women seats
-
Gujarat Assembly Election 2022: ఆకాశంలో సగం.. అవకాశాలే గగనం!
ఆకాశంలో సగం అంటూ గొప్పగా కీర్తించడమే తప్ప రాజకీయాల్లో మహిళలకు అవకాశాలు కల్పించడంలో మాత్రం పార్టీలు వెనుకంజ వేస్తున్నాయి. జనాభాలో దాదాపు సగం ఉన్న అతివలకు ఆ మేరకు చట్టసభల్లో ప్రాతినిధ్యం దక్కడం లేదు. గుజరాత్లో శాసనసభ ఎన్నికల ముఖచిత్రం పరిశీలిస్తే నిరాశే మిగలడం ఖాయం. రాష్ట్రంలో మొత్తం 182 అసెంబ్లీ స్థానాలుండగా, మొత్తం 1,621 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో మహిళల సంఖ్య కేవలం 139 అంటే ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. వీరిలో ఏకంగా 56 మంది స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తుండడం విశేషం. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 126 మంది మహిళలు పోటీకి దిగారు, 13 మంది విజయం సాధించారు. అప్పట్లో 104 మంది మహిళలు డిపాజిట్ సైతం కోల్పోయారు. ‘ఆప్’ నుంచి ఆరుగురు ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధానంగా మూడు పార్టీలు పోటీ పడుతున్నాయి. ముక్కోణపు పోటీ కనిపిస్తోంది. అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్‌తోపాటు ఈసారి అదృష్టం పరీక్షించుకుంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) కూడా మహిళలకు పరిమిత సంఖ్యలోనే టిక్కెట్లిచ్చాయి. ఈ మూడు పార్టీల నుంచి కేవలం 38 మంది మహిళా అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. 2017 ఎన్నికలతో పోలిస్తే ఈసారి వారి సంఖ్య పెరగడం కొంత ఊరటనిచ్చే విషయం. 2017లో బీజేపీ 12 మంది మహిళామణులకు టిక్కెట్లు ఇవ్వగా, ఈ ఎన్నికల్లో 18 మందికి అవకాశం కల్పించింది. ఇక కాంగ్రెస్ విషయానికొస్తే.. 2017లో 10 మందికి, ఇప్పుడు 14 మంది ఆ పార్టీ టిక్కెట్లు లభించాయి. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు దళిత, గిరిజన మహిళలకు టిక్కెట్లు ఇచ్చాయి. ఈసారి ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి మొత్తం 182 మంది అభ్యర్థులు పోటీకి దిగారు. వీరిలో మహిళలు కేవలం ఆరుగురు. ఈ ఆరుగురిలో ముగ్గురు ఎస్టీ రిజర్వ్డ్ స్థానం నుంచి పోటీ పడుతున్నారు. 13 స్థానాల్లో పోటీ చేస్తున్న ఆలిండియా మజ్లిస్ ఇత్తెహదూల్ ముస్లిమీన్(ఏఐఎంఐఎం) పార్టీ చేస్తున్న ఇద్దరు మహిళలకు టిక్కెట్లు కేటాయించింది. వీరిలో ఒకరు ముస్లిం కాగా, మరో మహిళ దళిత వర్గానికి చెందినవారు. బహుజన సమాజ్ పార్టీ(బీఎస్పీ) 101 స్థానాల్లో పోటీ చేస్తోంది. 13 మంది మహిళలకు టిక్కెట్లు ఇచ్చింది. జాతీయ పార్టీ అయిన సీపీఎం ఒక మహిళా అభ్యర్థిని ఎన్నికల బరిలో దింపింది. ఎస్సీ, ఎస్టీలకు మరిన్ని టిక్కెట్లు బీజేపీకి 9 మంది మహిళా సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉండగా, ఈసారి ఐదుగురికి మొండిచెయ్యి చూపింది. నలుగురికి మరోసారి టిక్కెట్లు కేటాయించింది. కాంగ్రెస్‌కు నలుగురు మహిళా సిట్టింగ్ ఎమ్మెల్యేల ఉన్నారు. వీరిలో ఇద్దరికి మళ్లీ అవకాశం కల్పించింది. 