మా లక్ష్యం సామాజిక అభివృద్ధి..
వారందరి నేపథ్యాలు వేరు.. ప్రాంతాలు కూడా వేరు.. కానీ.. వారి ప్రత్యేకత.. అందరూ మహిళలే.... వారి లక్ష్యం ఒకటే.. అది సామాజికాభివృద్ధికి దోహదపడాలనే కాంక్ష! ఆ ఆశయ సాధనకు మార్గం.. సివిల్ సర్వీసెస్.. సాధించాలనే తమ తపనకు.. తల్లిదండ్రులు, జీవిత భాగస్వాముల తోడ్పాటు అందింది! సివిల్స్ పరీక్షలో దీటుగా రాణించారు.. ర్యాంకుల్లో దూసుకెళ్లారు. మరికొద్ది రోజుల్లో కార్యక్షేత్రంలో అడుగుపెట్టనున్నారు. తాజా సివిల్స్-2015 ఫలితాల్లో ‘టాప్’లేపిన..
తెలుగు రాష్ట్రాలకు చెందిన మహిళా విజేతలపై ప్రత్యేక కథనం...
ఇష్టంగా చదివితే లక్ష్యం చేరుకోవచ్చు: 14వ ర్యాంకు
చేకూరు కీర్తి : ఒకవైపు స్నేహితులు క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో విజయానికి కృషి చేస్తుంటే.. నేను కనీసం అటువైపు కన్నెత్తి చూడలేదు. నా ఆలోచనంతా సివిల్స్‌పైనే ఉండేది.
ఐఐటీ మద్రాస్ నుంచి మెటీరియల్ అండ్ మెటలర్జికల్ సైన్స్‌లో 2012లో బీటెక్ పూర్తిచేశా. ఇంజనీరింగ్ నాలుగో సంవత్సరంలో ఉండగానే సివిల్స్ లక్ష్యంగా నిర్ణయించుకున్నాను. ఒకవైపు స్నేహితులు క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో విజయానికి కృషి చేస్తుంటే.. నేను కనీసం అటువైపు కన్నెత్తి చూడలేదు. నా ఆలోచనంతా సివిల్స్‌పైనే ఉండేది. ఆంత్రోపాలజీ ఆప్షనల్‌గా 2013లోతొలి ప్రయత్నంలో 440వ ర్యాంకుతో ఐఆర్ఎస్కు ఎంపికయ్యాను. 2014 లో రెండో ప్రయత్నంలోనూ ఆశించిన ర్యాంకు రాలేదు.
దాంతో ఇక ఎట్టి పరిస్థితుల్లో ఐఏఎస్ సాధించాలనే పట్టుదలతో 2015కు హాజరయ్యాను. సివిల్స్-2015 ఫలితాలు విడుదలయ్యే సమయానికి ఐఆర్ఎస్ శిక్షణ పూర్తిచేసి, కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్‌గా విధుల్లో ఉన్నా. ఐఆర్ఎస్ ట్రైనింగ్ కూడా పూర్తిచేసుకుని మళ్లీ సివిల్స్ రాయడానికి కారణం.. ఐఏఎస్‌కు నేరుగా ప్రజలతో మమేకం అయ్యే అవకాశం ఉండటమే! నా విజయంలో అమ్మ పద్మ ప్రేరణ, నాన్న నాగేంద్ర తోడ్పాటు మరువలేనిది. సివిల్స్‌లో విజయం సాధించడం కష్టమే అయినా.. ఇష్టంగా చదివితే లక్ష్యం చేరుకోవచ్చు.
పట్టుదల ఉంటే ఫలితం గ్యారెంటీ..! : 65వ ర్యాంకు
వల్లూరు క్రాంతి : ఇష్టపడి చదివితే సివిల్స్‌లో విజయం సాధ్యమే. తొలి ప్రయత్నంలో రాకపోయినా నిరుత్సాహానికి గురి కాకుండా పట్టుదలతో ప్రయత్నించాలి.
మాది కర్నూలు. అమ్మానాన్న లక్ష్మి, వెంకట రంగారెడ్డి ఇద్దరూ వైద్యులే. ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దాలనే వారి ఆకాంక్షే నా విజయానికి కారణం. అమ్మానాన్న ఆకాంక్షలకు అనుగుణంగా చిన్నప్పటి నుంచీ చదువులో ఫస్టే. ఐఐటీ-ఢిల్లీలో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తిచేశా. బీటెక్ పూర్తిచేసిన తర్వాతే సివిల్స్‌పై దృష్టిసారించా. మ్యాథమెటిక్స్ ఆప్షనల్ అరుదే అయినా.. మ్యాథ్స్పట్ల ఇష్టంతోనే ఆ సబ్జెక్టును ఎంపిక చేసుకన్నా.
తొలి ప్రయత్నంలో 2013లో 562వ ర్యాంకుతో ఐఆర్‌టీఎస్‌కు.. 2014లో 230వ ర్యాంకుతో ఐఆర్ఎస్కు ఎంపికయ్యా. అయితే, నా లక్ష్యం ఐఏఎస్ కావడంతో పట్టుదలగా 2015 సివిల్స్‌కు హాజరై 65వ ర్యాంకు సాధించా. నా విజయ ప్రస్థానంలో.. అమ్మానాన్న అందించిన సహకారం మరవలేనిది. నేను ఏం చదువుతానంటే అది చదివించారు. అందుకే ఇంట్లో అందరూ డాక్టర్లయినా.. నేను మాత్రం ఇంజనీరింగ్‌పై ఆసక్తితో ఐఐటీలో చేరా.
బీటెక్ అర్హతతో ఆఫర్లు వచ్చినా కాదనుకొని సివిల్స్ లక్ష్యంగా చదివా. ఆ కల సాకారమవడం చాలా ఆనందంగా ఉంది. పట్టుదలతో చదివితే సివిల్స్‌లో విజయం సాధ్యమే. కాకపోతే తొలి ప్రయత్నంలో రాకపోయినా నిరుత్సాహానికి గురికాకుండా ఓర్పుగా మళ్లీ మళ్లీ ప్రయత్నించాలి. కార్యక్షేత్రంలో అడుగుపెట్టాక మహిళా సాధికారతకు తోడ్పడతా. మహిళలకు అందుబాటులో ఉన్న పథకాల సమర్థ అమలుకు కృషి చేస్తా.
సమాజం కోసం సివిల్స్ గమ్యం.. : 82వ ర్యాంకు
పాపమ్మగారి ప్రావీణ్య : విజయానికి ప్రతి అంశాన్ని శాస్త్రీయ దృక్పథంతో చదవడం అలవర్చుకోవాలి.
మాది అనంతపురం జిల్లా, పుట్టపర్తి మండలం ఎనుములపల్లి. నా విజయంలో అమ్మానాన్న ఓబుల్ రెడ్డి, మాలతిల ప్రోత్సాహం ఎంతో ఉంది. అమ్మానాన్న ఇద్దరూ విద్యావంతులు కావడం, ఉన్నత హోదాల్లో ఉండటం (తండ్రి హెచ్ఏఎల్ చీఫ్ మేనేజర్, తల్లి సీజీహెచ్ఎస్లో చీఫ్ మెడికల్ ఆఫీసర్) కూడా కలిసొచ్చింది. క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో ఆఫర్‌ను వదులుకున్నా అమ్మానాన్న ఏమీ అనకపోవడం మరింత ప్రోత్సాహాన్నిచ్చింది. బిట్స్ పిలానీలో బీటెక్ పూర్తయింది. ఇంజనీరింగ్ మూడో సంవత్సరంలోనే ప్రముఖ కంపెనీలో ఇంటర్న్‌షిప్ చేశా. అయినా నా దృష్టంతా సామాజిక అభివృద్ధివైపే.
అందుకు మార్గం, నా గమ్యం సివిల్ సర్వీసెస్ మాత్రమే అని భావించా. సివిల్స్ ఆలోచన వచ్చిందే తడవుగా ఢిల్లీలో సివిల్స్ కోచింగ్ కోసం చేరా. 2014లో తొలి ప్రయత్నం చేశా. ప్రిలిమ్స్‌లో విజయం సాధించా. మెయిన్స్‌లో పదిహేను మార్కుల తేడాతో కటాఫ్ చేజారింది. ఫలితం రాకున్నా.. సివిల్స్ సాధించగలను అనే నమ్మకం అప్పుడే కలిగింది. 2015 నోటిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకొని ఎట్టి పరిస్థితుల్లో సాధించాలని శ్రమించా. దాంతో రెండో ప్రయత్నంలోనే 82వ ర్యాంకుతో ఐఏఎస్‌కు ఎంపికయ్యే అవకాశం దక్కింది.
