సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా మహిళా ఓటర్ల పెరుగుదలలో ఆంధ్రప్రదేశ్ మొదటిస్థానంలో నిలిచింది. 2014 పార్లమెంటు ఎన్నికలతో పోలిస్తే 2019 నాటికి రాష్ట్రంలో మహిళా ఓటర్లు భారీగా పెరిగినట్లు కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన తాజా నివేదిక వెల్లడించింది. 2014లో ప్రతీ వెయ్యిమంది పురుష ఓటర్లకు రాష్ట్రంలో 987 మంది మహిళా ఓటర్లు ఉండగా 2019 ఎన్నికల నాటికి ఇది 31 పాయింట్ల వృద్ధితో 1,018కి చేరింది. అంటే ఇప్పుడు ప్రతీ 1,000 మంది పురుష ఓటర్లకు 1,018 మంది మహిళా ఓటర్లున్నారు.
దేశీయ సగటుతో పోలిస్తే రాష్ట్రంలో 92 మంది మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. అలాగే, 2014లో దేశవ్యాప్తంగా మహిళా ఓటర్ల నిష్పత్తి ప్రతీ వెయ్యిమంది పురుషులకు 908గా ఉండగా అది 2019 నాటికి 18 పాయింట్లు పెరిగి 926కి చేరింది. దేశవ్యాప్తంగా మహిళా ఓటర్ల సంఖ్య 43,85,37,911గా ఉంది. 2019 ఎన్నికల సరళిని విశ్లేషిస్తూ తాజాగా అట్లాస్ పేరుతో ఎన్నికల సంఘం విడుదల చేసిన నివేదిక ఈ విషయాన్ని స్పష్టంచేస్తోంది. రాష్ట్రంలో మొత్తం 3,94,05,967 మంది ఓటర్లు ఉండగా అందులో 50.45 శాతం వాటాతో 1,98,80,957 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ తర్వాత మహిళా ఓటర్లు అధికంగా పెరిగిన రాష్ట్రాల్లో ఒడిశా (29 పాయింట్లు), పశ్చిమబెంగాల్ (25), తమిళనాడు (22), ఉత్తరప్రదేశ్ (21) ఉన్నాయి.
నాలుగు రాష్ట్రాల్లోనే మహిళా శక్తి అధికం
ఇకపోతే దేశవ్యాప్తంగా కేవలం నాలుగు రాష్ట్రాల్లో మాత్రమే మహిళలు ఓటింగ్‌లో కీలకపాత్ర పోషిస్తున్నారు. మొత్తం ఓటర్లలో సగానికిపైగా మహిళా ఓట్లు కలిగిన రాష్ట్రాలు కేవలం నాలుగే ఉన్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ఆ నివేదికలో పేర్కొంది. ఇందులో అత్యధికంగా 51.4 శాతం మహిళా ఓట్లతో కేరళ మొదటి స్థానంలో ఉండగా, 51.06 శాతంతో గోవా, 50.45 శాతంతో ఆంధ్రప్రదేశ్, 50.25 శాతంతో అరుణాచల్‌ప్రదేశ్ ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment