శ్రీనగర్లో దారుణం
శ్రీనగర్: శ్రీనగర్లో ఉగ్రవాదులు సామాన్య పౌరులే లక్ష్యంగా మరో దారుణానికి తెగబడ్డారు. గురువారం ఉదయం నగరం నడి»ొడ్డున ఉన్న పాఠశాలలోకి చొరబడి మహిళా ప్రిన్సిపాల్, మరో టీచర్ను కాల్చి చంపారు. శ్రీనగర్లోని ప్రభుత్వ బాలుర హయ్యర్ సెకండరీ పాఠశాలలో ఉదయం ఉగ్రవాదులు చొరబడ్డారు. ఆన్లైన్ క్లాసులు నడుస్తూ ఉండటంతో ఆ సమయంలో విద్యార్థులెవరూ పాఠశాలలో లేరు.
క్లాసులు చెప్పడానికి సిద్ధమవుతున్న ప్రిన్సిపల్ సుపీందర్ కౌర్, మరో టీచర్ దీపక్ చాంద్పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. పాయింట్ బ్లాంక్ రేంజ్లో కాల్పులు జరపడంతో వారు అక్కడికక్కడే మరణించారు. మైనారీ్టలను ఉగ్రవాదులు టార్గెట్ చేస్తూ ఉండడంతో లోయలో భయాందోళనలు పెరిగాయి. ఉగ్రవాదులు మత సామరస్యాన్ని దెబ్బ తీస్తున్నారని జమ్ముకశ్మీర్ డీజీపీ దిల్బాంగ్ సింగ్ అన్నారు. లోయలో భయభ్రాంతుల్ని సృష్టించడానికే ఈ దాడులకు దిగుతున్నారని అన్నారు. ఇప్పుడిప్పుడే నెలకొంటున్న శాంతిని భగ్నం చేయడానికి పాక్ ఆడిస్తున్నట్టుగా ఉగ్రవాదులు దాడులకు పాల్పడుతున్నారని, త్వరలోనే వారి ఆట కట్టిస్తామని డీజీపీ అన్నారు.
లోయలో వరుస దాడులు
గత అయిదు రోజుల్లో కశీ్మర్ లోయలో జరిగిన వేర్వేరు దాడుల్లో మృతి చెందిన వారి సంఖ్య ఏడుకి చేరుకుంది. ఈ ఏడుగురిలో నలుగురు మైనార్టీ వర్గానికి చెందినవారు. పాఠశాలలో ప్రాణాలు కోల్పోయిన సుపీందర్ కౌర్ శ్రీనగర్కు చెందిన సిక్కు కాగా, దీపక్ చాంద్ హిందువు. రెండు రోజుల క్రితం ప్రముఖ కశ్మీర్ పండిట్ మఖాన్లాల్ బింద్రూని కాల్చి చంపడం, అదే రోజు మరో ఇద్దరి ప్రాణాలు బలి తీసుకోవడం కలకలం రేపింది. ఈ దాడులపై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ స్పందిస్తూ ‘‘కశీ్మర్లో హింస పెరిగిపోతోంది. పెద్ద నోట్లు, ఆర్టికల్ 370 రద్దు ఉగ్రవాదుల్ని నిరోధించలేకపోయాయి. కేంద్ర ప్రభుత్వం భద్రతని కలి్పంచడంలో పూర్తిగా విఫలమైంది’’ అని ట్వీట్ చేశారు.