Womens World Cup qualifying tournament
-
మనమే చాంపియన్స్
► ప్రపంచకప్ మహిళల క్వాలిఫయింగ్ టోర్నీ విజేత భారత్ ► ఫైనల్లో దక్షిణాఫ్రికాపై వికెట్ తేడాతో విజయం ► అత్యధిక లక్ష్యాన్ని అధిగమించిన టీమిండియా ► వీరోచిత బ్యాటింగ్‌తో గెలిపించిన హర్మన్‌ప్రీత్ ఫేవరెట్ హోదాకు న్యాయం చేస్తూ భారత మహిళలు అంచనాలకు అనుగుణంగా రాణించారు. ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్ క్వాలిఫయింగ్ టోర్నీలో చాంపియన్స్‌గా అవతరించారు. విజయంతో టోర్నీని ఆరంభించిన టీమిండియా చిరస్మరణీయ విజయంతోనే అద్భుత ముగింపు ఇచ్చింది. చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన అంతిమ సమరంలో భారత్ వికెట్ తేడాతో గెలిచి ట్రోఫీని సగర్వంగా సొంతం చేసుకుంది. కొలంబో: తాత్కాలిక కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (41 బంతుల్లో 41 నాటౌట్; 2 ఫోర్లు, ఒక సిక్స్) వీరోచిత బ్యాటింగ్‌తో భారత్‌ను విజేతగా నిలబెట్టింది. దక్షిణాఫ్రికాతో మంగళవారం జరిగిన ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్ క్వాలిఫయింగ్ టోర్నీ ఫైనల్లో టీమిండియా వికెట్ తేడాతో గెలిచింది. 245 పరుగుల లక్ష్యాన్ని భారత్ సరిగ్గా 50 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి ఛేదించింది. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా 49.4 ఓవర్లలో 244 పరుగులకు ఆలౌటైంది. రెగ్యులర్ కెప్టెన్ మిథాలీ రాజ్ గాయం కారణంగా ఫైనల్లో ఆడలేదు. దాంతో ఈ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ నాయకత్వం వహించింది. భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్‌ను ఓపెనర్ మోనా మేష్రమ్ (82 బంతుల్లో 59; 7 ఫోర్లు, ఒక సిక్స్), దీప్తి శర్మ (89 బంతుల్లో 71; 8 ఫోర్లు) ఆదుకున్నారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 124 పరుగులు జోడించారు. అయితే నాలుగు పరుగుల తేడాలో మోనా, దీప్తి అవుటవ్వడంతో భారత్ ఇబ్బందుల్లో పడింది. ఈ దశలో వేద కృష్ణమూర్తి (33 బంతుల్లో 31; 3 ఫోర్లు), హర్మన్‌ప్రీత్ కలిసి నాలుగో వికెట్‌కు 38 పరుగులు చేశారు. మూడు వికెట్లకు 186 పరుగులతో భారత్ పటిష్టంగా కనిపించిన దశలో వేద అవుటైంది. ఒంటరి పోరాటం... వేద పెవిలియన్ చేరుకున్నాక హర్మన్‌ప్రీత్ ఒకవైపు ఒంటరి పోరాటం చేయగా... మరోవైపు ఇతర బ్యాట్స్‌విమెన్ వెంటవెంటనే అవుటవ్వడంతో భారత్‌కు పరాజయం తప్పదేమో అనిపించింది. కానీ హర్మన్‌ప్రీత్ సంయమనం కోల్పోకుండా ధాటిగా ఆడుతూ మ్యాచ్ చివరి బంతికి భారత్‌కు విజయాన్ని అందించింది. విజయానికి చివరి ఓవర్లో భారత్‌కు తొమ్మిది పరుగులు అవసరమయ్యాయి. లెట్సోలో వేసిన ఈ ఓవర్ తొలి బంతిని హర్మన్‌ప్రీత్ డీప్ మిడ్ వికెట్ వద్దకు ఆడింది. రెండో పరుగు పూర్తి చేసే క్రమంలో నాన్‌స్ట్రయికింగ్ ఎండ్‌లో పూనమ్ యాదవ్ రనౌట్ అయింది. చివరి బ్యాట్స్‌విమన్‌గా రాజేశ్వరి క్రీజులోకి వచ్చింది. ఆ తర్వాత హర్మన్‌ప్రీత్ వరుసగా మూడు బంతులను ఎదుర్కొన్నా ఒక్క పరుగూ చేయలేదు. దాంతో విజయ సమీకరణం రెండు బంతుల్లో ఎనిమిది పరుగులుగా మారింది. ఐదో బంతిని హర్మన్‌ప్రీత్ మిడ్‌వికెట్ మీదుగా సిక్సర్ కొట్టింది. దాంతో భారత విజయానికి చివరి బంతికి రెండు పరుగులు అవసరమయ్యాయి. లెట్సోలో వేసిన ఆఖరి బంతిని హర్మన్‌ప్రీత్ ముందుకు వచ్చి లాంగ్ ఆన్ దిశగా ఆడింది. వెంటనే హర్మన్‌ప్రీత్, రాజేశ్వరి రెండు పరుగులు పూర్తి చేయడంతో భారత విజయం ఖాయమైంది. భారత మహిళల వన్డే క్రికెట్ చరిత్రలో జట్టుకిదే అత్యధిక ఛేజింగ్ కావడం విశేషం. ఈ టోర్నీలో భారత్ ఆడిన ఎనిమిది మ్యాచ్‌ల్లోనూ గెలుపొంది అజేయంగా నిలిచింది. భారత ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచిన దీప్తి శర్మ ‘ప్లేయర్ ఆఫ్ ఫైనల్’ పురస్కారం గెల్చుకోగా... దక్షిణాఫ్రికాకు చెందిన సుని లుస్ ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు సొంతం చేసుకుంది. మొత్తం పది జట్లు పాల్గొన్న ఈ టోర్నీలో తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన భారత్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, పాకిస్తాన్ జూన్‌లో ఇంగ్లండ్ ఆతిథ్యమిచ్చే వన్డే ప్రపంచకప్‌కు అర్హత పొందాయి. సంక్షిప్త స్కోర్లు దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: 244 ఆలౌట్ (49.4 ఓవర్లలో) (మిగ్నాన్ డు ప్రీజ్ 40, లిజెల్ లీ 37, డాన్ వాన్ నికెర్క్ 37, సుని లుస్ 35, రాజేశ్వరి గైక్వాడ్ 3/51, శిఖా పాండే 2/41, ఏక్తా బిష్త్ 1/39, పూనమ్ యాదవ్ 1/37, దీప్తి శర్మ 1/46) భారత్ ఇన్నింగ్స్: 245/9 (50 ఓవర్లలో) (మోనా మేష్రమ్ 59, దీప్తి శర్మ 71, వేద కృష్ణమూర్తి 31, హర్మన్‌ప్రీత్ కౌర్ 41 నాటౌట్, శిఖా పాండే 12, మారిజెన్ కాప్ 2/36, అయబోంగా ఖాకా 2/55) -
కెప్టెన్‌గా మిథాలీ
మహిళల ప్రపంచకప్ క్వాలిఫయింగ్ టోర్నీకి భారత జట్టు ప్రకటన న్యూఢిల్లీ: ఐసీసీ మహిళల ప్రపంచకప్ క్వాలిఫయింగ్ టోర్నమెంట్లో పాల్గొనే భారత జట్టును ప్రకటించారు. 14 మందితో కూడిన టీమిండియా జట్టుకు హైదరాబాద్ క్రికెటర్ మిథాలీ రాజ్ నాయకత్వం వహిస్తుంది. ఫిబ్రవరి 7 నుంచి 21 వరకు కొలంబోలో ఈ టోర్నీ జరుగుతుంది. మొత్తం 10 జట్లు రెండు గ్రూప్‌లుగా విడిపోయి ఈ టోర్నీలో ఆడునున్నాయి. గ్రూప్ ‘ఎ’లో భారత్, శ్రీలంక, ఐర్లాండ్, జింబాబ్వే, థాయ్‌లాండ్... గ్రూప్ ‘బి’లో దక్షిణాఫ్రికా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, స్కాట్లాండ్, పపువా న్యూగినియా జట్లు ఉన్నాయి. ఈ టోర్నీలో తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు ఇంగ్లండ్ వేదికగా ఈ ఏడాది జూన్ 26 నుంచి జులై 23 వరకు జరిగే ప్రపంచకప్‌కు అర్హత సాధిస్తాయి. 2014–2016 ఐసీసీ మహిళల చాంపియన్‌షిప్ సమయంలో తొలి నాలుగు ర్యాంక్‌ల్లో నిలిచిన ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, వెస్టిండీస్ జట్లు ఇప్పటికే ప్రపంచకప్ బెర్త్‌లు ఖరారు చేసుకున్నాయి. భారత మహిళల క్రికెట్ జట్టు: మిథాలీ రాజ్ (కెప్టెన్), హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మందన, తిరుష్ కామిని, వేద కృష్ణమూర్తి, దేవిక, సుష్మా వర్మ (వికెట్ కీపర్), జులన్ గోస్వామి, శిఖా పాండే, సుకన్య, పూనమ్ యాదవ్, ఏక్తా బిష్త్, రాజేశ్వరి, దీప్తి శర్మ.