women dharna
-
న్యాయం కోరుతూ కలెక్టరేట్ వద్ద మహిళ ధర్నా
ఏలూరు (వన్‌టౌన్) : కుటుంబ తగాదాల నేపథ్యంలో తన భర్తను చంపిన నిందితులను ఏలూరు రూరల్ పోలీసులు అరెస్ట్ చేయకుండా వదిలి పెట్టారని, తగిన న్యాయం చేయాలని కోరుతూ మంగళవారం ఏలూరు కలెక్టరేట్ వద్ద ఒక మహిళ తన నాలుగేళ్ల బిడ్డతో కలిసి ధర్నా చేసింది. బాధితురాలికి మద్దతుగా దళిత, బీసీ సంఘాలు పెద్ద ఎత్తున ధర్నాలో పాల్గొన్నాయి. ఏలూరు మండలం వెంకటాపురంలో ఇందిరా కాలనీకి చెందిన తాడిశెట్టి వీరవెంకట సత్యనారాయణ గతేడాది ఆగస్ట్ 28న అనుమానాస్పదంగా మృతి చెందాడు. తన భర్త మృతికి తాడిశెట్టి కాటంరాజు, తాడిశెట్టి నాగేంద్రమ్మ, దుర్గారావు, ధనలక్ష్మి తదితరులు కారణమని నాడు పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు భార్య నందిని పేర్కొంది.. అయితే ఇంత వరకు ఆ కేసుకు సంబంధించి ఎలాంటి వివరాలు చెప్పడం లేదని ఆమె వాపోయింది. తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదనిఆమె పేర్కొంది. తాను పుట్టిల్లు లింగపాలెం మండలం ఆసన్నగూడెంలో ఉండగా ఆయన చనిపోవడానికి ముందు గతేడాది ఆగస్ట్ 27న తనకు ఫోన్ చేసి అమ్మా నాన్నలు, అన్నా వదినలు తనపై దౌర్జన్యం చేస్తున్నారని వెంటనే ఇంటికి రావాలని చెప్పారని ఆమె రోదించింది. ఇంటికి వచ్చేసరికి తన భర్త చనిపోయి ఉన్నాడని, అనంతరం హడావుడిగా మృతదేహాన్ని పూడ్చిపెట్టేశారని ఆమె ఆరోపించింది. దీంతో అనుమానం వచ్చి ఏలూరు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశానన్నారు. పోలీసులు పూడ్చిన శవాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిర్వహించారని తెలిపింది. అయితే ఏడు నెలలు గడుస్తున్నా దీనిపై ఎలాంటి సమాచారం చెప్పడం లేదని, నిందితులను అరెస్ట్ చేయడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. కనీసం తన భర్త కేసును హత్య కేసుగా నమోదు చేసి పోస్టుమార్టం రిపోర్టులు ఇవ్వాలని అనేకమార్లు పోలీసులకు మొర పెట్టుకున్నా వారి నుంచి సరైన సమాధానం రావడం లేదని నందిని వాపోయింది. నిందితులతో రూరల్ పోలీసులు కుమ్మక్కై కేసును నీరు గార్చేందుకు కుట్ర చేస్తున్నారని ఆమె కలెక్టరేట్ ఎదుట నినాదాలు చేసింది. బాధితురాలు నందినికి మద్దతుగా దళిత, బీసీ సంఘాలు బాసటగా నిలిచాయి. సమాచారం తెలుసుకున్న ఏలూరు రూరల్ సీఐ వెంకటేశ్వరరావు కలెక్టరేట్‌కు చేరుకుని ఆమెతో మాట్లాడారు. సత్వరమే న్యాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.దీంతో బాధితురాలు ధర్నాను విరమించారు. తనకు న్యాయం జరగకపోతే మే 16 నుంచి కలెక్టరేట్ ఎదుట ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని ఆమె హెచ్చరించింది. అనంతరం ప్రజా సంఘాల నాయకులతో కలిసి జిల్లా ఎస్పీకి వినతిపత్రం అందజేశారు. ధర్నాలో జిల్లా బహుజన సంఘం అధ్యక్షురాలు ఘంటశాల వెంకటలక్ష్మి, దళిత నేతలు నేతల రమేష్, మేతల అజయ్‌బాబు, ఏపీ మహిళా సమైఖ్య అధ్యక్షురాలు శారద, బహుజన సమైఖ్య సంఘం అధ్యక్షురాలు బలే నాగలక్ష్మి, జిల్లా మత్య్సకారుల సంఘం నాయకులు జి.సుజాత, ఆల్ ఇండియా దళిత రైట్స్ ప్రొటెక్షన్ నాయకులు బి.సుదర్శన, చింతలపూడి మండలం యర్రగుంటపల్లి సర్పంచ్ సదరబోయిన శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
ప్రకాశం జిల్లాలో ఉద్రిక్తత
సాక్షి, ఒంగోలు: ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మండలంలోని మలపాడులో మద్యం షాపు ఏర్పాటు చేయొద్దంటూ సోమవారం మహిళలు ధర్నాకు దిగారు. మహిళల ధర్నాను పోలీసులు అడ్డుకుని అరెస్టుకు యత్నించారు. దీంతో గ్రామస్తులు పోలీసులను అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. మరోవైపు జిల్లాలోని సంతమగులూరులో ఇరువర్గాలు ఘర్షణకు దిగాయి. ఇంటి స్థలం విషయంలో వివాదం నెలకొనడంతో ఇరువర్గాల వారు కొట్లాటకు దిగారు. ఈ ఘటనలో పలువురి గాయాలయ్యాయి. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. -
ఆడబిడ్డ పుట్టిందని..
