‘మేము పాలిచ్చి పెంచినవారే మమ్మల్ని విభజించి పాలిస్తున్నారు’ అని ఒక తెలుగుకవయిత్రి రాసింది.స్త్రీలను పాలితులుగా ఉంచడానికే మగ ప్రపంచం ఎప్పుడూ ప్రయత్నిస్తూ ఉంది.లోక్‌సభలో అడుగుపెట్టని ‘మహిళా రిజర్వేషన్ బిల్’ ఇందుకు సాక్ష్యం. అక్టోబర్‌లో జరగనున్న అసెంబ్లీ ఎలక్షన్లలోనైనా మాకు 50 శాతం సీట్లు ఇవ్వండి అని బిహార్‌లో ‘శక్తి’ అనే స్త్రీ సంఘటన ఆధ్వర్యంలో మహిళా సర్పంచ్‌లు, చేతనాపరులు భారీగా ‘సెల్ఫీ కాంపెయిన్’ నిర్వహిస్తున్నారు.
అన్నీ సక్రమంగా కుదిరితే బిహార్‌లో అక్టోబర్–నవంబర్ మాసాలలో అసెంబ్లీ ఎలక్షన్లు జరుగుతాయి. ఈ కరోనా కాలంలో ఒక పెద్ద రాష్ట్రంలో జరగనున్న ఎలక్షన్లు కచ్చితంగా ఆసక్తి కలిగించేవే. మున్ముందు ఎన్నో ఎలక్షన్ వార్తలు ఈ రాష్ట్రం నుంచి వింటాము. అయితే ముందుగా వింటున్నది మాత్రం అక్కడి ‘శక్తి’ అనే స్త్రీ సంఘటన మొదలెట్టిన ‘హాష్‌ట్యాగ్ 50 పర్సెంట్ ఉమీద్‌వార్’ అనే సెల్ఫీ కాంపెయిన్ గురించే. బిహార్‌లో జరగనున్న ఎన్నికలలో యాభై శాతం సీట్లు స్త్రీలకు కేటాయించాలని కోరుతూ ఇప్పటికే అక్కడ ముఖియాలుగా, సర్పంచ్‌లుగా ఉన్న మహిళలతో, మహిళా ఎం.ఎల్.ఏలతో, ప్రజా సంఘాల ప్రతినిధులతో ఈ సెల్ఫీ కాంపెయిన్ నిర్వహిస్తున్నారు. ‘ఆధా హమ్ ఆధా హమారా’ (సగం మేము సగం మాది) అనేది ఈ కాంపెయిన్ నినాదం. బిహార్‌లోని 120 ప్రజా సంఘాలు ఈ ప్రచారంలో పాల్గొంటున్నాయి.
కేవలం 9 శాతమే
బిహార్‌లో స్థానిక సంస్థల ఎన్నికలలో స్త్రీలకు 50 శాతం సీట్లు కేటాయిస్తూ 2006లో బిల్ తెచ్చారు. దీనివల్ల అక్కడ దాదాపు రెండు లక్షల మంది మహిళలకు అవకాశం దక్కింది. అయితే అసెంబ్లీ ఎన్నికలలో కేవలం 9 శాతం మందికే సీట్లు దక్కుతున్నాయి. రాష్ట్రస్థాయి పార్టీలుగాని, జాతీయ స్థాయి పార్టీలుగాని ప్రతిసారి కేవలం తొమ్మిది, పది శాతానికి స్త్రీ అభ్యర్థుల సంఖ్యను పరిమితం చేస్తున్నాయి. 2015 ఎన్నికలలో 243 సీట్లకుగాను కేవలం 28 మంది మహిళా అభ్యర్థులే అక్కడ అసెంబ్లీకి వెళ్లగలిగారు. బిహార్ ఓటర్లలో ఇప్పుడు 60 శాతం మహిళలు అయితే 40 శాతం పురుషులు. ‘అయినా సరే మాకెందుకు ఇంత అన్యాయం’ అని అక్కడి మహిళా చేతనాపరులు ప్రశ్నిస్తున్నారు.
పురుష అడ్డంకులు
మహిళా ఎం.ఎల్.ఏలు గెలిచినా వారు తమ పాలనను విజయవంతంగా చేయడానికి వీల్లేని అడ్డంకులు పురుషులు కల్పిస్తుంటారని ‘శక్తి’ సభ్యులొకరు వ్యాఖ్యానించారు. పురుష అధికారులుగాని, ఎం.ఎల్.ఏల భర్తలుగాని, ఆ ఎం.ఎల్.ఏలకు ఏర్పాటైన పురుష పి.ఏలుగాని సదరు మహిళా ఎం.ఎల్.ఏకు ప్రజలకు మధ్య అడ్డుగోడగా నిలుస్తుంటారని ‘శక్తి’ పరిశీలన. దీనివల్ల మహిళలు శాసన సభ్యులుగా విఫలమైతే అది సాకుగా చూపించి మహిళలకు తక్కువ సీట్లు కేటాయించడం ఒక ‘గేమ్’గా సాగిస్తున్నారని కూడా ఆ సంస్థ సభ్యులు వ్యాఖ్యానిస్తున్నారు. భర్తలకు గత్యంతరం లేనప్పుడే భార్యలకు ఎలక్షన్లలో చోటు కల్పించే ఘటనలు ఉన్నాయి. లాలూ ప్రసాద్ యాదవ్ భార్య రబ్రీ దేవి ఏ పరిస్థితుల్లో బిహార్ సి.ఎం. అయ్యారో అందరికీ తెలుసు.
అందరూ ఒక్కటై
‘స్త్రీల సమస్యలు స్త్రీలకే మరింతగా తెలుస్తాయి. శాసనాధికారంలో మహిళలు లేనప్పుడు వారికి న్యాయం జరగడం సాధ్యం కాదు. అందుకే వారికి సమాన సీట్లు దక్కాలి’ అని ‘శక్తి’ ప్రతినిధి తెలిపారు. స్త్రీలకు సగం సీట్లు కేటాయించే విషయంలో వొత్తిడి తేవడానికి అక్కడ మహిళా, మైనారిటీ, విద్యార్థి, ఆదివాసి సంఘాలు ఏకతాటిపైకి వచ్చాయి. ఆయా పార్టీల పెద్దలను కలిసి మాట్లాడుతున్నాయి. వినతి చేస్తున్నాయి. వీరి వొత్తిడి ఏ స్థాయి ఫలితాన్నిస్తుందో చూడాలి.
– సాక్షి ఫ్యామిలీ
Comments
Please login to add a commentAdd a comment