సీఏ నుంచి సివిల్స్ వైపు : జె.స్నేహజ
103వ ర్యాంకు
మా స్వస్థలం ప్రకాశం జిల్లా, గుడ్లూరు మండలం, గుళ్లపాలెం. నాన్న వెంకటేశ్వర్లు చార్టర్డ్ అకౌంటెంట్. వృత్తి రీత్యా హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. నేను కూడా నాన్న బాటలోనే చార్టర్డ్ అకౌంటెన్సీ పూర్తి చేయాలని సీఏ కోర్సులో అడుగుపెట్టా. 2011లో తొలి ప్రయత్నంలోనే ఫైనల్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించా. అదే సమయంలో బీకాం కూడా పూర్తి చేశా. సీఏ చదువుతున్నప్పుడు స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో పాల్పంచుకోవడం.. ఆ సమయంలో పలు నేపథ్యాల ప్రజల స్థితిగతులు ప్రత్యక్షంగా చూడటంతో సమాజానికి, ముఖ్యంగా పేద, గ్రామీణ వర్గాలకు సేవ చేయాలనే ఆకాంక్ష మొదలైంది. అందుకే సివిల్స్ లక్ష్యంగా ఎంపిక చేసుకున్నా.
నా కోర్ సబ్జెక్ట్ కామర్స్నే ఆప్షనల్‌గా సెలక్ట్ చేసుకున్నా. తొలి రెండు ప్రయత్నాల్లో విజయం సాధించకపోయినా సివిల్స్‌పై అవగాహన కలిగింది. దాంతో మరికొంత గెడైన్స్ లభిస్తుందని సివిల్స్ 2013 కోసం ఢిల్లీలో శిక్షణ తీసుకున్నా.
2014లో మూడో ప్రయత్నంలో సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ హెడ్‌క్వార్టర్స్ సర్వీసుకు ఎంపికయ్యా. అయితే ఐఏఎస్ లక్ష్యంగా 2015లో నాలుగో ప్రయత్నంలో 103వ ర్యాంకు రావడంతో నా కల నెరవేరింది. నా విజయంలో అమ్మానాన్న తోడ్పాటు ఎంతో ఉంది. పదో తరగతి కాగానే.. అందుబాటులో ఉన్న విద్యావకాశాలు, వాటి ద్వారా లభించే కెరీర్ అవకాశాలపై అవగాహన కల్పించారు. నేను కోరుకున్న చదువు చదివించారు. సివిల్స్ కోసం నాలుగేళ్లు వేచిచూసినా వెన్నంటి నిలిచారు.
ఓర్పుతోనే.. విజయం! : కె.ప్రవళ్లిక
232వ ర్యాంకు
మాది విశాఖపట్నం. నాన్న విశ్వనాథ్, ఎస్బీఐలో చీఫ్ మేనేజర్, అమ్మ విశాలాక్షి.. ఎస్బీహెచ్ ఉద్యోగిని. నేను ఎంతో అదృష్టవంతురాలిని. ఎందుకంటే నా లక్ష్యం గురించి తెలుసుకున్న అమ్మానాన్న నా కోసం విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌కు మకాం మార్చారు. 2011లో బీటెక్ (సీఎస్ఈ) పూర్తయింది. క్యాంపస్ రిక్రూట్మెంట్ ద్వారా ప్రముఖ ఎంఎన్సీలో ఆఫర్ వచ్చింది. కానీ ఆ ఉద్యోగం ద్వారా సమాజానికి సేవ చేసే అవకాశం చాలా తక్కువ.
అందుకే సొసైటీకి సేవ చేసే అవకాశం ఉండే సివిల్ సర్వీసెస్‌ను లక్ష్యంగా ఎంచుకున్నా. తొలి ప్రయత్నంలో 2013లో మెయిన్స్ వరకు వెళ్లినా.. ఐదు మార్కుల తేడాతో విజయం చేజారింది. దాంతో మరింత పట్టుదలతో 2014కు హాజరుకాగా ఆర్మ్డ్ ఫోర్సెస్ హెడ్ క్వార్టర్స్ కేడర్ లభించింది. అదే సమయంలో నేషనల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌గా ఉద్యోగం లభించింది. ఆ విధుల్లో చేరినా లక్ష్యం ఐఏఎస్ కావడంతో మరోసారి ప్రయత్నించాను.