తిరుమల: తిరుమలలో దారుణం చోటు చేసుకుంది. ఆడబిడ్డ పుట్టిందని ఓ మహిళను అత్తింటి వారు ఇంటి నుంచి గెంటేశారు. దీంతో ఆ మహిళ న్యాయం కోసం ధర్నాకు దిగింది. ఈ సంఘటన తిరుమల బాలాజీనగర్‌లో శుక్రవారం జరిగింది. స్థానికంగా నివాసముంటున్న విజయలక్ష్మీకి ఇటీవల ఆడబిడ్డ పుట్టింది. దీంతో భర్తింటి వారు ఆమెను ఇంటి నుంచి గెంటేశారు. తనకు న్యాయం చేయాలని కోరుతూ బాధితురాలు ఈ రోజు భర్త ఇంటి ముందు ఆందోళనకు దిగింది. -
నడిరోడ్డుపై ‘నీటి’గోస!
దాహార్తి తీర్చాలంటూ ప్రజ్ఞాపూర్‌లో మహిళల ఆందోళన సమన్వయ లోపంతోనే పూర్తి కాని పనులు సీఎం ఆదేశించినా పట్టని అధికారులు గజ్వేల్: పల్లెల గొంతు తడిపే ‘మిషన్ భగీరథ’ ప్రారంభమైన కోమటిబండకు కూతవేటు దూరంలోని ప్రజ్ఞాపూర్‌లో గ్రామస్తులు ఖాళీ బిందెలతో రోడ్డెక్కారు. ఇక్కడ కొన్ని రోజులుగా మంచినీటి సమస్య తీవ్ర రూపం దాల్చింది. ఫలితంగా విసిగిపోయిన మహిళలు బుధవారం ఖాళీ బిందెలతో రోడ్డెక్కారు. ఈ సందర్భంగా పోలీసులతో మహిళలకు వాగ్వాదం జరిగింది. సమస్యలుంటే నగర పంచాయతీ కార్యాలయంలో చెప్పాలని.. రోడ్డెక్కితే కేసులు పెడతామని పోలీసులు హెచ్చరించి ధర్నాను విరమింపజేశారు. ఇదీ సమస్య.. నగర పంచాయతీ పరిధిలోని గజ్వేల్, ప్రజ్ఞాపూర్, ముట్రాజుపల్లి, క్యాసారం గ్రామాలకు నిత్యం 5.19 ఎంఎల్డి (50.19 లక్షల లీటర్ల నీరు) అవసరం. 4 వేల వరకు నల్లాలు ఉన్నాయి. గతంలో 15 ఓవర్‌హెడ్ ట్యాంకుల ద్వారా 2 (20 లక్షల లీ.) ఎంఎల్డీ లీటర్ల నీటిని సరఫరా చేసేవారు. నాలుగు నెలలుగా పరిస్థితి మారింది. ఇక్కడ ‘మిషన్ భగీరథ’ శాశ్వత పైప్‌లైన్ నిర్మాణం, నల్లా కనెక్షన్ల నిర్మాణం చేపట్టకున్నా...(ఇప్పటికీ ఇంకా ఇక్కడ ‘మిషన్ భగీరథ’ పనులు చేపట్టలేదు) సీఎం కేసీఆర్ ఆదేశాలతో కోమటిబండలోని ‘మిషన్ భగీరథ«’ హెడ్ రెగ్యులేటరీ నుంచి నిత్యం ఇక్కడికి గడువుకు ముందే 10-20 లక్షల లీటర్ల నీటిని సరఫరా చేస్తున్నారు. పాత నల్లాల వ్యవస్థ నీటి సరఫరా ద్వారా గోదావరి జలాలతోపాటు ఇక్కడున్న వనరులతో కలిపి మొత్తం 30-35 లక్షల లీటర్ల నీటి సరఫరా జరుగుతున్నది. మొదటగా గజ్వేల్ పట్టణానికి మాత్రమే పాత నల్లాల వ్యవస్థ ద్వారా నీటిని అందించారు. ప్రజ్ఞాపూర్‌లో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా జరిగేది. ఈ నీళ్లు సరిపోక గతేడాది మే నుంచి ఇప్పటి వరకు నాలుగు సార్లు జనం ఆందోళనకు దిగారు. విస్తరణ పనులతోనే ఆటంకం గజ్వేల్-ప్రజ్ఞాపూర్ రోడ్డు విస్తరణ పనులు కారణంగా పైప్‌లైన్ దెబ్బతిని నీరు ఇవ్వలేకపోతున్నామని చెప్పిన అధికారులు...జనం ఆగ్రహావేశాలు చూసి 3 నెలల క్రితం తాత్కాలిక పైప్‌లైన్ వేసి వాటితో ట్యాంకులు నింపి గజ్వేల్‌లో మాదిరిగానే ఇక్కడా పాత నల్లాల వ్యవస్థ ద్వారానే నీటిని అందించారు. దీంతో సమస్య తీరింది. ఇటీవల ప్రధాని పర్యటన నేపథ్యంలో వడివడిగా పైప్‌లైన్ విస్తరణ పనులు చేపట్టిన క్రమంలో తవ్వకాలతో గతంలో తాత్కాలికంగా వేసిన పైప్‌లైన్ దెబ్బతిన్నది. ఫలితంగా ప్రజ్ఞాపూర్‌కు నీటి సరఫరా ఆగింది. 10 వేల జనాభా ఉన్న ప్రజ్ఞాపూర్‌లో 1500కిపైగా నల్లా కనెక్షన్లు ఉన్నాయి. తక్కువలో తక్కువగా ఇక్కడికి నిత్యం 5 లక్షల నీటిని అందించగలిగితే ఇబ్బంది ఉండదు. కానీ ప్రస్తుతం 30 ట్యాంకర్ల ద్వారా 1.5 లక్షల లీటర్ల నీటినే సరఫరా చేస్తున్నారు. పైప్‌లైన్ విస్తరణ పనుల్లో జాప్యం మరోవైపు శాశ్వతంగా ఏర్పాటు చేస్తున్న పైప్‌లైన్ విస్తరణ 20 రోజులైనా పూర్తి కావడం లేదు. ప్రత్యేకించి ఇందిరాపార్క్ చౌరస్తా నుంచి పిడిచెడ్ రోడ్డు వరకు, మరికొన్ని చోట్ల పనులు పూర్తి చేస్తే శాశ్వతంగా వేస్తున్న ఈ లైన్ ద్వారా ప్రజ్ఞాపూర్‌లోని ట్యాంకుల్లోకి నీటిని ఎక్కించుకొని...నల్లాల బిగించే వరకు నీటిని అందించవచ్చు. ఇందుకోసం కొన్ని చోట్ల తాత్కాలిక లైన్ కూడా వేయాల్సి ఉన్నది. కానీ ఈ పనుల నిర్వహణలో నగర పంచాయతీ, వాటర్‌గ్రిడ్ విభాగం మధ్య సమన్వయ లోపం నెలకొంది. మరోవైపు ఆర్అండ్బీ అధికారులు కూడా పనులు వేగిరం చేయటం లేదన్న ఆరోపణలున్నాయి. మొత్తానికి ఈ మూడు విభాగాల నిర్వాకం ప్రజ్ఞాపూర్ మహిళలకు చుక్కలు చూపిస్తోంది. కాగా, గురువారం ‘గడా’ ఓఎస్డీ హన్మంతరావు నగర పంచాయతీ, మిషన్ భగీరథ, ఆర్అండ్బీ అధికారులతో గురువారం నిర్వహించే సమావేశంలో తాగునీటి సమస్యకు పరిష్కారం లభిస్తుందోమోనని ప్రజలు ఎదురుచూస్తున్నారు.