ఆ ఐదుగురూ గొలుసు చోరీల్లో దిట్ట
అమలాపురం టౌన్ : మహిళల మెడల్లోని నగలను తెంపుకుని పరారవడంలో ఆ ఐదుగరూ నేర్పరులు. ఆరునెలలుగా పలు జిల్లాల్లో గొలుసు చోరీలకు పాల్పడుతూ పోలీసులకు చిక్కకుండా హడలెత్తిస్తున్న ఈ ఘరానా ముఠాను ఎట్టకేలకు అమలాపురం పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. వారి నుంచి రూ.16 లక్షల విలువైన 75 కాసుల బంగారు నగలు, రూ.1.50 లక్షల విలువైన మూడు మోటారుసైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా నేరాల చిట్టాను జిల్లా అడిషనల్ ఎస్పీ ఎ.ఆర్.దామోదర్, అమలాపురం ఇన్చార్జి డీఎస్పీ సుంకర మురళీమోహన్, పట్టణ సీఐ వై.ఆర్.కె.శ్రీనివాస్, రూరల్ సీఐ జి.దేవకుమార్ బుధవారం స్థానిక పట్టణ పోలీసు స్టేషన్లో విలేకరులకు వివరించారు.
చర్లపల్లి జైలులో పరిచయం : తాళ్లరేవుకు చెందిన గుత్తుల చంటి, కాట్రేనికోన మండలం కందికుప్పకు చెందిన పొతూరి ధనంజయరాజు, ఆలమూరు మండలం మూలస్థానం గ్రామానికి చెందిన బొక్కా సురేష్, యానాం కురసంపేటకు చెందిన కడలి ఈశ్వరరావు, అమలాపురం పట్టణం కొంకాపల్లికి చెందిన వినుకొండ గణేష్ పాతనేరస్తులు. చోరీ కేసులో గుత్తల చంటి, భార్యను హత్య చేసిన కేసులో ధనంజయరాజు, ఓ హత్యాత్నం కేసులో వినుకొండ గణేష్ చర్లపల్లి జైలుకు వెళ్లారు. ఈ ముగ్గురికి అక్కడే పరిచయమైంది. ఆ తర్వాత పాత నేరస్తులైన బొక్కా సురేష్, కడలి ఈశ్వరరావులతో కోర్టులకు వాయిదాలకు వెళ్లిన సమయంలో పరిచయాలు ఏర్పడ్డాయి. వీరంతా చైన్‌స్నాచింగ్ ముఠాగా ఏర్పడి చోరీలకు పాల్పడ్డారు. ఈ ముఠా తూర్పుగోదావరి జిల్లాలో 15 చోరీలకు పాల్పడగా, పశ్చిమ గోదావరి జిల్లాలో మూడు, విశాఖ జిల్లాలో ఒకటి, హైదరాబాద్‌లో మరొక చోరీకి పాల్పడింది. ఈ ముఠా అమలాపురంలో మంగళవారం చోరీచేసిన నగలు పంచుకుంటుండగా, పోలీసులు వలపన్ని అరెస్టు చేశారు.
పోలీసులకు రివార్డులు
ఈ ముఠాను చాకచక్యంగా అరెస్టుచేసిన అమలాపురం పోలీసులను ఏఎస్పీ దామోదర్ అభినందించారు. అమలాపురం డీఎస్పీ లంక అంకయ్య, పట్టణ సీఐ వై.ఆర్.కె.శ్రీనివాస్, అమలాపురం క్రైం పార్టీ హెడ్ కానిస్టేబుల్ అయితాబత్తుల బాలకృష్ణ, కానిస్టేబుళ్లు బత్తుల రామచంద్రరావు, గుబ్బల సాయి, వాసిరెడ్డి వరహాలు, సుందర అనిల్‌కుమార్, రాయడు వీర వెంకట సత్యనారాయణకు ఎస్పీ రవిప్రకాష్ రివార్డులు ప్రకటించనున్నట్లు ఏఎస్పీ వివరించారు.