అతివల ఆపన్నహస్తం 181 | Women Helpline 181 Use To Women Safety | Sakshi
Sakshi News home page

అతివల ఆపన్నహస్తం 181

Published Fri, Oct 18 2019 3:52 AM | Last Updated on Fri, Oct 18 2019 3:52 AM

Women Helpline 181 Use To Women Safety - Sakshi

వనజకు మూడేళ్ల క్రితం వివాహమైంది. అప్పర్‌ మిడిల్‌ క్లాస్‌ ఫ్యామిలీలో అడుగు పెట్టింది. ప్రేమించి పెళ్లి చేసుకోవడంతో భార్యాభర్తలిద్దరూ అన్యోన్యంగా ఉన్నారు. కానీ, సమీప బంధువు ఒకరు వనజను వేధిస్తుండటం... ఈ విషయాన్ని ఎవరికి చెప్పాలో తెలియని పరిస్థితిలో స్నేహితురాలి సహకారంతో ఉమెన్‌ హెల్ప్‌లైన్‌ ‘181’కు ఫోన్‌ చేసి వివరాలు చెప్పింది. రంగంలోకి దిగిన పోలీసులు సమస్యను గుట్టుచప్పుడు కాకుండా పరిష్కరించారు.

రమ్య సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌. అదే కంపెనీలో పనిచేసే టీమ్‌ లీడర్‌తో ఐదేళ్ల క్రితం అరేంజ్‌డ్‌ మ్యారేజ్‌ జరిగింది. ఏడాది పాటు బాగానే సాగిన వారి జీవితంలో క్రమంగా గొడవలు మొదలై కలహాల కాపురంగా మారింది. తల్లిదండ్రులకు దూరంగా ఉండటంతో సర్దిచెప్పేవారు లేరు. ఈ క్రమంలో హెల్ప్‌లైన్‌ గురించి తెలుసుకున్న రమ్య ఫోన్‌ చేసింది. భార్యాభర్తలిద్దరికీ కౌన్సెలింగ్‌ కావాలని హెల్ప్‌లైన్‌ గుర్తించింది. సఖి కేంద్రం ద్వారా నాలుగైదు సెషన్లలో వారి కాపురం గాడిలో పడింది.
    
మూడేళ్లలో హెల్ప్‌లైన్‌కు వచ్చిన కాల్స్‌
సంవత్సరం    వచ్చిన కాల్స్‌
2017–18    2,01,948
2018–19    4,45,265
2019–20    1,75,820

(ఇప్పటివరకు)
సాక్షి, హైదరాబాద్‌: ఉమెన్‌ హెల్ప్‌లైన్‌ (181)... మహిళా సమస్యల పరిష్కారానికి వారధి. దగ్గరి వ్యక్తులకు సైతం చెప్పుకోలేని సమస్యలను హెల్ప్‌లైన్‌కు వివరిస్తే మూడో కంటికి తెలియకుండా పరిష్కరించడం హెల్ప్‌లైన్‌ స్టైల్‌. రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఓ ప్రైవేటు సంస్థ (జీవీకే) భాగస్వామ్యంతో మూడేళ్ల క్రితం ఉమెన్‌ హెల్ప్‌లైన్‌ అందుబాటులోకి వచ్చింది. మహిళలు పడే ఇబ్బందులు, కుటుంబ కలహాలు, వాటికి సలహాలు, వేధింపులు, దాడులు ఇలా అన్ని రకాల అంశాలపై ఈ హెల్ప్‌లైన్‌ పనిచేస్తుంది. 24/7 పాటు పనిచేస్తున్న ఈ హెల్ప్‌లైన్‌ ప్రారంభించిన మూడేళ్ల కాలంలో వీటికి వస్తున్న కాల్స్‌ 8 లక్షలకు చేరింది. రోజుకు సగటున 800 కాల్స్‌ వస్తుండటం గమనార్హం. సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న ఎలాంటి సమస్యలైనా హెల్ప్‌లైన్‌ దృష్టికి తీసుకురావచ్చు. సమస్య తీవ్రతను బట్టి హెల్ప్‌లైన్‌ రంగంలోకి దిగుతుంది. అత్యవసరంగా స్పందించాల్సి ఉన్నప్పుడు వెంటనే సమీప పోలీస్‌ స్టేషన్‌ను అలర్ట్‌ చేస్తుంది. కేసు నమోదు చేయాల్సి వస్తే లీగల్‌ అసిస్టెంట్స్‌తో పాటు వసతిని కూడా ఏర్పాటు చేస్తుంది. వచ్చిన ప్రతికాల్‌కు పరిష్కారం చూపడం, నమోదు చేసిన కేసులను ఫాలోఅప్‌ చేయడం అంతా క్రమ పద్దతిలో జరుగుతుంది. ఇప్పటివరకు వచ్చిన కాల్స్‌లో 90శాతానికిపైగా పరిష్కరించారు.

డీవీ (గృహ హింస) కేసుకు సంబంధించిన ఫిర్యాదు వస్తే వెంటనే సంబంధిత జిల్లా లీగల్‌ కౌన్సెలర్‌ లేదా సఖి కేంద్రానికి కాల్‌ కనెక్ట్‌ చేస్తారు. బాధితురాలి వివరాలను స్వీకరించి తదుపరి చర్యలు తీసుకుంటారు. కేసు నమోదు చేయాల్సి వస్తే బాధితురాలి రక్షణ చర్యలు తీసుకుని కేసు ఫైల్‌ చేస్తారు. ఆమెకు కుటుంబ సహకారం లభించకుంటే సఖి కేంద్రంలో వసతి కల్పిస్తారు. వేధింపుల కేటగిరీలో ఫిర్యాదులపై తక్షణ స్పందన ఉంటుంది. కాల్‌ వచ్చిన వెంటనే సమీప పోలీస్‌స్టేషన్‌కు వాకబు చేయడంతో పాటు వేధింపులకు పాల్పడుతున్న వారిని అదుపులోకి తీసుకోవడం, కేసు నమోదు, బాధితు రాలికి రక్షణ కల్పించడంలాంటివి క్షణాల్లో జరుగుతాయి. దాడులు, అఘాయిత్యాలకు గురైన మహిళకు వసతి, వైద్య సహకారం అందించ డంతో పాటు న్యాయ సహకారం కోసం సఖి కేంద్రానికి రిఫర్‌ చేస్తారు.

∙కుటుంబ కలహాలపై వచ్చే ఫిర్యాదులకు హెల్ప్‌లైన్‌ స్పందన క్రమ పద్ధతిలో ఉంటుంది. కౌన్సెలింగ్‌ చేయాల్సి వస్తే.. ఇరువురిని సఖి కేంద్రానికి పిలిపిస్తారు. ఒకటి లేదా అంతకంటే ఎక్కువసార్లు పిలిచి అవగా హన కల్పిస్తారు. ఫోన్‌లోనూ కౌన్సెలింగ్‌ ఇచ్చేందుకు హెల్ప్‌లైన్‌ సహకరిస్తుంది.

సలహాలు, సూచనలు..
ఉమెన్‌ హెల్ప్‌లైన్‌ ద్వారా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ద్వారా అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి కూడా అవగాహన కల్పిస్తారు. అదేవిధంగా చిన్నపాటి అంశాలను పెద్దవి కాకుండా జాగ్రత్త పడేలా హెల్ప్‌లైన్‌ సహకరిస్తుంది. మహిళా చట్టాల పైన విస్తృత అవగాహన కల్పిస్తుంది. కాల్స్‌ చేసే మహిళలకు సలహాలు, సూచనలు ఇవ్వడంతో పాటు వారిని గైడ్‌ చేయడంలో హెల్ప్‌లైన్‌ వ్యూహాత్మకంగా పని చేస్తుంది. రోజూ వస్తున్న కాల్స్‌లో.. ఫిర్యాదు చేయడంతో పాటు వాటికి సంబంధించి తీసుకున్న చర్యలు, కేసు నమోదు చేస్తే వాటి స్టేటస్, సలహాల స్వీకరణ, కాల్‌ మధ్యలో కట్‌ అయితే తిరిగి చేయడం, సమాచార స్వీకరణలో అవరోధాలు తదితర అంశాలతో కొందరు వ్యక్తులు పలుమార్లు కాల్స్‌ చేస్తున్నారు. దీంతో కాల్స్‌ సంఖ్య పెరుగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement