మహిళలకు నెలకు 10 వేలు
మహిళా సైన్స్ కాంగ్రెస్ ప్రారంభ సభలో సీఎం
తిరుపతి నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్రంలోని ప్రతి నిరక్షరాస్య మహిళకు నెలకు రూ.10 వేల ఆదాయం సమకూర్చే కార్యక్రమాలను అమలు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. మహిళా శక్తికి తిరుగులేదని, వారు తలచుకొంటే ఎలాంటి క్లిష్టమైన పనైనా సాధించి తీరుతారని కొనియాడారు. ప్రస్తుతం పురుషుల కంటే మహిళలే అద్భుతమైన పనితీరుతో ప్రగతి సాధించగలుగుతున్నారని ప్రశంసించారు. చిత్తూరు జిల్లా తిరుపతి శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంలోని శ్రీనివాస ఆడిటో రియంలో 6వ ఇండియన్ ఉమెన్స్ సైన్స్ కాంగ్రెస్ సమావేశాల్లో బాబు ప్రారంభోపన్యాసం చేశారు. ఆర్థిక స్వావలం బనతోనే మహిళలు ముందుకు వెళ్లగలుగుతారని అన్నారు. ప్రతి నిరక్షరాస్య మహిళకు నెలకు రూ.10 వేలకు తక్కువ కాకుండా ఆదాయాన్ని సమకూర్చిపెట్టడం తన లక్ష్యమని, త్వరలోనే దీనిపై కొన్ని కార్యక్రమాలు చేపడతామని వివరించారు.
వైజ్ఞానిక నగరంగా తిరుపతి: తిరుపతిని త్వరలో వైజ్ఞానిక నగరంగా మారుస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ఇందులో భాగంగా రూ.1,300 కోట్ల అంచనా వ్యయంతో అంతర్జాతీయ ప్రమాణాలతో భారీ సైన్స్ మ్యూజియాన్ని నిర్మిస్తున్నట్లు చెప్పారు తిరుపతి జూ పార్కు సమీపంలో సైన్స్ మ్యూజియం నిర్మాణ పనులను సీఎం బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.