ఎన్నాళ్లకెన్నాళ్లకు...
జ్వాల-అశ్విని జంటకు కెనడా ఓపెన్ టైటిల్
న్యూఢిల్లీ: తన ఘాటైన విమర్శలతో తరచూ వార్తల్లో నిలిచే భారత బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాల ఈసారి తన అద్వితీయ ఆటతీరుతో ఆకట్టుకుంది. తన భాగస్వామి అశ్విని పొన్నప్పతో కలిసి జ్వాల కెనడా ఓపెన్ గ్రాండ్‌ప్రి టోర్నమెంట్లో డబుల్స్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. కెనడాలోని కాల్గరీ పట్టణంలో భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన మహిళల డబుల్స్ ఫైనల్లో మూడో సీడ్ జ్వాల-అశ్విని ద్వయం 21-19, 21-16తో టాప్ సీడ్, ప్రపంచ ఎనిమిదో ర్యాంక్ జంట ఎఫ్‌జి ముస్కెన్స్-సెలెనా పీక్ (నెదర్లాండ్స్)పై సంచలన విజయం సాధించింది. విజేతగా నిలిచిన జ్వాల-అశ్వినిలకు 3,950 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 2 లక్షల 52 వేలు)తోపాటు 5,500 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.
2010లో ఢిల్లీ కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణ పతకం నెగ్గాక జ్వాల-అశ్విని జంట మరో అంతర్జాతీయ టోర్నమెంట్లో విజేతగా నిలువడం ఇదే తొలిసారి. లండన్‌లో జరిగిన 2011 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఈ జంట కాంస్య పతకం సాధించింది. 2013లో స్వదేశంలో జరిగిన టాటా ఓపెన్ అంతర్జాతీయ టోర్నీలో... 2014 గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్‌లో జ్వాల-అశ్విని జోడీ రన్నరప్‌గా నిలిచింది. మొత్తానికి నిలకడైన ఆటతీరుతో ఆలస్యంగానైనా ఈ జంట టైటిల్ లోటును తీర్చుకొని మళ్లీ ఫామ్‌లోకి వచ్చింది. ప్రధాని, సీఎం అభినందన: కెనడా గ్రాండ్ ప్రి టైటిల్ సాధించిన జ్వాల జోడీని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు అభినందించారు.