women helpline
-
నా భర్తకు 89 ఏళ్లు.. రోజూ అదే ధ్యాస.. నన్ను కాపాడండి
గాంధీనగర్: గుజరాత్ వడోదరలో 89ఏళ్ల భర్తపై ఫిర్యాదు చేసింది 87ఏళ్ల భార్య. వృద్ధ వయసులోనూ ఆయన రోజూ శృంగారం కావాలని తనను బాగా ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించింది. మహిళల కోసం గుజరాత్ ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్ నంబర్ 181 అభయంకు ఫోన్ చేసి ఈ విషయాన్ని చెప్పింది. తన భర్త నుంచి కాపాడాలని విజ్ఞప్తి చేసింది. ఫిర్యాదు విని షాక్‌కు గురైన అభయం టీం వెంటనే రంగంలోకి దిగింది. వృద్ధ దంపతులకు కౌన్సిలింగ్ ఇచ్చింది. ఈ వయసులో యోగా చేయాలని, పుణ్యక్షేత్రాలను సందర్శించాలని సూచించింది. వీలైతే సీనియర్ సిటిజెన్ల కోసం ఏర్పాటు చేసిన పార్కులలో సేదతీరాలని చెప్పింది. భార్యను ఇబ్బందిపెట్టవద్దని భర్తకు సూచించి సమస్యను పరిష్కరించింది. తన భర్తకు ఎప్పుడూ అదే ధ్యాస అని, శృంగారానికి ఒప్పుకోకపోతే తనపై కోపపడతాడని భార్య చెప్పింది. తన ఆరోగ్యం బాగాలేదని చెప్పినా వినకుండా భర్త పదే పదే బలవంతం చేయడం వల్లే గత్యంతరం లేక ఫిర్యాదు చేసినట్లు పేర్కొంది. చదవండి: డ్రగ్స్ మత్తులో రోడ్డుపై కాలు కదపలేని స్థితిలో యువతి.. వీడియో వైరల్.. -
అతివల ఆపన్నహస్తం 181
వనజకు మూడేళ్ల క్రితం వివాహమైంది. అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో అడుగు పెట్టింది. ప్రేమించి పెళ్లి చేసుకోవడంతో భార్యాభర్తలిద్దరూ అన్యోన్యంగా ఉన్నారు. కానీ, సమీప బంధువు ఒకరు వనజను వేధిస్తుండటం... ఈ విషయాన్ని ఎవరికి చెప్పాలో తెలియని పరిస్థితిలో స్నేహితురాలి సహకారంతో ఉమెన్ హెల్ప్‌లైన్ ‘181’కు ఫోన్ చేసి వివరాలు చెప్పింది. రంగంలోకి దిగిన పోలీసులు సమస్యను గుట్టుచప్పుడు కాకుండా పరిష్కరించారు. రమ్య సాఫ్ట్వేర్ ఇంజనీర్. అదే కంపెనీలో పనిచేసే టీమ్ లీడర్‌తో ఐదేళ్ల క్రితం అరేంజ్డ్ మ్యారేజ్ జరిగింది. ఏడాది పాటు బాగానే సాగిన వారి జీవితంలో క్రమంగా గొడవలు మొదలై కలహాల కాపురంగా మారింది. తల్లిదండ్రులకు దూరంగా ఉండటంతో సర్దిచెప్పేవారు లేరు. ఈ క్రమంలో హెల్ప్‌లైన్ గురించి తెలుసుకున్న రమ్య ఫోన్ చేసింది. భార్యాభర్తలిద్దరికీ కౌన్సెలింగ్ కావాలని హెల్ప్‌లైన్ గుర్తించింది. సఖి కేంద్రం ద్వారా నాలుగైదు సెషన్లలో వారి కాపురం గాడిలో పడింది. మూడేళ్లలో హెల్ప్‌లైన్‌కు వచ్చిన