womens voters
-
మహిళా ఓటర్ల పెరుగుదలలో ఏపీ టాప్
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా మహిళా ఓటర్ల పెరుగుదలలో ఆంధ్రప్రదేశ్ మొదటిస్థానంలో నిలిచింది. 2014 పార్లమెంటు ఎన్నికలతో పోలిస్తే 2019 నాటికి రాష్ట్రంలో మహిళా ఓటర్లు భారీగా పెరిగినట్లు కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన తాజా నివేదిక వెల్లడించింది. 2014లో ప్రతీ వెయ్యిమంది పురుష ఓటర్లకు రాష్ట్రంలో 987 మంది మహిళా ఓటర్లు ఉండగా 2019 ఎన్నికల నాటికి ఇది 31 పాయింట్ల వృద్ధితో 1,018కి చేరింది. అంటే ఇప్పుడు ప్రతీ 1,000 మంది పురుష ఓటర్లకు 1,018 మంది మహిళా ఓటర్లున్నారు. దేశీయ సగటుతో పోలిస్తే రాష్ట్రంలో 92 మంది మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. అలాగే, 2014లో దేశవ్యాప్తంగా మహిళా ఓటర్ల నిష్పత్తి ప్రతీ వెయ్యిమంది పురుషులకు 908గా ఉండగా అది 2019 నాటికి 18 పాయింట్లు పెరిగి 926కి చేరింది. దేశవ్యాప్తంగా మహిళా ఓటర్ల సంఖ్య 43,85,37,911గా ఉంది. 2019 ఎన్నికల సరళిని విశ్లేషిస్తూ తాజాగా అట్లాస్ పేరుతో ఎన్నికల సంఘం విడుదల చేసిన నివేదిక ఈ విషయాన్ని స్పష్టంచేస్తోంది. రాష్ట్రంలో మొత్తం 3,94,05,967 మంది ఓటర్లు ఉండగా అందులో 50.45 శాతం వాటాతో 1,98,80,957 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ తర్వాత మహిళా ఓటర్లు అధికంగా పెరిగిన రాష్ట్రాల్లో ఒడిశా (29 పాయింట్లు), పశ్చిమబెంగాల్ (25), తమిళనాడు (22), ఉత్తరప్రదేశ్ (21) ఉన్నాయి. నాలుగు రాష్ట్రాల్లోనే మహిళా శక్తి అధికం ఇకపోతే దేశవ్యాప్తంగా కేవలం నాలుగు రాష్ట్రాల్లో మాత్రమే మహిళలు ఓటింగ్‌లో కీలకపాత్ర పోషిస్తున్నారు. మొత్తం ఓటర్లలో సగానికిపైగా మహిళా ఓట్లు కలిగిన రాష్ట్రాలు కేవలం నాలుగే ఉన్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ఆ నివేదికలో పేర్కొంది. ఇందులో అత్యధికంగా 51.4 శాతం మహిళా ఓట్లతో కేరళ మొదటి స్థానంలో ఉండగా, 51.06 శాతంతో గోవా, 50.45 శాతంతో ఆంధ్రప్రదేశ్, 50.25 శాతంతో అరుణాచల్‌ప్రదేశ్ ఉన్నాయి. -
మహిళలు మా సైలెంట్ ఓటర్లు
న్యూఢిల్లీ: 21వ శతాబ్ది రాజకీయాల ఏకైక ప్రాతిపదిక అభివృద్ధేనని తాజా బిహార్ ఎన్నికల ఫలితాలు, ఇతర రాష్ట్రాల్లోని ఉప ఎన్నికల ఫలితాలు నిరూపించాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. బీజేపీ విజయాల వెనుక సైలెంట్ ఓటర్లుగా ఉన్న మహిళల పాత్ర మరవలేనిదన్నారు. ఎన్నికల్లో విజయం అనంతరం ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి బుధవారం మోదీ ప్రసంగించారు. బిహార్‌లో ఎన్డీయే విజయానికి తమ ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్’ నినాదమే కారణమని మోదీ పేర్కొన్నారు. ప్రజాస్వామ్యయుతంగా బీజేపీని ఎదుర్కోలేక తమ పార్టీ కార్యకర్తలను హతమార్చే కుతంత్రాలకు కొందరు దిగుతున్నారని పశ్చిమబెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమత బెనర్జీపై పరోక్ష ఆరోపణలు గుప్పించారు. ‘బీజేపీ కార్యకర్తలను హతమార్చి తమ లక్ష్యాలను సాధించగలమని కొందరు అనుకుంటూ ఉంటారు. వారికి ప్రజలే బుద్ధి చెప్తారు. ఎన్నికలు వస్తుంటాయి. పోతుంటాయి. గెలుపు, ఓటములు సహజం. కానీ ప్రజాస్వామ్యంలో హత్యా రాజకీయాలు మంచివి కాదు. ఈ హత్యా క్రీడ ఓట్లు రాల్చదు’ అని వ్యాఖ్యానించారు. 2021లో పశ్చిమబెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ రాష్ట్రంలో అధికారంలో రావడాన్ని బీజేపీ తదుపరి లక్ష్యంగా పెట్టుకుంది. నితీశ్ కుమార్ ముఖ్యమంత్రిత్వంలో బిహార్ అభివృద్ధికి బీజేపీ అన్ని విధాలా సహకరిస్తుందని మోదీ పేర్కొన్నారు. కశ్మీర్‌నుంచి కన్యాకుమారి వరకు దేశవ్యాప్తంగా కుటుంబ పార్టీలు విస్తరించాయని, దేశ ప్రజాస్వామ్యానికి అవి అతిపెద్ద ముప్పు అని ప్రధాని తెలిపారు. ఓ జాతీయ పార్టీ ఒక కుటుంబం గుప్పిట్లో చిక్కుకుపోయిందని కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. దేశ సేవ చేయాలనుకునే యువత బీజేపీలో చేరాలని ప్రధాని కోరారు. మహిళలు, దళితులు, పేదలు, ఇతర అణగారిన వర్గాల ప్రాతినిధ్యం ఉన్న ఏకైక జాతీయ పార్టీ బీజేపీయేనని వివరించారు. ‘రెండు గదులు, రెండు సీట్ల’ స్థాయి నుంచి దేశ రాజకీయాలను శాసించే స్థాయికి బీజేపీ ఎదిగిందని మోదీ గుర్తు చేశారు. దేశాభివృద్ధి కోసం నిజాయితీగా పనిచేసే వారికే ప్రజలు పట్టం కడతారని దీనితో స్పష్టమవుతోందన్నారు. ఈ విషయాన్ని అర్థం చేసుకోలేని వారు ఎన్నికల్లో డిపాజిట్లు కోల్పోతారని వ్యాఖ్యానించారు. కరోనా మహమ్మారిపై పోరాడే విషయంలో బీజేపీ సుపరిపాలనను ప్రజలు గమనించారన్నారు. బిహార్‌లో గెలుపును ప్రస్తావిస్తూ.. అధికారంలో ఉండి కూడా వరుసగా మూడుసార్లు సీట్ల సంఖ్యను పెంచుకున్న ఏకైక పార్టీ బీజేపీయేనని వ్యాఖ్యానించారు. మధ్యప్రదేశ్, గుజరాత్‌ల్లో కూడా అధికారంలో ఉండి, మంచి విజయాలు సాధించామన్నారు. బిహార్‌లో బీజేపీ, జేడీయూ కూటమికి మహిళలు పెద్ద సంఖ్యలో ఓటేశారన్న విశ్లేషకుల వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. బీజేపీ విజయంలో మహిళల పాత్ర గణనీయంగా ఉందన్నారు. బిహార్‌లో ఎన్డీయే విజయం ప్రధాని మోదీ ఘనతేనని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా పేర్కొన్నారు. బిహార్ ప్రజలకు సెల్యూట్: నితీశ్ పట్నా: అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయేకు విజయం అందించిన బిహార్ ప్రజలకు ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ‘సెల్యూట్’ చేశారు. ఈ విజయానికి సహకరించిన ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ‘ఎన్డీయేకు మెజారిటీ అందించిన ప్రజలకు నా సెల్యూట్. ప్రధాని మోదీకి కృతజ్ఞతలు’ అని నితీశ్ బుధవారం ట్వీట్ చేశారు. హాజరైన పార్టీ శ్రేణులు -
అతివలే నిర్ణేతలు
అక్కడ పార్టీల గెలుపు, ఓటములను నిర్ణయించేది అతివలే. వారి చేతుల్లోనే అభ్యర్థులు భవితవ్యం ఆధారపడి ఉంది. హుస్నాబాద్ నియోజకవర్గంలో పురుషుల కంటే మహిళా ఓటర్లదే ఆధిక్యం. నియోజకవర్గంలో మొత్తం 2,18,361 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 1,08,827, మహిళలు 1,09,525 మంది ఉన్నారు. ‘స్వశక్తి’ మహిళలే 70వేల మందివరకు ఉండడం విశేషం. అందుకే ఇప్పుడక్కడ అన్ని పార్టీల దృష్టి వారిపైనే. తమవైపు తిప్పుకొనేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. వారిని ప్రసన్నం చేసుకునేందుకు ఆయా పార్టీల అభ్యర్థులు ఎవరి శైలిలో వారు ప్రచారం సాగిస్తున్నారు. హుస్నాబాద్‌రూరల్: హుస్నాబాద్ నియోజకవర్గం మెట్ట ప్రాంతం కావడంతో ఎప్పుడు కరువు కాటకాలతో రైతు కూలీలు కరువు కష్టాలను ఎదుర్కొని పుట్టిన ఊరులో పనులు లేక పొట్ట కూటి కోసం వలస వెళ్లేవారు. కరువు ప్రాంతంలో దొరలు, భూస్వాముల వ్యవస్థలతో అణగారిన పేద ప్రజలు పేదిరకంలో కూరుకుపోయారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేక ఉద్యమాలకు జీవం పోసిన నేల, 13 మంది అమర వీరులను ఒడిలో చేర్చుకున్న మహ్మదాపూర్ వీర భూమి, సర్వాయి పాపన్న ఉద్యమానికి స్థావరమైన కోటగిరి గట్లకు పురుడుపోసిన ఉద్యమాల ఖిల్లా, పీపుల్స్‌వార్ (నక్సలైట్) ఉద్యమాలకు ప్రాణం పోసి పోరు బిడ్డలను అందించిన పోరు గడ్డ కరువు నేల. పోరాట పటిమతోనే మెట్ట ప్రాంతం రైతాంగం తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలకు ఊపిరి పోసింది. హుస్నాబాద్ కరువు నేల నీళ్లు తాగిన ప్రతి ఒక్కరికీ నిలబడి పోరు చేసే శక్తి అందించిన వీర వనితలకే ప్రజాస్వామ్య వ్యవస్థలో నాయకులను ఎన్నుకొనే అవకాశం వచ్చింది. హుస్నాబాద్ నియోజకవర్గంలో 2,18,361 ఓటర్లకు పురుషులు 1,08,827, మహిళలు 1,09,525 ఉన్నారు. ఇందులో మహిళా ఓటర్లు అధికంగా ఉండగా అందులో స్వశక్తి మహిళలు 70వేల మంది ఉండటం విశేషం. ఇందుర్తిలో