డబ్ల్యూఈఎఫ్‌లో మహిళా దిగ్గజాల హవా
దావోస్: ప్రపంచ ఆర్థిక ఫోరం (డబ్ల్యూఈఎఫ్) సదస్సులో పలువురు మహిళా వ్యాపార దిగ్గజాలు కూడా పాల్గొంటున్నారు. ఈ జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ డెరైక్టర్ నీతా అంబానీతో పాటు ఆమె కుమార్తె ఈషా అంబానీ కూడా ఉన్నారు. రిలయన్స్ రిటైల్ వెంచర్స్ డెరైక్టర్‌గా ఈషా పాల్గొంటున్నారు. అటు ఐసీఐసీఐ బ్యాంక్ చీఫ్ చందా కొచర్, ఎస్బీఐ చైర్పర్సన్ అరుంధతి భట్టాచార్య కూడా ఇందులో ఉన్నారు.
వీరితో పాటు షాను హిందుజా, సంజనా గోవిందన్ జయదేవ్, ప్రియా హీరనందానీ వాందేవాలా, వందన్ గోయల్ మొదలైన వారు ఉన్నారు. మొత్తం 2,500 మంది డబ్ల్యూఈఎఫ్ సదస్సులో పాల్గొంటుండగా ఇందులో 17 శాతం మంది మాత్రమే మహిళలు ఉన్నారు. గడిచిన 2-3 ఏళ్లలో మహిళల సంఖ్య ఇదే స్థాయిలో ఉండటం గమనార్హం.ఇందులోనూ భారత్ నుంచి హాజరవుతున్న వారి సంఖ్య మరీ తక్కువ. ఈ విషయంలో చైనా, అమెరికా పరిస్థితి మెరుగ్గా ఉంది. మరోవైపు, ఈసారి సదస్సులో యువ మహిళా వ్యాపారవేత్తలు మాత్రం చెప్పుకోతగ్గ ఉన్నారు. గ్లోబల్ షేపర్స్ గ్రూప్‌లో 50 మంది యువ లీడర్లు ఉండగా.. అందులో సగభాగం పైగా మహిళలే ఉన్నారు.
వినియోగదారులకు 1.5 ట్రిలియన్ డాలర్లు: ఐహెచ్ఎస్
తగ్గుతున్న చమురు ధరల వల్ల దాదాపు 1.5 టిలియన్ డాలర్ల సంపద వినియోగదారులకు బదిలీ అవుతుందని ప్రముఖ ప్రపంచ విశ్లేషణా, సమాచార సేవల సంస్థ ఐహెచ్ఎస్ పేర్కొంది. దావోస్‌లో వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్) వార్షిక సమావేశాల ప్రారంభం రోజు ఐహెచ్ఎస్ ఈ ప్రకటన చేసింది. ముఖ్యంగా భారత్ ఆర్థిక వ్యవస్థకు ఎంతో ప్రయోజనం చేకూర్చే అంశాల్లో ఇదొకటని సంస్థ చీఫ్ ఎకనమిస్ట్ నారీమన్ బెహ్రావాష్ అన్నారు.