సాక్షి, అనంతపురం : మహిళలు మహారాణులయ్యారు. ఇన్నాళ్లూ వంటింటికే పరిమితమైన వారు ఇప్పుడు అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారు. రాజకీయాల్లో సత్తాచాటుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇప్పటికే స్థానిక సంస్థలు, పంచాయతీల్లో సగభాగం దక్కించుకున్నారు. ఇదే సమయంలో భ్రూణహత్యలు.. ఈవ్‌టీజింగ్, యాసిడ్ దాడులు, నిర్భయ ఘటనలు సభ్య సమాజాన్ని ఆందోళన కలిగిస్తున్నా.. అలాంటి ఘటనలు చోటుచేసుకున్నప్పుడు మహిళా లోకం స్పందిస్తున్న తీరు పాలకులకు ముచ్చెమటలు పట్టిస్తోంది.
‘అనంత’లో మహిళలు 20,91,049
జిల్లాలో జనాభా 42,30,314 ఉండగా ఇందులో మహిళలు 20,91,049 మంది ఉన్నారు. మొత్తం 28,85,790 మంది ఓటర్లు ఉండగా మహిళా ఓటర్లు 14,25,989 మంది ఉన్నారు. జిల్లాలోని రాయదుర్గం నియోజకవర్గంలో పురుష ఓటర్ల కన్నా మహిళా ఓటర్లే ఎక్కువగా ఉండడం గమనార్హం.
ప్రస్తుత ఎన్నికల్లో మహిళా ఓటర్లే నేతల తలరాతలు మార్చనున్నారు. ఇక్కడ 1,09,628 మంది పురుష ఓటర్లు ఉండగా 1,10,301 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. కదిరి నియోజకవర్గంలో పురుష ఓటర్లు 1,08,731 మంది ఉండగా వారితో సమానంగా మహిళా ఓటర్లు 1,08,605 మంది ఉన్నారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 1003 పంచాయతీలకు గానూ 501 పంచాయతీలు మహిళలకు కేటాయించగా, జనరల్ స్థానాల్లోనూ మహిళలు పోటీకి దిగి విజయం సాధించి గ్రామాధికారాన్ని చేజిక్కించుకున్నారు. రాజకీయాల్లో మహిళలకు ప్రాధాన్యత పెరగడంతో నిరక్ష్యరాస్యులైన మహిళలు సైతం రాజకీయ అరంగేట్రం చేస్తూ ఔరా అనిపిస్తున్నారు. ఒక వైపు ఉపాధి కూలీ పనులు, మరో వైపు ఇంటి పనులు చేస్తూ.. పురుషులతో సమానంగా రాజకీ య, ఇతర రంగాల్లో రాణిస్తున్నారు. మిగతా నియోజకవర్గాల్లో సైతం మహిళా ఓటర్ల సంఖ్య ప్రస్తుతం గణనీయంగా పెరిగింది.
స్థానిక సంస్థల్లోనూ ఆమే కీలకం
ప్రస్తుతం జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళ పాత్ర కీలకం కానుంది. స్థానిక కోటాలో మహిళలకు సగభాగం కేటాయించడంతో మహిళలు రాజ్యాధికారం చేజిక్కుంచుకోనున్నారు. జిల్లాలో 11 మునిసిపాలిటీలు, ఒక కార్పోరేషన్ ఉండగా, ఇందులో సగభాగం అంటే ఆరు మునిసిపల్ చైర్మన్ కుర్చీలు మహిళలకు రిజర్వ్ అయ్యాయి. దీంతో ప్రధాన పార్టీల నాయకులందరూ తమ పార్టీల నుంచి మహిళలను ఎన్నికల రణరంగంలోకి దింపడానికి ఉవ్విళ్లూరుతున్నారు. ప్రతిరోజూ వారి ఇళ్ల వద్దకు వెళ్తూ.. మేము టికెట్టు ఇస్తామంటే.. మేము టికెట్టు ఇస్తామంటూ పోటీపడుతున్నారు. రెండు రోజుల క్రితం ప్రకటించిన జిల్లా పరిషత్, మండల పరిషత్ స్థానాల్లో సైతం మహిళలకు సగం స్థానాలు దక్కాయి. జిల్లాలో మొత్తం 63 జెడ్పీటీసీ స్థానాలు ఉండగా 32 స్థానాలను మహిళలకు కేటాయించారు.
ఇక 849 ఎంపీటీసీ స్థానాలకు గానూ 442 స్థానాలను మహిళలకే కేటాయించారు. అంటే సగానికి పైగానే మహిళలకు సీట్లు దక్కాయి. ఇక జనరల్ స్థానాల్లో సైతం పలుచోట్ల మహిళలనే రంగంలోకి దింపే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీంతో జిల్లాలో ప్రస్తుతం రాజకీయాలు మొత్తం మహిళల చుట్టూనే తిరుగుతున్నాయి.
జిల్లా రాజకీయాల్లో
చరిత్ర సృష్టించిన మహిళలు
అనంతపురం జిల్లాలో ఎందరో మహిళలు రాజకీయాల్లో తమ సత్తా చాటుకున్నారు. 2004లో జరిగిన సాధారణ ఎన్నికల్లో గుత్తి నియోజకవర్గం నుంచి గాది నీలావతి.. తనకు విద్యనేర్పిన గురువు కేసీ నారాయణపైనే పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తరువాత జరిగిన జిల్లా పరిషత్ ఎన్నికల్లో అనంతపురం జిల్లా పరిషత్ మొట్టమొదటి చైర్‌పర్సన్‌గా తోపుదుర్తి కవిత ఎన్నికై రికార్డు సృష్టించారు. కదిరి మునిసిపల్ చైర్‌పర్సన్లుగా వరుసగా ఇద్దరు మహిళలు షహనాజ్ షాకీర్, వేమల ఫర్హానా బేగంలు ఎన్నికయ్యారు. శమంతకమణి శింగనమల ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా కూడా పనిచేశారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. శ్రీకృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయానికి వైస్ చాన్స్‌లర్లుగా సరస్వతీరావు, కుసుమకుమారి పని చేశారు.
ఆమె కీలకం
Published Sat, Mar 8 2014 2:38 AM | Last Updated on Fri, Jun 1 2018 8:47 PM
Advertisement
Advertisement