2017 ఎన్నికల కంటే ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ రిజర్వ్డ్ స్థానాల్లో మహిళా అభ్యర్థుల సంఖ్య పెరగడం సానుకూల అంశం. 2017లో బీజేపీ ఎస్సీ స్థానాల్లో ఇద్దరికి, ఎస్టీ స్థానాల్లో ఒక మహిళకు టిక్కెట్లు ఇవ్వగా, ఇప్పుడు ఎస్సీ స్థానాల్లో నలుగురికి, ఎస్టీ స్థానాల్లో ఇద్దరికి పోటీ చేసే అవకాశం కల్పించింది. అప్పటి ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి ఇద్దరు ఎస్టీ మహిళా అభ్యర్థులు పోటీ చేశారు. ఎస్సీలకు చోటు దక్కలేదు. ఈసారి నలుగురు ఎస్టీ, ఒక ఎస్సీ మహిళా అభ్యర్థి కాంగ్రెస్ టిక్కెట్లు దక్కించుకున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ ముగ్గురు ఎస్టీ మహిళలకు టిక్కెట్లు ఇచ్చింది. బిల్లు ఆమోదం పొందితే.. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందితేనే ఎన్నికల్లో వారి సంఖ్య పెరుగుతుందని శాయాజీగంజ్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అమీ రావత్ చెప్పారు. ఉన్నత పదవుల్లో మహిళలను నియమించడంలో తమ పార్టీ ముందంజలో ఉందని గుజరాత్ బీజేపీ మహిళా విభాగం అధ్యక్షురాలు దీపికాబెన్ సర్వాదా వెల్లడించారు. ఒక గిరిజన మహిళను తమ పార్టీ దేశ రాష్ట్రపతిగా ఎన్నుకుందని గుర్తుచేశారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
బిహార్ ఎన్నికలు: మాకు 50 శాతం సీట్లు ఇవ్వండి
‘మేము పాలిచ్చి పెంచినవారే మమ్మల్ని విభజించి పాలిస్తున్నారు’ అని ఒక తెలుగుకవయిత్రి రాసింది.స్త్రీలను పాలితులుగా ఉంచడానికే మగ ప్రపంచం ఎప్పుడూ ప్రయత్నిస్తూ ఉంది.లోక్‌సభలో అడుగుపెట్టని ‘మహిళా రిజర్వేషన్ బిల్’ ఇందుకు సాక్ష్యం. అక్టోబర్‌లో జరగనున్న అసెంబ్లీ ఎలక్షన్లలోనైనా మాకు 50 శాతం సీట్లు ఇవ్వండి అని బిహార్‌లో ‘శక్తి’ అనే స్త్రీ సంఘటన ఆధ్వర్యంలో మహిళా సర్పంచ్‌లు, చేతనాపరులు భారీగా ‘సెల్ఫీ కాంపెయిన్’ నిర్వహిస్తున్నారు. అన్నీ సక్రమంగా కుదిరితే బిహార్‌లో అక్టోబర్–నవంబర్ మాసాలలో అసెంబ్లీ ఎలక్షన్లు జరుగుతాయి. ఈ కరోనా కాలంలో ఒక పెద్ద రాష్ట్రంలో జరగనున్న ఎలక్షన్లు కచ్చితంగా ఆసక్తి కలిగించేవే. మున్ముందు ఎన్నో ఎలక్షన్ వార్తలు ఈ రాష్ట్రం నుంచి వింటాము. అయితే ముందుగా వింటున్నది మాత్రం అక్కడి ‘శక్తి’ అనే స్త్రీ సంఘటన మొదలెట్టిన ‘హాష్‌ట్యాగ్ 50 పర్సెంట్ ఉమీద్వార్’ అనే సెల్ఫీ కాంపెయిన్ గురించే. బిహార్‌లో జరగనున్న ఎన్నికలలో యాభై శాతం సీట్లు స్త్రీలకు కేటాయించాలని కోరుతూ ఇప్పటికే అక్కడ ముఖియాలుగా, సర్పంచ్‌లుగా ఉన్న మహిళలతో, మహిళా ఎం.ఎల్.ఏలతో, ప్రజా సంఘాల ప్రతినిధులతో ఈ సెల్ఫీ కాంపెయిన్ నిర్వహిస్తున్నారు. ‘ఆధా హమ్ ఆధా హమారా’ (సగం మేము సగం మాది) అనేది ఈ కాంపెయిన్ నినాదం. బిహార్‌లోని 120 ప్రజా సంఘాలు ఈ ప్రచారంలో పాల్గొంటున్నాయి. కేవలం 9 శాతమే బిహార్‌లో స్థానిక సంస్థల ఎన్నికలలో స్త్రీలకు 50 శాతం సీట్లు కేటాయిస్తూ 2006లో బిల్ తెచ్చారు. దీనివల్ల అక్కడ దాదాపు రెండు లక్షల మంది మహిళలకు అవకాశం దక్కింది. అయితే అసెంబ్లీ ఎన్నికలలో కేవలం 9 శాతం మందికే సీట్లు దక్కుతున్నాయి. రాష్ట్రస్థాయి పార్టీలుగాని, జాతీయ స్థాయి పార్టీలుగాని ప్రతిసారి కేవలం తొమ్మిది, పది శాతానికి స్త్రీ అభ్యర్థుల సంఖ్యను పరిమితం చేస్తున్నాయి. 