బిహార్‌లో ఒక బాలీవుడ్డే ఉంది! | Women Movie Celebrities Campaign In Bihar Elections | Sakshi
Sakshi News home page

బిహార్‌ బాలీటిక్స్‌

Published Sat, Oct 31 2020 3:26 AM | Last Updated on Sat, Oct 31 2020 4:48 AM

Women Movie Celebrities Campaign In Bihar Elections - Sakshi

కాంగ్రెస్‌ తరఫున 2014లో అలహాబాద్‌ ఎన్నికల ప్రచారంలో అమీషా పటేల్‌ 

ఎన్నికల ర్యాలీకి జనం రావాలి.  రావాలంటే.. బలమైన ఆకర్షణ ఏదైనా ఉండాలి.  లీడర్‌కి సహజ ఆకర్షణ ఉంటుంది.  అది కాదు. అదనపు ‘ఎట్రాక్షన్‌’ కావాలి. సినీ నటీమణుల గ్లామర్‌. బిహార్‌లో ఒక బాలీవుడ్డే ఉంది! రెండు, మూడు విడతల్లో వాళ్లంతా ప్రచారానికి రావచ్చు.  అయితే వస్తారా?!  ముంబై తార అమీషా పటేల్‌కు..  చేదు అనుభవం అయ్యాక కూడా!

బిహార్‌ తొలి విడత ఎన్నికల ప్రచారంలో సోమవారం అమీషా పటేల్, లోక్‌ జనశక్తి పార్టీ అభ్యర్థి ప్రకాష్‌ చంద్ర

ఎన్నికల ప్రచారానికి సినీ కథానాయికల వల్ల గ్లామర్‌ వస్తుంది. జనం వస్తారు. ఓట్లు కూడా పడితే పడొచ్చు. ప్రజల దృష్టి మాత్రం పడి తీరుతుంది. బాలీవుడ్‌ తార అమీషా పటేల్‌ బిహార్‌ ఎన్నికల్లో లోక్‌ జనశక్తి పార్టీ అభ్యర్థి ప్రకాష్‌ చంద్ర తరఫున ఔరంగాబాద్‌ జిల్లాలోని ఓబ్రా అసెంబ్లీ నియోజవర్గంలో ప్రచారానికి వచ్చారు. ఆయనే ఆమెను తనకు తెలిసిన వారి ద్వారా ప్రచారానికి పిలిపించుకున్నారు. అక్టోబర్‌ 28 న జరిగిన తొలి విడత పోలింగ్‌లో ఓబ్రా కూడా ఉంది. ప్రచారం అయ్యాక అమీషా ముంబై వెళ్లిపోయారు. ‘‘మేడమ్‌.. దౌద్‌నగర్‌ ర్యాలీ ముగిశాక మీ మీద అత్యాచారం జరగబోయిందని మీరు చెబుతున్నట్లుగా సోషల్‌ మీడియాలో ఆడియో క్లిప్‌ వైరల్‌ అవుతోంది. అది మీరేనా!’’ అని ప్రెస్‌ వాళ్లు వచ్చి అడిగారు. అమీషా ఆశ్చర్యపోయారు. ‘‘అవును. నన్ను బెదిరించారు. అత్యాచారం చేయబోయారు. దొరికి ఉంటే చంపేసేవారు కూడా. ప్రకాష్‌ చంద్ర ఉద్దేశపూర్వకంగా నా ఫ్లయిట్‌ మిస్సయ్యేలా చేశాడు. రాత్రంతా నన్నొక గ్రామంలో ఉంచాడు. నాతో అసభ్యంగా ప్రవర్తించాడు. తప్పించుకుని వచ్చేశాను’’ అని చెప్పారు. చిన్న సంగతేం కాదు. నేడో రేపో ప్రకాష్‌ చంద్ర మీద కేసు ఫైల్‌ కావచ్చు. అయితే అమీషా చెబుతున్నవన్నీ అబద్ధాలని ఆయన అంటున్నారు. ప్రత్యర్థుల దగ్గర డబ్బులు తీసుకుని ఆమె అలా చెబుతున్నారని అయన ఆరోపణ. అమీషా మాత్రం.. ‘‘కావాలంటే చూడండి, నేను ముంబై వచ్చాక కూడా నన్ను బెదిరిస్తూ టెక్స్‌›్ట చేశాడు’’ అని సాక్ష్యాధారాలు చూపిస్తున్నారు.

