శబరిమల చేరుకున్న మహిళలు..ఉద్రిక్తం
తిరువనంతపురం: మహిళల రాకతో శబరిమలలో మరోసారి ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా తాము అయ్యప్ప స్వామి దర్శనానికి వచ్చామని తమిళనాడుకు చెందిన 11 మంది ‘మనితి’ బృందసభ్యులు పంబా బేస్ క్యాంపు దగ్గరకు చేరుకున్నారు. మరోవైపు వారంతా నిషేధిత వయస్సు (50 ఏళ్లలోపు) మహిళలు కావడంతో అయ్యప్ప భక్తులు వారిని అడ్డుకున్నారు. మహిళలు కొండపైకి రావడానికి వీళ్లేదని, వారి వద్దనున్న ఇరుముడిని భక్తులు లాకున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
స్వామిని దర్శించుకునే హక్కు తమకు న్యాయస్థానం కల్పించిందని, దర్శనం తరువాతనే తాము ఇక్కడినుంచి తిరిగి వెళ్తామని మహిళలు భీష్మించుకుని కూర్చున్నారు. భక్తులు, మహిళల ఆందోళనతో అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలీసులు భారీగా చేరుకుని, భక్తుల డిమాండ్ మేరకు 50 ఏళ్లు నిండిన మహిళలనే ఆలయంలోకి అనుమతిస్తామని అంటున్నారు. కాగా మనితి బృందానికి చెందిన కొందరూ మహిళలు నాలుగు గ్రూపులుగా పంబా క్యాంపు వద్దకు చేరుకున్నారు. ఆలయం వద్దకు మహిళలు వస్తున్నారని సమాచారం అందడంతో భక్తులు పెద్దఎత్తున అక్కడి చేరుకుని వారిని కొండపైకి వెళ్లకుండా అడ్డుకుంటున్నారు.