2015 ఎన్నికలలో 243 సీట్లకుగాను కేవలం 28 మంది మహిళా అభ్యర్థులే అక్కడ అసెంబ్లీకి వెళ్లగలిగారు. బిహార్ ఓటర్లలో ఇప్పుడు 60 శాతం మహిళలు అయితే 40 శాతం పురుషులు. ‘అయినా సరే మాకెందుకు ఇంత అన్యాయం’ అని అక్కడి మహిళా చేతనాపరులు ప్రశ్నిస్తున్నారు. పురుష అడ్డంకులు మహిళా ఎం.ఎల్.ఏలు గెలిచినా వారు తమ పాలనను విజయవంతంగా చేయడానికి వీల్లేని అడ్డంకులు పురుషులు కల్పిస్తుంటారని ‘శక్తి’ సభ్యులొకరు వ్యాఖ్యానించారు. పురుష అధికారులుగాని, ఎం.ఎల్.ఏల భర్తలుగాని, ఆ ఎం.ఎల్.ఏలకు ఏర్పాటైన పురుష పి.ఏలుగాని సదరు మహిళా ఎం.ఎల్.ఏకు ప్రజలకు మధ్య అడ్డుగోడగా నిలుస్తుంటారని ‘శక్తి’ పరిశీలన. దీనివల్ల మహిళలు శాసన సభ్యులుగా విఫలమైతే అది సాకుగా చూపించి మహిళలకు తక్కువ సీట్లు కేటాయించడం ఒక ‘గేమ్’గా సాగిస్తున్నారని కూడా ఆ సంస్థ సభ్యులు వ్యాఖ్యానిస్తున్నారు. భర్తలకు గత్యంతరం లేనప్పుడే భార్యలకు ఎలక్షన్లలో చోటు కల్పించే ఘటనలు ఉన్నాయి. లాలూ ప్రసాద్ యాదవ్ భార్య రబ్రీ దేవి ఏ పరిస్థితుల్లో బిహార్ సి.ఎం. అయ్యారో అందరికీ తెలుసు. అందరూ ఒక్కటై ‘స్త్రీల సమస్యలు స్త్రీలకే మరింతగా తెలుస్తాయి. శాసనాధికారంలో మహిళలు లేనప్పుడు వారికి న్యాయం జరగడం సాధ్యం కాదు. అందుకే వారికి సమాన సీట్లు దక్కాలి’ అని ‘శక్తి’ ప్రతినిధి తెలిపారు. స్త్రీలకు సగం సీట్లు కేటాయించే విషయంలో వొత్తిడి తేవడానికి అక్కడ మహిళా, మైనారిటీ, విద్యార్థి, ఆదివాసి సంఘాలు ఏకతాటిపైకి వచ్చాయి. ఆయా పార్టీల పెద్దలను కలిసి మాట్లాడుతున్నాయి. వినతి చేస్తున్నాయి. వీరి వొత్తిడి ఏ స్థాయి ఫలితాన్నిస్తుందో చూడాలి. – సాక్షి ఫ్యామిలీ -
విమానాల్లో... మహిళలకు మాత్రమే!!
వినూత్న సేవలకు ఎయిర్ ఇండియా శ్రీకారం న్యూఢిల్లీ: ‘స్త్రీలను గౌరవించడం మన సంప్రదాయం. వారికి కేటాయించిన సీట్లలో వారినే కూర్చోనిద్దాం’.. ఇలాంటి వాక్యాలు బస్సుల్లో చూస్తుంటాం. ఇపుడీ ట్రెండ్ విమానాల్లోనూ ఆరంభమైంది. ఎయిర్ ఇండియా తాజాగా తన దేశీ విమానాల్లో ఈ నెల 18 నుంచి మహిళల కోసం ఆరు సీట్లను ప్రత్యేకంగా రిజర్వు చేస్తున్నట్లు ప్రకటించింది. ‘మహిళలు విమానాల్లో ఒంటరిగా ప్రయాణించేటపుడు వారికి కిటికీ పక్కనో, మధ్యలోనో సీటు దొరకవచ్చు. అలాంటప్పుడు వారు వాష్‌రూమ్‌కు వెళ్లాలంటే కొంత అసౌకర్యంగా అనిపిస్తుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొనే స్త్రీలకు ప్రత్యేకంగా కొన్ని సీట్లను రిజర్వు చేస్తున్నాం’ అని ఎయిర్ ఇండియా అధికారి చెప్పారు. కుటుంబంతో కలిసి ప్రయాణించే మహిళలకు ఈ సౌకర్యం వర్తించదు. ఏవియేషన్ పరిశ్రమలో ఇలాంటి సేవలు ఇదే ప్రథమం.