వీడిన మహిళ హత్య మిస్టరీ
వివాహేతర సంబంధం బయటపడుతుందని హతమాచ్చాడు
నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు
కోరుట్ల : పట్టణ శివారులోని మామిడితోటలోని రెస్ట్‌హౌస్‌లో గత నెల 27న గుర్తించిన మహిళ హత్య మిస్టరీ వీడింది. మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని, ఆమెవద్ద అప్పు తీసుకున్న వ్యక్తే హతమార్చిట్లు గుర్తించారు. ఈ మేరకు నిందితుడిని సీఐ రాజశేఖర్‌రాజు సోమవారం అరెస్ట్ చూపారు. సీఐ కథనం ప్రకారం.. మాదాపూర్ వీఆర్వో రాకేశ్ ఫిర్యాదు మేరకు కోరుట్ల శివారులోని గఫార్ మామిడితోటలోని రెస్ట్‌హౌస్ గదిలో కుళ్లిపోయిన మహిళ మృతదేహాం ఉన్నట్లు జులై 27న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు సంఘటన స్థలానికి వెళ్లిన సీఐ రాజశేఖర్‌రాజు ఎలాంటి ఆధారాలు దొరకకపోవడంతో అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు. ఆ తరువాత దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు.. కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామానికి చెందిన సల్ల గంగు(45) కొన్ని రోజులుగా కనిపించడంలేదని ఆమె బంధువులకు ఫిర్యాదు చేశారు. వారికి మృతదేహం ఫొటోలు చూపగా వారు గుర్తుపట్టలేదు. దీంతో చనిపోయిన మహిళ విషయంలో స్పష్టత రాలేదు. మహిళ ఎవరన్న విషయంలో మరింత లోతుగా దర్యాప్తు జరిపిన పోలీసులు చివరికి మృతదేహాం సల్ల గంగుదేనని నిర్ధారించారు. ఆమెకు కథలాపూర్ మండలం సిరికొండకు చెందిన ట్రాక్టర్ డ్రైవర్ కల్లెడ లక్ష్మీనర్సయ్యతో మూడేళ్లుగా పరిచయం ఉందని తేలింది. ఆ దిశలో విచారణ సాగించగా లక్ష్మీనర్సయ్య తమకున్న పరిచయాన్ని ఆసరాగా చేసుకుని గంగు వద్ద రూ.లక్ష అప్పు తీసుకున్నాడు. ఆ తరువాత వడ్డీతోసహా చెల్లించాడు. అయినా ఇంకా డబ్బులు రావాలని లక్ష్మీనర్సయ్యతో గంగు గొడవ పడేది. డబ్బులు ఇవ్వకుంటే తమ మధ్య ఉన్న వివాహేతర సంబంధం విషయాన్ని బయటపెడతానని బెదిరించింది. ఈ క్రమంలో ఇద్దరిమధ్య కొన్నిరోజులు గొడవ జరిగింది. విసిగిపోయిన లక్ష్మీనర్సయ్య చివరికి ఆమె చంపాలని నిర్ణయించుకున్నాడు. జులై 22వ తేన గంగును తన మోటార్‌సైకిల్‌పై ఎక్కించుకుని కల్లూర్రోడ్లోని గఫార్ తోట వద్ద ఉన్న రెస్ట్‌హౌస్‌కు తీసుకెళ్లాడు. అక్కడ గొడవ జరగగా లక్ష్మీనర్సయ్య తన వెంట తెచ్చుకున్న నైలాన్ తాడును గొంతుకు బిగించి హత్య చేశాడు. అనంతరం ఆమె సెల్‌ఫోన్ నుంచి సిమ్‌కార్డు తీసి వేసి ఫోన్, నైలాన్‌తాడును సమీపంలో ఉన్న పొదల్లో దాచిపెట్టి వెళ్లిపోయాడు. పోలీసుల విచారణలో నిందితుడు తాను సల్ల గంగును హత్య చేసిన విషయాన్ని అంగీకరించాడు. హత్య మిస్టరీని ఛేదించిన ఎస్సై బాబురావు, ప్రొబేషనరీ ఎస్సైలు సతీష్, సూరి, అయిలాపూర్ వీపీవో మహేందర్‌ను సీఐ అభినందించారు.