ప్రతిపక్షం.. హుస్నాబాద్‌లో అధికార పక్షం.. హుస్నాబాద్ నియోజకవర్గంలో 14సార్లు ఎన్నికలు జరిగితే నాలుగు సార్లు మినహా ఎప్పుడు ప్రతిపక్ష అభ్యర్థులే గెలుపొందారు. ప్రతిపక్ష అభ్యర్థులు గెలుపొందడం వల్ల హుస్నాబాద్ ప్రాంతము అభివృద్ధిలో వెనుకబడి పోయింది. హుస్నాబాద్ నియోజకవర్గం ఏర్పడిన తర్వాత అధికార పార్టీ అభ్యుర్థులు గెలుపొందడం వారు అభివృద్ధికి ఎక్కువ నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేయడం జరుగుతుంది. 1952లో నుస్తులాపూర్ నియోజకవర్గంలో పీడీఎఫ్ అభ్యర్థి సింగిరెడ్డి వెంకట్‌రెడ్డి గెలుపొందారు. 1957లో ఇందుర్తిగా మారిన తర్వాత చామన్‌పల్లి చొక్కారావు పీడీఎఫ్ గెలుపొంగా కాంగ్రెస్ అధికారంలో ఉంది. 1962, 1967లో కాంగ్రెస్ అభ్యర్థి బీ.లక్ష్మీకాంతారావు గెలుపొందగా అప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది. 1972లో బద్దం ఎల్లారెడ్డి సీపీఐ నుంచి విజయం సాధించగా అధికారంలో కాంగ్రెస్ ఉంది. 1979లో సీపీఐ దేశిని మల్లయ్య విజయం సాధించారు. 1983లో బీ.లక్ష్మీకాంతారావు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపొందగా అప్పుడు అధికారంలో టీడీపీ ఉంది. 1985, 1989, 1994లో సీపీఐ నుంచి చినమల్లయ్య హాట్రిక్ సాధించిన అధికారంలో కాంగ్రెస్, టీడీపీలు ఉన్నాయి. 1999లో కాంగ్రెస్ పార్టీ నుంచి బొమ్మ వెంకటేశ్వర్లు గెలుపొందిన టీడీపీ అధికారంలో ఉంది. 2004లో సీపీఐ నుంచి చాడ వెంకటరెడ్డి విజయం సాధించిన అధికారంలో కాంగ్రెస్ ఉంది. 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో హుస్నాబాద్, చిగురుమామిడి, కోహెడ, సైదాపూర్, భీమదేవరపల్లి, ఎల్కతుర్తి ఆరు మండలాలతో హుస్నాబాద్ నియోజకవర్గం ఏర్పడింది. ఇక్కడి నుంచి అధికార పార్టీ అభ్యర్థులు గెలువడం ఆనవాయితీగా వస్తుంది. ఈసారి అవకాశం ఎవరికి నియోజకవర్గం ఏర్పడిన తర్వాత రెండు సార్లు రాజకీయలకు కొత్తగా వచ్చిన అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి, వొడితల సతీష్కుమార్లకు అవకాశం ఇచ్చిన ఓటర్లు.. రెండోసారి వీరితో పాటుగా చాడా వెంకటరెడ్డి పోటీలో ఉండటంతో వీరందరిలో ఎవరికి అవకాశం ఇస్తారో వేచి చూడాలి. అలాగే అన్ని పార్టిలు సంఘాలను ఆకట్టుకునే పనిలో ఉన్నారు. కొత్తవారిని ఆశీర్వదించిన స్వశక్తి మహిళలు.. నియోజకవర్గాల పునర్విభజనలో హుస్నాబాద్‌గా ఏర్పడిన నియోజకవర్గంలో రాజకీయ ప్రవేశం చేసిన కొత్తవారికి ఇక్కడి ఓటర్లు అవకాశం ఇస్తున్నారు. హుస్నాబాద్‌లో గెలిచిన పార్టీనే అధికారంలోకి రావడంతో హుస్నాబాద్ నుంచే కేసీఆర్ ఎన్నికల సభను ప్రారంభించడం నాయకుల్లో చర్చనీయాంశంగా మారింది. 