లక్షలు పెట్టకుండానే.. లక్ష్యాన్ని చేరుకుంటాం!
ఉమన్ ఫైనాన్స్
ఈ రోజుల్లో చాలామంది మహిళలు రిజిస్ట్రేషన్ లేని చిట్టీలు కట్టి మోసపోతున్నారు. అలాగే మరికొంతమంది కిట్టీ పార్టీలు పెట్టుకొని ఆ డబ్బుతో బంగారం/ వెండి కొంటున్నారు. ఇంకొంతమంది నెల నెలా మిగులు డబ్బును పోపు డబ్బాలలో దాస్తున్నారు. దీని వలన ఆ డబ్బుకు వడ్డీ ఏమీ రావడం లేదు. ఇలాంటి వారికి మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడం ఒక చక్కటి మార్గం.
మ్యూచువల్ ఫండ్స్ చిన్న మొత్తాలను సేకరించి వివిధ రకాల పెట్టుబడి (ఈక్విటీ, డెట్) మార్గాలలో పెట్టుబడి పెడతారు. వీటిని ఫండ్ మేనేజర్స్ పరిశీలిస్తూ ఉంటారు.
వీటిలో ఎప్పుడు మీ దగ్గర డబ్బు మిగిలితే అప్పుడు పెట్టుబడి పెట్టవచ్చు. లేదా నెల నెలా క్రమం తప్పకుండా ఒక నిర్ణీత మొత్తాన్ని సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (ఎస్ఐపీ-సిప్)లో పెట్టుబడి పెట్టవచ్చు. వీటిలో ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్స్ (ఈఎల్ఎస్ఎస్) ట్యాక్స్ బెనిఫిట్స్‌ని కూడా అందిస్తాయి.మీరు పెట్టుబడి పెట్టిన స్కీమ్ లాక్ ఇన్ పీరియడ్ లేదా ట్యాక్స్ సేవింగ్ స్కీమ్ కాకపోతే మీ డబ్బును ఎప్పుడైనా వెనక్కి తీసుకోవచ్చు. ఇప్పుడు చాలావరకు ఓపెన్ ఎండెడ్ ఫండ్స్ అందుబాటులో ఉన్నాయి.వీటిలో రాబడి అనేది మార్కెట్ రిస్క్ మీద ఆధారపడి ఉంటుంది.
వీటిలో దీర్ఘకాలిక లక్ష్యాలకు అనుగుణంగా పెట్టుబడి పెడితే ఆ లక్ష్యాలను చేరుకోవచ్చు. మీ పిల్లల పైచదువులకు, పెళ్లిళ్లకు, రిటైర్మెంట్ తదితర అవసరాలకు. ఈ కింద తెలిపిన జాగ్రత్తలను తప్పక తీసుకోండిముందు చిన్న మొత్తంతో సిప్‌లో మొదలుపెట్టి ఆ తరువాత క్రమేణా మీ లక్ష్యానికి అనుగుణంగా పెంచుకుంటూ పోండి.{పతి నెలా క్రమం తప్పకుండా ఇది కూడా ఒక అత్యవసర ఖర్చు అనుకొని, సిప్‌లో జమ చేయండి. ఎన్ని సంవత్సరాలకు అనుకొని పెట్టుబడి మొదలుపెట్టారో అన్ని సంవత్సరాలు పెట్టుబడి పెట్టండి.
మీ లక్ష్యానికి అవసరమైనప్పుడు అవసరానికి తగినంత సొమ్మును మాత్రమే వెనక్కి తీసుకొని మిగిలిన సొమ్మును ఫండ్‌లోనే ఉంచండి.
నెల నెలా ఒక 1000 రూపాయలు ఒక మంచి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్‌లో సిప్ పద్ధతిలో పెట్టుబడి పెడితే రాబడి ఎలా ఉంటుందో ఈ పట్టికలో చూద్దాము. గడచిన 34 సంవత్సరాలలో ఈక్విటీలో పెట్టుబడిని గమనిస్తే వార్షికంగా 17 నుండి 18శాతం రాబడిని అందించాయి.
నెలకు ఒక 1000 రూపాయలను సిప్‌లో పెట్టుబడి పెడితే 18 శాతం చొప్పున 30 సంవత్సరాలకు 1 కోటి 40 లక్షల సంపదను పొందుతూ ఉంటే అలాంటి చిన్న మొత్తాలను మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టలేమా!
మ్యూచువల్ ఫండ్స్ స్కీమును ఎంపిక చేసుకొనేటప్పుడు ఆ మ్యూచువల్ ఫండ్ సంస్థ, యాజమాన్యం, వారి పనితీరు, ఆ స్కీము గడచిన 5, 10, అంతకుమించిన కాలాలకు ఏ విధమైన రాబడులను అందించిందో అలాగే భవిష్యత్తు పనితీరును కూడా పరిగణనలోకి తీసుకొని మీ అవసరాలను బట్టి ఒక 2, 3 స్కీములలో పెట్టుబడిని కొనసాగించవచ్చు. అలాగే 6 నెలలకు, సంవత్సరానికి లేదా కాలానుగుణంగా మీ స్కీము పనితీరును గమనిస్తూ అవసరమైన నిర్ణయాలు తీసుకొనవలసి ఉంటుంది. కనుక సాధ్యమైనంత వరకు మీ ఖర్చులను తగ్గించుకుని పొదుపు చేయడమే కాకుండా ఆ డబ్బును మ్యూచువల్ఫండ్స్లో ఒక క్రమ పద్ధతిలో సిప్‌లో పెట్టుబడి పెట్టి మీ దీర్ఘకాలిక లక్ష్యాలను నెరవేర్చుకోండి.
రజని భీమవరపు
ఫైనాన్షియల్ ప్లానర్, ‘జెన్ మనీ’