కాల్స్ సంవత్సరం వచ్చిన కాల్స్ 2017–18 2,01,948 2018–19 4,45,265 2019–20 1,75,820 (ఇప్పటివరకు) సాక్షి, హైదరాబాద్: ఉమెన్ హెల్ప్‌లైన్ (181)... మహిళా సమస్యల పరిష్కారానికి వారధి. దగ్గరి వ్యక్తులకు సైతం చెప్పుకోలేని సమస్యలను హెల్ప్‌లైన్‌కు వివరిస్తే మూడో కంటికి తెలియకుండా పరిష్కరించడం హెల్ప్‌లైన్ స్టైల్. రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఓ ప్రైవేటు సంస్థ (జీవీకే) భాగస్వామ్యంతో మూడేళ్ల క్రితం ఉమెన్ హెల్ప్‌లైన్ అందుబాటులోకి వచ్చింది. మహిళలు పడే ఇబ్బందులు, కుటుంబ కలహాలు, వాటికి సలహాలు, వేధింపులు, దాడులు ఇలా అన్ని రకాల అంశాలపై ఈ హెల్ప్‌లైన్ పనిచేస్తుంది. 24/7 పాటు పనిచేస్తున్న ఈ హెల్ప్‌లైన్ ప్రారంభించిన మూడేళ్ల కాలంలో వీటికి వస్తున్న కాల్స్ 8 లక్షలకు చేరింది. రోజుకు సగటున 800 కాల్స్ వస్తుండటం గమనార్హం. సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న ఎలాంటి సమస్యలైనా హెల్ప్‌లైన్ దృష్టికి తీసుకురావచ్చు. సమస్య తీవ్రతను బట్టి హెల్ప్‌లైన్ రంగంలోకి దిగుతుంది. అత్యవసరంగా స్పందించాల్సి ఉన్నప్పుడు వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌ను అలర్ట్ చేస్తుంది. కేసు నమోదు చేయాల్సి వస్తే లీగల్ అసిస్టెంట్స్‌తో పాటు వసతిని కూడా ఏర్పాటు చేస్తుంది. వచ్చిన ప్రతికాల్‌కు పరిష్కారం చూపడం, నమోదు చేసిన కేసులను ఫాలోఅప్ చేయడం అంతా క్రమ పద్దతిలో జరుగుతుంది. ఇప్పటివరకు వచ్చిన కాల్స్‌లో 90శాతానికిపైగా పరిష్కరించారు. డీవీ (గృహ హింస) కేసుకు సంబంధించిన ఫిర్యాదు వస్తే వెంటనే సంబంధిత జిల్లా లీగల్ కౌన్సెలర్ లేదా సఖి కేంద్రానికి కాల్ కనెక్ట్ చేస్తారు. బాధితురాలి వివరాలను స్వీకరించి తదుపరి చర్యలు తీసుకుంటారు. కేసు నమోదు చేయాల్సి వస్తే బాధితురాలి రక్షణ చర్యలు తీసుకుని కేసు ఫైల్ చేస్తారు. ఆమెకు కుటుంబ సహకారం లభించకుంటే సఖి కేంద్రంలో వసతి కల్పిస్తారు. వేధింపుల కేటగిరీలో ఫిర్యాదులపై తక్షణ స్పందన ఉంటుంది. కాల్ వచ్చిన వెంటనే సమీప పోలీస్‌స్టేషన్‌కు వాకబు చేయడంతో పాటు వేధింపులకు పాల్పడుతున్న వారిని అదుపులోకి తీసుకోవడం, కేసు నమోదు, బాధితు రాలికి రక్షణ కల్పించడంలాంటివి క్షణాల్లో జరుగుతాయి. దాడులు, అఘాయిత్యాలకు గురైన మహిళకు వసతి, వైద్య సహకారం అందించ డంతో పాటు న్యాయ సహకారం కోసం సఖి కేంద్రానికి రిఫర్ చేస్తారు. ∙కుటుంబ కలహాలపై వచ్చే ఫిర్యాదులకు హెల్ప్‌లైన్ స్పందన క్రమ పద్ధతిలో ఉంటుంది. కౌన్సెలింగ్ చేయాల్సి వస్తే.. ఇరువురిని సఖి కేంద్రానికి పిలిపిస్తారు. ఒకటి లేదా అంతకంటే ఎక్కువసార్లు పిలిచి అవగా హన కల్పిస్తారు. ఫోన్లోనూ కౌన్సెలింగ్ ఇచ్చేందుకు హెల్ప్‌లైన్ సహకరిస్తుంది. సలహాలు, సూచనలు.. ఉమెన్ హెల్ప్‌లైన్ ద్వారా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ద్వారా అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి కూడా అవగాహన కల్పిస్తారు. అదేవిధంగా చిన్నపాటి అంశాలను పెద్దవి కాకుండా జాగ్రత్త పడేలా హెల్ప్‌లైన్ సహకరిస్తుంది. మహిళా చట్టాల పైన విస్తృత అవగాహన కల్పిస్తుంది. కాల్స్ చేసే మహిళలకు సలహాలు, సూచనలు ఇవ్వడంతో పాటు వారిని గైడ్ చేయడంలో హెల్ప్‌లైన్ వ్యూహాత్మకంగా పని చేస్తుంది. రోజూ వస్తున్న కాల్స్‌లో.. ఫిర్యాదు చేయడంతో పాటు వాటికి సంబంధించి తీసుకున్న చర్యలు, కేసు నమోదు చేస్తే వాటి స్టేటస్, సలహాల స్వీకరణ, కాల్ మధ్యలో కట్ అయితే తిరిగి చేయడం, సమాచార స్వీకరణలో అవరోధాలు తదితర అంశాలతో కొందరు వ్యక్తులు పలుమార్లు కాల్స్ చేస్తున్నారు. దీంతో కాల్స్ సంఖ్య పెరుగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. -
అబలల ఆర్తనాదం ఇంతింత కాదయా..
సాక్షి, అమరావతి: అనేక సమస్యలతో సతమతమవుతూ పరిష్కారం కోసం ఉమెన్ హెల్ప్‌లైన్ ‘డయల్ 181’ను ఆశ్రయిస్తున్న మహిళలకు తీవ్రనిరాశే ఎదురవుతోంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వంలోని 13 శాఖల భాగస్వామ్యంతో ఏర్పాటుచేసిన ‘డయల్ 181’ అలంకారప్రాయంగా మారింది. ఆపద, ఈవ్‌టీజింగ్, గృహహింస, వరకట్నం, బలవంతపు వ్యభిచారం తదితర అనేక సమస్యలు, కష్టాలు ఎదుర్కొంటున్న మహిళలు తమను ఆదుకోవాలంటూ లక్షలాదిగా చేస్తున్న ఫోన్‌కాల్స్‌పట్ల ఆయా శాఖలు స్పందించి పరిష్కరిస్తున్నవి అరకొరగానే ఉంటున్నాయి. హెల్ప్‌లైన్‌లో ద్వారా నమోదైన ఫోన్‌కాల్స్ వివరాలు చూస్తే విస్తుపోయే నిజాలు వెలుగుచూస్తున్నాయి. కాల్స్ కొండంత.. పరిష్కరించినవి గోరంత 2016 అక్టోబరు నుంచి 2018 ఆగస్టు వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 4,45,335 మంది మహిళలు సహాయం కోసం ఫోన్‌చేస్తే వాటిలో 3,22,077 కాల్స్‌ను మాత్రమే హెల్ప్‌లైన్ స్వీకరించింది. వాటిలో 2,47,954 కాల్స్‌ను నమోదు చేసుకోగా