2015లో 232వ ర్యాంకు వచ్చింది. సివిల్స్‌లో సోషియాలజీ నా ఆప్షనల్. రోజుకు ఎనిమిది గంటల పాటు ప్రిపరేషన్ కొనసాగించా. బీటెక్ పూర్తయ్యాక ఇన్నేళ్లు వేచి చూడాల్సి రావడం.. అమ్మాయికి పెళ్లి చేయండని బంధువుల ఒత్తిడి వచ్చినా కూడా నా లక్ష్యం గుర్తించిన అమ్మానాన్న ప్రోత్సహించడం చాలా సంతోషం కలిగించే విషయం.
నాన్నే స్ఫూర్తిగా.. : అదిరె మంజు
291వ ర్యాంకు
మాది హైదరాబాద్. నాన్న.. ధర్మయ్య, వికలాంగుల సంక్షేమ శాఖలో రిటైర్డ్ అటెండర్. నాన్నే నాకు స్ఫూర్తి. పిల్లలు ఉన్నత హోదాల్లో ఉండాలని నాన్న కోరుకోవడమే నేను ఈ రోజు సివిల్స్ వంటి అత్యున్నత సర్వీసును లక్ష్యంగా చేసుకోవడానికి కారణం. నాన్న అందించిన నిరంతర ప్రేరణ, తోడ్పాటే నేను ఈ ర్యాంకు సాధించడానికి దోహదపడ్డాయి. ఓయూ ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి 2008లో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశా. బీఈఎంఎల్ బెంగళూరులో ఉద్యోగం వచ్చింది. 2011లో ఆంత్రోపాలజీ ఆప్షనల్‌గా తొలి యత్నంలో నిరుత్సాహ ఫలితం ఎదురైంది. అదే సమయంలో ఉద్యోగం చేస్తుండటంతో సివిల్స్‌కు సిద్ధమవడం కష్టమైంది.
2013 నుంచి వరుసగా ప్రయత్నించాను. ప్రతి ఏటా గత లోపాలను సరిదిద్దుకుంటూ ముందుకు సాగా. మాక్ టెస్ట్‌లు, మాక్ ఇంటర్వ్యూలకు హాజరయ్యాను. దాంతో తాజా ఫలితాల్లో నాలుగో ప్రయత్నంలో 291వ ర్యాంకు లభించింది. నా విజయంలో నాన్నతోపాటు భర్త హరీశ్ ప్రోత్సాహం కూడా ఎంతో ఉంది. కోచింగ్ తీసుకుంటేనే సివిల్స్ సాధిస్తామనే భావన వీడాలి. సాధించాలనే సంకల్పం బలంగా ఉంటే కోచింగ్ లేకపోయినా విజయం సాధించొచ్చు. కాకపోతే కొంత ఓర్పు అవసరం!!
సామాజిక సేవ.. సంతృప్తి!! : ఉప్పలూరి
మీనా 326వ ర్యాంకు
మాది హైదరాబాద్. నాన్న శ్రీహరి ఐటీ కన్సల్టెంట్, అమ్మ సత్యశ్రీ. సివిల్స్ విజయంలో అమ్మానాన్న సహకారం ఎంతో ఉంది. ఐఐటీ ఖరగ్‌పూర్‌లో బీటెక్- ఎంటెక్ డ్యుయెల్ డిగ్రీ (2009-14) పూర్తయింది. క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ ద్వారా ఐబీఎంలో ఆఫర్ వచ్చింది. ఒక ఏడాది బాగానే గడిచింది. కానీ ఏదో నిరుత్సాహం. సమాజానికి ఏమీ చేయలేకపోతున్నామనే భావన. ఎందుకంటే.. అప్పటికే ప్రముఖ స్వచ్ఛంద సంస్థ CRY (Child Rights and You) ఐఐటీ ఖరగ్‌పూర్ చాప్టర్ మెంబర్‌గా ఖరగ్‌పూర్ పరిసర ప్రాంతాల్లో స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం..