2009 తొలిసారి కాంగ్రెస్ పార్టీ నుంచి అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి టికెట్ తెచ్చుకోని టీఆర్ఎస్పై విజయం సాధించగాఅధికారంలోకి కాంగ్రెస్ వచ్చింది. 2014లో టీఆర్ఎస్ అభ్యర్థి సతీష్‌కుమార్ తొలిసారి పోటీ చేసి గెలుపొందగా అధికారంలోకి టీఆర్ఎస్ పార్టీ వచ్చింది. హుస్నాబాద్ నియోజకవర్గం ఏర్పడిన తర్వాత కొత్త నాయకులను విజేతలుగా నిలుపుటకు స్వశక్తి సంఘాల మహిళల ఓట్లు కీలకంగా మారుతున్నాయి. స్వశక్తి సంఘాల సభ్యుల ఓట్లను పొందినవారే విజేతలుగా నిలవడంతో ఇప్పుడు కూడా స్వశక్తి మహిళల 70వేల ఓట్లు గెలుపును నిర్ణయించనున్నాయి. దీంతో నాయకులు సైతం మహిళా సంఘాల ఓట్లను రాబట్టుకొనేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. పార్టీ ఇచ్చే మేనిఫెస్టోల అంశాల ఆకర్షణతో పాటు నాయకుడి గుణగణాలను మహిళా సంఘాల సభ్యులు పరిశీలించి నిర్ణయం తీసుకుంటున్నారు. -
ఆమె కీలకం
సాక్షి, అనంతపురం : మహిళలు మహారాణులయ్యారు. ఇన్నాళ్లూ వంటింటికే పరిమితమైన వారు ఇప్పుడు అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారు. రాజకీయాల్లో సత్తాచాటుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇప్పటికే స్థానిక సంస్థలు, పంచాయతీల్లో సగభాగం దక్కించుకున్నారు. ఇదే సమయంలో భ్రూణహత్యలు.. ఈవ్‌టీజింగ్, యాసిడ్ దాడులు, నిర్భయ ఘటనలు సభ్య సమాజాన్ని ఆందోళన కలిగిస్తున్నా.. అలాంటి ఘటనలు చోటుచేసుకున్నప్పుడు మహిళా లోకం స్పందిస్తున్న తీరు పాలకులకు ముచ్చెమటలు పట్టిస్తోంది. ‘అనంత’లో మహిళలు 20,91,049 జిల్లాలో జనాభా 42,30,314 ఉండగా ఇందులో మహిళలు 20,91,049 మంది ఉన్నారు. మొత్తం 28,85,790 మంది ఓటర్లు ఉండగా మహిళా ఓటర్లు 14,25,989 మంది ఉన్నారు. జిల్లాలోని రాయదుర్గం నియోజకవర్గంలో పురుష ఓటర్ల కన్నా మహిళా ఓటర్లే ఎక్కువగా ఉండడం గమనార్హం. ప్రస్తుత ఎన్నికల్లో మహిళా ఓటర్లే నేతల తలరాతలు మార్చనున్నారు. ఇక్కడ 1,09,628 మంది పురుష ఓటర్లు ఉండగా 1,10,301 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. కదిరి నియోజకవర్గంలో పురుష ఓటర్లు 1,08,731 మంది ఉండగా వారితో సమానంగా మహిళా ఓటర్లు 1,08,605 మంది ఉన్నారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 1003 పంచాయతీలకు గానూ 501 పంచాయతీలు మహిళలకు కేటాయించగా, జనరల్ స్థానాల్లోనూ మహిళలు పోటీకి దిగి విజయం సాధించి గ్రామాధికారాన్ని చేజిక్కించుకున్నారు. రాజకీయాల్లో మహిళలకు ప్రాధాన్యత