'నా ఇంటి పైకి కప్పను తోస్తావంటూ..'
అలంపూర్‌రూరల్: తగవు పెట్టుకోవాలనుకుంటే పెద్ద కారణాలేం అక్కర్లేదు..చిన్నదైనా చాలు. తన ఇంటి ఆవరణలోకి వచ్చిన కప్పను ఆ ఇంటావిడ పక్కింటి వైపు తోసేసింది. ఇంకేముంది పక్కంటామే కయ్యిమంది.. తన ఇంట్లోకి ఎందుకు నెట్టావంటూ గొడవకు దిగింది. చివరికి ఈ గొడవ పోలీసుల వద్దకు చేరింది.
మహబూబ్‌నగర్ జిల్లాలో జరిగిన ఈ విడ్డూరం వివరాలివీ.. మహబూబ్ నగర్ జిల్లా అలంపూర్ మండలం గంధిమల్లలోని ఓ ఇంటి ఆవరణలోకి మంగళవారం ఉదయం కప్ప ఒకటి గెంతుతూ వచ్చింది. దీంతో ఆ ఇంటి మహిళ పక్కింటి పైకి తోసింది. గమనించిన పక్కింటి మహిళ కప్పను తిరిగి వారి ఇంటిపైకి తోసింది. ‘నా ఇంటికిపైకి కప్పను తోస్తావా’ అంటూ ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఒకదశలో ఇద్దరు సిగపట్లు పట్టారు. చివరకు పంచాయితీ పోలీస్‌స్టేషన్‌కు చేరింది. గ్రామపెద్దలు జోక్యం చేసుకుని ఇద్దరు మహిళలను మందలించి తీసుకెళ్లారు.