జీవన విలువలు అక్కడే నేర్చుకున్నా: నరేంద్ర మోదీ
ఎన్సీసీలో చేరటం మధుర జ్ఞాపకం
న్యూఢిల్లీ: విద్యార్థిగా ఉండగా ఎన్సీసీలో చేరటం తనకు జీవన విలువలు, దేశభక్తి అలవడ్డాయని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. బుధవారం ఢిల్లీలో ఎన్సీసీ వార్షిక రిపబ్లిక్ డే క్యాంప్ వేడుకల్లో ప్రధాని పాల్గొని మాట్లాడారు. తాను జీవిత పాఠాలు నేర్చుకున్న వాతావరణంలోకి తిరిగి అడుగుపెట్టడం సంతోషాన్ని కలిగిస్తోందన్నారు. కష్టపడి ఈ అవకాశం దక్కించుకున్న ఎన్సీసీ క్యాడెట్లను ప్రధాని అభినందించారు. ఎన్సీసీలో చేరినా ఢిల్లీలో జరిగే వార్షిక క్యాంప్ వేడుకలకు మాత్రం తాను ఎంపిక కాలేదని మోదీ వెల్లడించారు. తమ పాఠశాల నుంచి ఈ అవకాశం దక్కించుకున్న ఓ విద్యార్థి హఠాత్తుగా రాత్రికి రాత్రే ప్రముఖుడిగా మారిపోయాడని జ్ఞప్తికి తెచ్చుకున్నారు. యువకుడిగా ఉండగా ఎన్సీసీ దుస్తుల్లో ఉన్న ఫొటోలను ఈ సందర్భంగా మోదీ ట్వీటర్లో విడుదల చేశా రు. ఎన్సీసీ పరేడ్లో మహిళా క్యాడెట్లు ఎక్కువగా పాల్గొనటంపై మోదీసంతృప్తి వ్యక్తం చేశారు.
భిన్నత్వంలో ఏకత్వమే మన బలం
భిన్నత్వంలో ఏకత్వమే మన దేశ బలమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. దేశంలో విభిన్న ప్రాంతాలను సందర్శించి ప్రజలతో మమేకం కావాలన్నారు. జాతిని అర్థం చేసుకోవటానికి స్వామి వివేకానంద, మహాత్మాగాంధీ దేశవ్యాప్తంగా పర్యటించారన్నారు. కేంద్రమంత్రులు మనోహర్ పారికర్, రావు ఇందర్జిత్ సింగ్, సుష్మా స్వరాజ్, ఢిల్లీ బీజేపీ సీఎం అభ్యర్థి కిరణ్బేడీ, ఎంపీ జయాబచ్చన్ తదితరులంతా ఎన్సీసీలో చేరినవారేనని చెప్పారు.
యోగాలో ప్రపంచ రికార్డు సాధించాలి
జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా ఒకే సమయంలో పెద్ద ఎత్తున యోగా కార్యక్రమాలు నిర్వహించటం ద్వారా ప్రపంచ రికార్డు నెలకొల్పాలని ఎన్సీసీ క్యాడెట్లను ప్రధాని కోరారు. ఇప్పటినుంచే దీనికి సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ఐరాస ప్రకటించటం యోగా సాధకులకు గర్వకారణమన్నారు. యోగాకు వయసు, భాష లాంటి సరిహద్దులు లేవన్నారు.