నారని అమెరికా పరిశోధన సంస్థ ఎక్స్పర్ట్ మార్కెట్ సంస్థ అధ్యయనంలో తేలింది. ఈ అధ్యయన సంస్థ అంతర్జాతీయ కార్మిక సంస్థ వద్ద అందుబాటులో ఉన్న 108 దేశాలకు సబంధించి సేకరించిన వివరాల ప్రకారం మహిళా బాసులు కలిగిన దేశాల్లో జమైకా, కొలంబియా, సెయింట్ లూసియా మొదటి మూడు స్థానాలకు ఆక్రమించాయి. 60 శాతం మంది మహిళా బాసులతో జమైకా ప్రపంచంలోనే మొదటి స్థానాన్ని ఆక్రమించగా, 53.1 శాతంతో కొలంబియా రెండో స్థానంలో, 52.3 శాతంతో సెయింట్ లూసియా తృతీయ స్థానంలో కొనసాగుతోంది. 47.6 శాతంతో ఫిలిపై్పన్స్ నాలుగోస్థానంలో, పనామా ఐదు, బెలారస్ ఆరు, లట్వియా ఏడవ స్థానంలో కొనసాగుతోంది.
మహిళా బాసులు కలిగిన దేశాల్లో 42.7 శాతంతో అగ్రరాజ్యం అమెరికా 15వ స్థానంలో కొనసాగుతుండగా, మూడు శాతంతో పాకిస్తాన్ ఆఖరి స్థానంలో ఉంది. 44.1 శాతంతో మోల్దోవా, 39.4 శాతంతో ఫ్రాన్స్, 39.1 శాతంతో రష్యా, 37,2 శాతంతో కజకిస్థాన్, 36.2 శాతంతో ఆస్ట్రేలియా, 34.2 శాతంతో బ్రిటన్, 31.1 శాతంతో జర్మనీ, 30 శాతంతో స్పెయిన్ తర్వాత స్థానాల్లో కొనసాగుతున్నాయి. కమ్యూనిస్టు ప్రభుత్వం అధికారంలోవున్న చైనాలో కార్పొరేట్ రంగంలో కేవలం 16.8 శాతం మంది మాత్రమే మహిళా బాసులున్నారు. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ మహిళా బాసుల్లో ఈ దేశాలకన్నా వెనుకబడే ఉంది.