పరిగణలోకి తీసుకున్నవి కేవలం 1,233 మాత్రమే. వాటిలోనూ గడిచిన రెండేళ్లలో కేవలం 621మంది సమస్యలు మాత్రమే పరిష్కారానికి నోచుకోగా ఇంకా 612 పెండింగ్‌లోనే ఉంచారు. ఇలా ఫోన్‌కాల్స్ లిస్ట్ కొండంత ఉంటే నమోదు చేసి పరిష్కరించింది గోరంతగా ఉంది. శాఖల మధ్య సమన్వయలేమి వాస్తవానికి ‘డయల్ 181’ హెల్ప్‌లైన్‌కు వచ్చిన ఫోన్‌కాల్స్ వివరాలను రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన 13 శాఖలు పరిశీలించి తమ పరిధిలోకి వచ్చే సమస్యలను ఆయా శాఖలు పరిష్కరించాల్సి ఉంది. పోలీస్, సైబర్ క్రైమ్, చైల్డ్ డెవలప్మెంట్ (ఐసీడీఎస్), చైల్డ్ ప్రొటెక్షన్ సర్వీస్ (ఐసీపీఎస్), డీఆర్డీఏ, హెల్త్, సర్వశిక్ష అభియాన్ (ఎస్ఎస్ఏ) తదితర ప్రభుత్వ శాఖలు బాధితులకు ఆపన్నహస్తం అందించాల్సి ఉంది. కానీ, నమోదవుతున్న ఫోన్‌కాల్స్‌కు, పరిగణలోకి తీసుకున్న వాటికి, పరిష్కరించిన వాటికి పొంతన లేకపోవడం చూస్తే శాఖల మధ్య సమన్వయంలేదనే విషయం స్పష్టమవుతోంది. ఇదిలా ఉంటే.. మహిళల నుంచి వస్తున్న ఫోన్స్ కాల్స్‌లో ఎక్కువగా రాజధాని ప్రాంతం నుంచే వస్తున్నట్లు నమోదైన కాల్స్ ద్వారా తెలుస్తోంది. రెండేళ్లలో అనేక వడబోతల అనంతరం నమోదైన 1,233 కేసులలో అత్యధికంగా గుంటూరు, కృష్ణా జిల్లాలోనే ఉండటం ఆందోళన కలిగించే విషయం. తూర్పుగోదావరి జిల్లా ఆ తర్వాత స్థానంలో ఉంది. -
750 ఫోన్ నంబర్ల నుంచి వేధింపులు
పాట్నా: ప్రేమించాలంటూ గత ఆరేళ్లుగా ఫోన్ లో వేధిస్తున్న వ్యక్తిపై బీహార్ కు చెందిన ఓ మహిళ ఫిర్యాదు చేసింది. గత ఆరేళ్లలో 750 మొబైల్ నంబర్ల నుంచి ఫోన్ చేసి వేధించాడని బాధితురాలు మహిళా హెల్ప్ లైన్ ను ఆశ్రయించింది. అతడి ఫోన్ నంబర్లను బ్లాక్ చేసినా కొత్త నంబర్ల నుంచి ఫోన్లు చేసేవాడని ఆమె తెలిపింది. బ్లాక్ చేసిన ప్రతిసారీ ఫోన్ నంబర్లు మార్చేసే వాడని వాపోయింది. వేధింపులకు గురిచేసిన వ్యక్తి బాధితురాలి క్లాస్ మేటే. నిందితుడు 750 ఫోన్ నంబర్లు వినియోగించినట్టు సైబర్ క్రైమ్ పోలీసుల దర్యాప్తులో తేలిందని మహిళా హెల్ప్ లైన్ అధికారి ప్రమీలా కుమారి తెలిపారు. చివరికి అతడి ఫోన్ నంబర్ కనిపెట్టి, బాధితురాలిని కలిసేందుకు రావాలని కబురు పెట్టారు. భవిష్యత్ లో మళ్లీ వేధింపులకు దిగితే చర్య తప్పదని హెచ్చరించారు. ఇంకెప్పుడూ ఆమెకు ఫోన్ చేయనని, ఫోన్ నంబర్ మార్చనని అతడితో లేఖ రాయించినట్టు కుమారి తెలిపారు.