ప్రియాంకా చోప్రా, శ్వేతాబసు ప్రసాద్‌  
ఈ ఆరోపణలు, ప్రత్యారోపణలలో ప్రకాశ్‌ చంద్ర ఒక మాట అన్నారు. ‘‘బిహారేమీ ఎన్నికల ప్రచారానికి బాలీవుడ్‌ తారల కోసం ముఖం వాచిపోలేదు. మాకు సోనాక్షీ సిన్హా అంతటి వారే ఉన్నారు’’ అని! ఏమాత్రం అతకని మాట అది. అయినా.. సోనాక్షి గానీ, ఆమె తండ్రి శత్రుఘ్న సిన్హా గానీ లోక్‌ జనశక్తి పార్టీలో లేరు. మరో బిహార్‌ నటి అక్షరాసింగ్‌ ఇప్పటికే జనతాంత్రిక్‌ వికాస్‌ పార్టీ తరఫున ప్రచారం చేస్తున్నారు. అక్షరాసింగ్‌ పాట్నా అమ్మాయే. నేహాసింగ్‌ రాథోడ్‌ అని ఇంకో అమ్మాయి (23) ఉన్నా ఆమె ఏ పార్టీకీ మద్దతు ఇవ్వడం లేదు. భోజ్‌పురి ర్యాప్‌ సింగర్‌ తను. కేంద్రంలో ఎవరు పవర్‌లో ఉంటే వారిని, రాష్ట్రంలో ఎవరు అధికారంలో ఉంటే వారినీ విమర్శిస్తూ పాటలు పాడి, యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేస్తుంటుంది. బిహార్‌లోని మిగిలిన తారామణులంతా బాలీవుడ్‌లో ఉన్నారు. నవంబర్‌ 3, 7 తేదీలలో జరిగే రెండు, మూడు విడతల పోలింగ్‌ ప్రచారానికైతే వాళ్లెవరూ ఇప్పటి వరకు రాలేదు.

సోనాక్షీ సిన్హా , అక్షరాసింగ్‌  
బిహార్‌ నుంచి వెళ్లి బాలీవుడ్‌లో, ఇతర చిత్ర పరిశ్రమల్లో వెలిగిన, వెలుగుతున్న నటీమణులు చాలామందే ఉన్నారు. ప్రియాంక చోప్రా అయితే ఏకంగా హాలీవుడ్‌కే వెళ్లారు! ప్రియాంక జార్ఖండ్‌ అమ్మాయి. 2000లో జార్ఖండ్‌ విడిపోకముందు బిహార్‌లోనే కదా ఉంది. సోనాక్షీ సిన్హా పట్నా నుంచి బాలీవుడ్‌కి వెళ్లారు. శ్వేత బసు ప్రసాద్‌ పుట్టింది జంషెడ్‌పుర్‌లోనే. ఆమె మన తెలుగులోనూ నటించారు. నేహాశర్మది బిహార్‌లోని భగల్పూర్‌. రామ్‌చరణ్‌ తొలి చిత్రం ‘చిరుత’లో హీరోయిన్‌గా నటించారు. నీతూ చంద్ర పాట్నా నుంచి వెళ్లారు. నటి, బాలీవుడ్‌ నిర్మాత కూడా ఆమె. హిందీతో పాటు తెలుగు సహా అన్ని దక్షిణాది భాషల్లో నీతూ నటించారు. ‘గోదావరి’లో రాజీ ఈమే. బిహార్‌ నుంచి బాలీవుడ్‌కి వెళ్లిన ‘ఝా’లు ముగ్గురు ఉన్నారు. అనురితా ఝా, కావేరీ ఝా, కోమల్‌ ఝా. కావేరీ, కోమల్‌ తెలుగులో కూడా నటించారు. కావేరిది దర్భంగా, కోమల్‌ది రాంచీ. అనురిత మధుబని అమ్మాయి. ఇంకొక బాలీవుడ్‌ నటి శాండిలీ సిన్హా మన ‘ఒరే పాండూ’ లో నటించారు. తనది ముజఫర్‌పుర్‌.

నేహాసింగ్‌ రాథోడ్‌, దీపికా సింగ్‌   
బిహార్‌ నుంచి మొత్తం పదికి పైగా బాలీవుడ్‌కి వెళ్లిన నటీమణులు వీళ్లు. ఈ సంఖ్య తక్కువేమీ కాదు. వీళ్లు కాకుండా టీవీలో దీపికాసింగ్‌ (దియా ఔర్‌ బాతీ హమ్‌), శృతీ ఝా (కుంకుం భాగ్య), రతన్‌ రాజ్‌పుత్‌ (సంతోషీ మా), ఛవీ పాండే (ఏక్‌ బూంద్‌ ఇష్క్‌), అలీషా సింగ్‌ (బూగీ ఊగీ) బిహార్‌ వాళ్లే. దీపిక ఢిల్లీలో ఉంటున్నా ఆమె పూర్వికులది బిహార్‌. శృతీ ఝా బెగుసరాయ్‌. ఛవీ పాండే పట్నా. అలీషా రాంచీ. బిహార్‌లో మిగిలిన రెండు విడతల పోలింగ్‌ ప్రచారానికి వీరిలో కొందరు ఏదో ఒక పార్టీ తరఫున వచ్చే అవకాశాలైతే ఉంటాయి. అయితే అమీషాకు ఎదురైన చేదు అనుభవం తర్వాత కూడా ప్రచారానికి వచ్చేందుకు ఆసక్తి చూపుతారా?! ఎంత డబ్బు ఇస్తామన్నా?!

శృతీ ఝా, రతన్‌ రాజ్‌పుత్‌  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement