womens tournment
-
తెలంగాణకు కాంస్యం... విజేత హిమాచల్
సాక్షి, హైదరాబాద్: జాతీయ సీనియర్ మహిళల హ్యాండ్‌బాల్ టోర్నీలో తెలంగాణ జట్టు కాంస్య పతకం సాధించింది. ఆదివారం ముగిసిన ఈ టోర్నీ సెమీఫైనల్లో తెలంగాణ 9–16తో హిమాచల్‌ప్రదేశ్ జట్టు చేతిలో ఓడింది. ఫైనల్లో హిమాచల్‌ప్రదేశ్ 20–10తో రైల్వేస్‌ను ఓడించి చాంపియన్‌గా అవతరించింది. తెలంగాణ రాష్ట్ర క్రీడల మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ విజేతలకు ట్రోఫీలు అందజేశారు. ఈ కార్యక్రమంలో భారత హ్యాండ్‌బాల్ సమాఖ్య అధ్యక్షుడు జగన్మోహన్ రావు, బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ గోపీచంద్, తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. -
47 పరుగులకే ఆలౌట్..
షార్జా: మహిళల టీ20 చాలెంజ్ చరిత్రలో చెత్త రికార్డు నమోదైంది. గురువారం ట్రయల్‌బ్లేజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వెలాసిటీ ఘోర ఓటమి చవిచూసింది. తొలుత బ్యాటింగ్ చేసిన వెలాసిటి 15.1 ఓవర్లలో 47 పరుగులకే కుప్పకూలింది. దాంతో టోర్నీ చరిత్రలో అత్యల్ప స్కోరును తన పేరిట లిఖించుకుంది. ట్రయల్‌బ్లేజర్స్ బౌలర్ సోఫీ ఎక్సీస్టోన్ దెబ్బకు వెలాసిటీ విలవిల్లాడింది. సోఫీ 3.1 ఓవర్లలో నాలుగు వికెట్లు సాధించి వెలాసిటీ పతనాన్ని శాసించింది. కేవలం 9 పరుగులకే ఇచ్చి 2.80 ఎకానమీతో అదరగొట్టింది. వెలాసిటీ జట్టులో ముగ్గురు మాత్రమే డబుల్ డిజిట్ స్కోరు చేశారు.అందులో ఫఫాలీ వర్మ(13) చేసిన పరుగులే అత్యధికం కావడం గమనార్హం. వ్యాట్(3), మిథాలీ(1), వేదా(0),సుష్మా వర్మ(1)లు తీవ్రంగా నిరాశపరిచారు. సోఫీకి జతగా గోస్వామి, రాజేశ్వరి గైక్వాడ్‌లు బౌలింగ్‌లో రాణించారు. జులన్ గోస్వామి, రాజేశ్వరిలు తలో రెండు వికెట్లు తీశారు. వెలాసిటీ నిర్ధేశించిన 48 పరుగుల టార్గెట్‌ను ట్రయల్‌బ్లేజర్స్ 7.5 ఓవర్లలోనే వికెట్ కోల్పోయి ఛేదించింది. మంధనా(6) వికెట్‌ను ఆదిలో కోల్పోయినా దీంద్రా డాటిన్( 29 నాటౌట్), రిచా గోష్(13 నాటౌట్)లు టార్గెట్‌ను ఛేదించారు. కాగా, వెలాసిటీ నిన్న అద్భుతమైన విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. సూపర్ నోవాస్ జరిగిన మ్యాచ్‌లో వెలాసిటీ విజయం సాధించగా, దాన్ని ఈరోజు కొనసాగించలేకపోయింది. -
వెలాసిటీ బోణీ
షార్జా: మహిళల టి20 చాలెంజ్ టోర్నీలో హైదరాబాద్ క్రికెటర్ మిథాలీ రాజ్ నాయకత్వంలోని వెలాసిటీ జట్టు శుభారంభం చేసింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో వెలాసిటీ ఐదు వికెట్ల తేడాతో హర్మన్‌ప్రీత్ సారథ్యంలోని సూపర్ నోవాస్ జట్టుపై గెలిచింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన సూపర్ నోవాస్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది. ఓపెనర్ చమరి ఆటపట్టు (39 బంతుల్లో 44; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించింది. ఏక్తాబిష్త్ 3 వికెట్లు తీసింది. తర్వాత వెలాసిటీ 19.5 ఓవర్లలో 5 వికెట్లకు 129 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ సునె లూస్ (21 బంతుల్లో 37 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్), సుష్మ వర్మ (33 బంతుల్లో 34; 2 సిక్స్‌లు) ధాటిగా ఆడారు. రాణించిన చమరి... ఓపెనర్ ప్రియా (11), జెమీమా రోడ్రిగ్స్ (7) విఫలమైనా... మరో ఓపెనర్ చమరి ఆటపట్టు కుదరుగా ఆడింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను నడిపించింది. మనాలీ, కాస్పెరెక్ ఓవర్లలో సిక్సర్లు బాదిన చమరి దూకుడుకు జహనార చెక్ పెట్టింది. కాసేపటికే హర్మన్ (27 బంతుల్లో 31; 1 ఫోర్, 2 సిక్స్‌లు)ను జహనార పెవిలియన్ చేర్చగా... తర్వాత బ్యాటింగ్‌కు దిగిన వారిలో సిరివర్దెనె (18) మినహా అంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. 20వ ఓవర్ వేసిన ఏక్తా బిష్త్ ఆఖరి రెండు బంతుల్లో రాధా యాదవ్ (2), షకీరా (5)లను అవుట్ చేసింది. జహనార, కాస్పెరెక్ చెరో 2 వికెట్లు తీశారు. ఆఖర్లో ఉత్కంఠ... బంతికో పరుగు చొప్పున చేయాల్సిన లక్ష్యం. కానీ ఖాతా తెరువకుండానే ఓపెనర్ వ్యాట్ (0)ను, లక్ష్యఛేదనలో సగం పరుగులు చేయగానే షఫాలీ (11 బంతుల్లో 17), కెప్టెన్ మిథాలీ (7), వేద కృష్ణమూర్తి (28 బంతుల్లో 29; 4 ఫోర్లు) వికెట్లను కోల్పోయింది. 13 ఓవర్లలో వెలాసిటీ స్కోరు 65/4. ఇంకా 42 బంతుల్లో 61 పరుగులు చేయాల్సిన సమీకరణం. చివరి 5 ఓవర్లలో అయితే ఓవర్‌కు 10 చొప్పున 50 పరుగులు చేయాలి. లక్ష్యానికి దాదాపు దూరమైన తరుణంలో సుష్మ, సునె లూస్ భారీ షాట్లతో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశారు. పూనమ్ 16వ ఓవర్లో ఇద్దరు చెరో సిక్సర్ బాదడంతో 14 పరుగులు, సిరివర్దెనె 17వ ఓవర్లో 11 పరుగులు రావడంతో లక్ష్యం సులువైంది. సుష్మ అవుటైనా... ఆఖరి 6 బంతుల్లో 9 పరుగులు చేయాల్సి ఉండగా... లూస్, శిఖాపాండే చెరో బౌండరీతో గెలిపించారు. నేడు జరిగే మ్యాచ్‌లో వెలాసిటీతో ట్రయల్ బ్లేజర్స్ తలపడుతుంది. మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకు మొదలయ్యే ఈ మ్యాచ్‌ను స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. -
క్వార్టర్స్‌లో భువన
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టోర్నమెంట్లో ఆంధప్రదేశ్ అమ్మాయి కాల్వ భువన క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. న్యూఢిల్లీలో జరుగుతున్న ఈ టోర్నీలో బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో భువన 6-4, 6-4తో ఆంధ్రప్రదేశ్‌కే చెందిన నిధి చిలుములపై విజయం సాధించింది. మరో మ్యాచ్‌లో తెలుగు అమ్మాయి రిషిక సుంకర 6-0, 2-6, 7-6 (7/2)తో పెద్దిరెడ్డి శ్రీ వైష్ణవి (ఆంధ్రప్రదేశ్)పై గెలిచింది. ఆంధ్రప్రదేశ్‌కే చెందిన ఇతర క్రీడాకారిణులు అనుష్క భార్గవ, మహిత దాడిరెడ్డి, సౌజన్య భవిశెట్టి తొలి రౌండ్లో ఓటమి పాలయ్యారు. ఎతీ మెహతా (భారత్) 6-3, 6-0తో అనుష్కపై, ప్రార్థన తోంబ్రే (భారత్) 2-6, 6-2, 7-6 (7/4)తో సౌజన్యపై, శ్వేతా రాణా (భారత్) 7-6 (7/4), 7-5తో మహిత రెడ్డిపై నెగ్గారు.