ఆ సమయంలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, గ్రామీణ విద్యార్థులకు అవగాహన కల్పించడం, మధ్యాహ్న భోజన పథకం అమలు గురించి క్షేత్ర స్థాయిలో పర్యటించడం వంటివన్నీ గుర్తొచ్చేవి. దీంతో కార్పొరేట్ సంస్థలో కూర్చుని ఉద్యోగం చేసి లక్షలు సంపాదించినా సంతృప్తి ఉండదని.. సామాజిక సేవా కార్యక్రమాలతో ఆత్మసంతృప్తి కలుగుతుందని భావించాను. దీనికి మార్గంగా సివిల్ సర్వీసెస్‌ను ఎంపిక చేసుకుని 2014లో తొలి ప్రయత్నం చేశాను. కానీ ఫలితం రాలేదు. ఉద్యోగం చేస్తూ సివిల్స్‌కు ప్రిపరేషన్ సాగించడం కష్టమని భావించి రాజీనామా చేసి పూర్తి స్థాయిలో సివిల్స్ ప్రిపరేషన్‌కు ఉపక్రమించాను. జాగ్రఫీని ఆప్షనల్‌గా ఎంచుకుని 2015లో ఫలితం దక్కించుకున్నాను.
సివిల్ సర్వెంట్ పరిధి ఎక్కువ : ఎలా ప్రియాంక
529వ ర్యాంకు
మాది కరీంనగర్ జిల్లాలోని భీమదేవరపల్లి. నాన్న నారాయణ.. ఆయుష్ శాఖ డెరైక్టర్; అమ్మ లారా.. సీసీఎంబీ సైంటిస్ట్. అమ్మానాన్న ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా చాలా కష్టపడి చదువుకున్నారట. అందుకే మాకు అలాంటి ఇబ్బందులు రాకూడదనే ఉద్దేశంతో చదువు పరంగా ఎంతో ప్రోత్సహించారు. నేను సేవాగ్రామ్‌లోని ప్రముఖ వైద్య కళాశాల ఎంజీఎంఐఎస్లో 2011లో ఎంబీబీఎస్ పూర్తి చేశా. దీంతో సివిల్స్ ప్రిపరేషన్‌కు ఉపక్రమించా. 2011-12 అంతా కోచింగ్‌కు కేటాయించి 2013లో ఫస్ట్ అటెంప్ట్ ఇచ్చా. 2014లో రెండో ప్రయత్నంలో ఇంటర్వ్యూ వరకు వెళ్లినా తుది జాబితాలో చోటు లభించలేదు.
కానీ సాధించగలననే నమ్మకం కలిగింది. అదే ఉత్సాహంతో 2015కు హాజరై 529వ ర్యాంకు సొంతం చేసుకున్నా. ఆంత్రోపాలజీ ఆప్షనల్‌గా ఎంపిక చేసుకుని రోజుకు ఎనిమిది నుంచి పది గంటలు చదివా. సోషల్ డెవలప్మెంట్ కోణంలో డాక్టర్ కంటే సివిల్ సర్వెంట్కే ఎక్కువ పరిధి ఉంటుంది. అందుకే సివిల్స్ లక్ష్యంగా ఎంపిక చేసుకున్నా. సివిల్స్ విజయ ప్రస్థానంలో కుటుంబ ప్రోత్సాహం ఎంతో ఉంది. చెల్లెలు శశాంక కూడా సివిల్స్ రాసి.. 2014లో విజయం సాధించి ప్రస్తుతం ఒడిశా కేడర్ ఐఏఎస్ అధికారిణిగా విధులు నిర్వహిస్తోంది. నాకు రెండు నెలల క్రితమే వివాహమైంది. అప్పుడే ఇంటర్వ్యూకు అర్హత లభించింది. ఆ సమయంలో ఢిల్లీ వెళ్లి మాక్ ఇంటర్వ్యూ కోచింగ్ తీసుకునేందుకు భర్త మణిపాల్కుమార్ తోడ్పాటు కూడా ఎంతో ఉంది.
పట్టుదలతో.. నాలుగో ప్రయత్నంలో : పి.వైష్ణవి
840వ ర్యాంకు
మాది చిత్తూరు. నాన్న పుష్పరాజు.. జవహర్ నవోదయ విద్యాలయ రిటైర్డ్ ప్రిన్సిపాల్, అమ్మ విజయలక్ష్మి. బిట్స్ పిలానీలో 2004లో సీఎస్ఈ పూర్తయింది. కొన్ని సంవత్సరాలు యూకేలో ఉండి 2009లో స్వదేశానికి తిరిగి వచ్చా. గివింగ్ బ్యాక్ టు సొసైటీ దృక్పథంతో సివిల్స్ లక్ష్యంగా ఎంచుకున్నా. గ్రూప్స్ నుంచి సివిల్స్ వరకు అన్ని పరీక్షలకు ప్రిపరేషన్ సాగించా. 2011 గ్రూప్-1 మెయిన్స్‌లోనూ విజయం సాధించా. కానీ ఆ పరీక్షకు సంబంధించి కోర్టు కేసు ఉండటంతో ఇంకా ఫలితాలు రాలేదు. సివిల్స్ కోసం 2012 నుంచి వరుసగా ప్రయత్నాలు చేశా.
తెలుగు లిటరేచర్ ఆప్షనల్‌గా తొలి యత్నంలో ప్రిలిమ్స్‌లో విజయం సాధించినా మెయిన్స్‌లో నిరాశ. కానీ పట్టు వీడకుండా ప్రయత్నించడంతో ఇప్పుడు తాజా ఫలితం 840 ర్యాంకు దక్కింది. ర్యాంకు కొంచెం ఎక్కువే అయినా సమాజానికి నేరుగా సేవ చేసే అవకాశం ఉండే సర్వీసులకు ఎంపికైనందుకు ఎంతో ఆనందంగా ఉంది. నా విజయంలో నాన్నతోపాటు భర్త చంద్రశేఖర్ తోడ్పాటు ఎంతో ఉంది. ప్రిపరేషన్ సమయంలో ఒక్కోసారి పాపను చూసుకోవడం వీలుకాకపోయినా వారే అంతా చూసుకునేవారు.
కొంత ఆలస్యమైనా ఫలితం.. : నాగిరెడ్డిగారి మధులత
496వ ర్యాంకు
మా స్వస్థలం చిత్తూరు జిల్లా మదనపల్లె. నాన్న జగన్నాథ్‌రెడ్డి రిటైర్డ్ వీఆర్ఓ. ఆ సమయంలో ఆయన నిర్వహించే విధులు చూడటంతో చిన్నప్పుడే సమాజానికి ఏదైనా చేయాలి అనే ఆలోచన కలిగింది. అగ్రికల్చర్ బీఎస్సీ, ఆ తర్వాత అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్ పూర్తిచేశా. నాన్న నుంచి వారసత్వంగా వచ్చిన సర్వీస్ మోటోతోనే సివిల్స్‌ను లక్ష్యంగా ఎంచుకున్నా. 2011 నుంచి సీరియస్‌గా ప్రిపరేషన్ సాగిస్తున్నా. 2011లో వివాహమైంది. దీంతో భర్త ఈశ్వర్‌రెడ్డి ప్రోత్సాహం కూడా తోడైంది.
ఇదే క్రమంలో గ్రూప్-1, గ్రూప్-2లకు కూడా ప్రిపరేషన్ సాగించా. గ్రూప్-2, 2012 ద్వారా ఏఎస్ఓ ఉద్యోగం వచ్చింది. ప్రస్తుతం ఏపీ సెక్రటేరియట్లో పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ శాఖలో గ్రూప్-2 కేడర్‌లో ఆ విధులు నిర్వహిస్తూనే సివిల్స్ ప్రిపరేషన్ కొనసాగించా. తొలి రెండు ప్రయత్నాలు (2011, 2012) నిరాశాజనక ఫలితాలు ఎదురయ్యాయి. 2014లో మాత్రం మెయిన్స్‌కు ఎంపికవడంతో ఆత్మస్థైర్యం పెరిగింది. 2015లో పట్టుదలగా కృషి చేస్తే 496వ ర్యాంకు లభించింది. ఆంత్రోపాలజీ ఆప్షనల్‌గా ఎంపిక చేసుకుని వ్యూహాత్మకంగా ప్రిపరేషన్ సాగించా. దాంతో కొంత ఆలస్యమైనా ఫలితం లభించింది. మరో ప్రయత్నం చేసి ఐఏఎస్ లక్ష్యం చేరేందుకు కృషి చేస్తా.