పెరగడంతో నిరక్ష్యరాస్యులైన మహిళలు సైతం రాజకీయ అరంగేట్రం చేస్తూ ఔరా అనిపిస్తున్నారు. ఒక వైపు ఉపాధి కూలీ పనులు, మరో వైపు ఇంటి పనులు చేస్తూ.. పురుషులతో సమానంగా రాజకీ య, ఇతర రంగాల్లో రాణిస్తున్నారు. మిగతా నియోజకవర్గాల్లో సైతం మహిళా ఓటర్ల సంఖ్య ప్రస్తుతం గణనీయంగా పెరిగింది. స్థానిక సంస్థల్లోనూ ఆమే కీలకం ప్రస్తుతం జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళ పాత్ర కీలకం కానుంది. స్థానిక కోటాలో మహిళలకు సగభాగం కేటాయించడంతో మహిళలు రాజ్యాధికారం చేజిక్కుంచుకోనున్నారు. జిల్లాలో 11 మునిసిపాలిటీలు, ఒక కార్పోరేషన్ ఉండగా, ఇందులో సగభాగం అంటే ఆరు మునిసిపల్ చైర్మన్ కుర్చీలు మహిళలకు రిజర్వ్ అయ్యాయి. దీంతో ప్రధాన పార్టీల నాయకులందరూ తమ పార్టీల నుంచి మహిళలను ఎన్నికల రణరంగంలోకి దింపడానికి ఉవ్విళ్లూరుతున్నారు. ప్రతిరోజూ వారి ఇళ్ల వద్దకు వెళ్తూ.. మేము టికెట్టు ఇస్తామంటే.. మేము టికెట్టు ఇస్తామంటూ పోటీపడుతున్నారు. రెండు రోజుల క్రితం ప్రకటించిన జిల్లా పరిషత్, మండల పరిషత్ స్థానాల్లో సైతం మహిళలకు సగం స్థానాలు దక్కాయి. జిల్లాలో మొత్తం 63 జెడ్పీటీసీ స్థానాలు ఉండగా 32 స్థానాలను మహిళలకు కేటాయించారు. ఇక 849 ఎంపీటీసీ స్థానాలకు గానూ 442 స్థానాలను మహిళలకే కేటాయించారు. అంటే సగానికి పైగానే మహిళలకు సీట్లు దక్కాయి. ఇక జనరల్ స్థానాల్లో సైతం పలుచోట్ల మహిళలనే రంగంలోకి దింపే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీంతో జిల్లాలో ప్రస్తుతం రాజకీయాలు మొత్తం మహిళల చుట్టూనే తిరుగుతున్నాయి. జిల్లా రాజకీయాల్లో చరిత్ర సృష్టించిన మహిళలు అనంతపురం జిల్లాలో ఎందరో మహిళలు రాజకీయాల్లో తమ సత్తా చాటుకున్నారు. 2004లో జరిగిన సాధారణ ఎన్నికల్లో గుత్తి నియోజకవర్గం నుంచి గాది నీలావతి.. తనకు విద్యనేర్పిన గురువు కేసీ నారాయణపైనే పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తరువాత జరిగిన జిల్లా పరిషత్ ఎన్నికల్లో అనంతపురం జిల్లా పరిషత్ మొట్టమొదటి చైర్‌పర్సన్‌గా తోపుదుర్తి కవిత ఎన్నికై రికార్డు సృష్టించారు. కదిరి మునిసిపల్ చైర్పర్సన్లుగా వరుసగా ఇద్దరు మహిళలు షహనాజ్ షాకీర్, వేమల ఫర్హానా బేగంలు ఎన్నికయ్యారు. శమంతకమణి శింగనమల ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా కూడా పనిచేశారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. శ్రీకృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయానికి వైస్ చాన్స్లర్లుగా సరస్వతీరావు, కుసుమకుమారి పని చేశారు.