జపాన్ ‘లడ్డూబాబు’లు!
నడవడానికే కష్టంగా ఉండే భారీకాయం.... చేతులతో ఉడుంపట్టు... భుజం, భుజం ఆనించి ఒకరినొకరు భీకరంగా తోసుకుంటారు. సింపుల్‌గా చెప్పాలంటే రెండు చిన్నపాటి ఏనుగులు తలపడితే ఎలా ఉంటుందో జపాన్‌లో ‘సుమో’ ఆట కూడా అలానే ఉంటుంది. భారత్‌లో రెజ్లింగ్ తరహాలోనే అక్కడ ఈ క్రీడ జరుగుతుంది. మన రెజ్లర్లకు పటిష్టమైన దేహదారుఢ్యం ఉంటే.. సుమోలు మాత్రం భారీ శరీరాన్ని మెయింటేన్ చేస్తారు. సుమారుగా 400 నుంచి 600 పౌండ్లు ఉండే బరువువైన శరీరంతో రింగ్‌లో దిగితే ఉంటుంది అసలు మజా. ప్రపంచంలో ఎక్కడ లేని... ఒక్క జపాన్‌కే పరిమితమైన ఈ సుమో క్రీడ వెనుక దాగి ఉన్న విశేషాలు ఏమిటో తెలుసుకుందాం..!
- చిలుక హరిప్రసాద్
మామూలుగా ఏదైనా క్రీడల్లో విజయవంతం కావాలంటే ఆటగాడికి మొదట ఉండాల్సింది ఫిట్నెస్. ఇందుకోసం రోజూ ఎక్సర్సైజ్లు చేస్తూ... నాణ్యమైన, పరిమిత ఆహారం తీసుకుంటూ, గంటల తరబడి ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఒక్కోసారి టెన్షన్‌తో నిద్ర కూడా సరిగా రాదు. కానీ జపాన్ సంప్రదాయ ఆట ‘సుమో’ మాత్రం దీనికి పూర్తి భిన్నం. కుంబాలకు కుంబాలు ఆహారం, స్వీట్లు, కాటన్ల కొద్దీ బీర్లు ఉఫ్‌మని ఊదేస్తారు. మరి వీళ్లకు భుక్తాయాసం రాదా? అంటే రాదనే చెప్పాలి. ఎందుకంటే వీళ్లు కేవలం తినడం కోసమే పని చేస్తారు. తిన్నాకా... కంటినిండా తృప్తిగా నిద్రపోతారు. అది అరగకముందే మళ్లీ తింటారు. మధ్యలో ఓ మూడు, నాలుగు గంటలు ప్రాక్టీస్... తర్వాత శరీరాన్ని మర్దన చేసుకోవడానికి, జుట్టును నీటుగా ముడివేసుకోవడానికి మరికొంత సమయం... సాయంత్రం వేళ అసోసియేషన్లతో బౌట్ల గురించి సంప్రదింపులు... ప్రపంచంలో ఇలాంటి ఆట ఒకటుందని చాలా మందికి తెలియకపోయినా... క్రీడాకారుల భారీకాయాలు చూస్తే మాత్రం ఠక్కున సుమోలని గుర్తిస్తారు.
‘రింగ్’లో పోటీ ఇలా...
సుమో పోటీలు జరిగే రింగ్‌ను ‘డోయో’ అంటారు. 175 చదరపు అడుగుల వైశాల్యంలో ఉండే ప్రాంతంలో 4.55 మీటర్ల రింగ్ ఉంటుంది. ఈ ప్రాంతం మొత్తాన్ని మెత్తటి మట్టి, ఇసుక మిశ్రమంతో నింపుతారు. రింగ్ మధ్యలో ఉండే రెండు వైట్ లైన్ల వెనక నుంచి సుమోలు పోటీ పడాల్సి ఉంటుంది. బౌట్ మొదలైన తర్వాత ముందుగా ఎవరైతే ప్రత్యర్థిని కిందపడేస్తారో వారే విజేతలుగా నిలుస్తారు. శరీరంలోని ఒక్క పాదం మినహా ఏ భాగాన్నైనా కొన్ని సెకన్ల పాటు భూమిపై అదిమి పెట్టాల్సి ఉంటుంది. చేతులతో ప్రత్యర్థి నడుంకు ఉండే నల్లని బెల్టును పట్టుకుని ప్రత్యర్థిని కిందపడేయాలి. అక్రమ పద్ధతులను ఉపయోగిస్తే అనర్హత వేటు తప్పదు. సుమోల శరీర బరువును బట్టి బౌట్లు ఉంటాయి.
ఏం తింటారు?
భారీ శరీరాన్ని మెయింటేన్ చేయాలంటే సుమోలు ఆహారాన్ని కూడా అంతే భారీ స్థాయిలో తీసుకుంటారు. ఆహారం విషయంలో ఏమాత్రం రాజీపడరు.
తక్కువ శిక్షణ, ఎక్కువ ఆహారంతో శరీరాన్ని విపరీతంగా పెంచేస్తారు.
ప్రొఫెషనల్ సుమో రోజుకు 20వేల క్యాలరీల ఆహారాన్ని తీసుకుంటాడు. సాధారణ మనిషి కంటే ఇది పది రెట్లు ఎక్కువ.
ఉదయం 5 గంటలకే నిద్రలేచే సుమోలు బాగా ఆకలి కావడానికి విపరీతంగా ఎక్సర్సైజ్లు చేస్తారు. ఉదయం అల్పాహారం తీసుకోరు.
సుమోల డైట్ రెండు విడతలుగా ఉంటుంది. ఉదయం 11 గంటలకు, సాయంత్రం 6 గంటలకు 10 వేల క్యాలరీల ఆహారాన్ని లాగించేస్తారు. జపాన్ సంస్కృతి, సంప్రదాయ వంటకాలను మాత్రమే తీసుకుంటారు.
ప్రత్యేక వంటకం ‘చుంక్ నబే’
ప్రతిరోజూ సుమోలు ప్రత్యేకంగా తీసుకునే వంటకాన్ని ‘చుంక్ నబే’ అంటారు. ఓ పెద్ద పాత్రలో రకరకాల చేపలు, కూరగాయలు, మాంసం (చికెన్, ఫోర్క్, బీఫ్)లతో పాటు ఇతర దినుసులు కలిపి బాగా ఉడకబెడతారు. 5 నుంచి 10 గిన్నెల రైస్‌తో కలిపి చుంక్ నబేను భుజిస్తారు. ఆ తర్వాత సోయా పాలతో చేసిన కేజీల కొద్దీ స్వీట్లు తింటారు. వీటికి ఆదనంగా బాటిళ్ల కొద్దీ బీర్లు సేవిస్తారు.
పొట్ట ఏమాత్రం ఖాళీ లేకుండా న్యూడ్యూల్స్, బిస్కెట్లు, రకరకాల సూప్‌లతో నింపేస్తారు.
11 గంటలకు తొలి విడత ఆహారం తీసుకున్నాకా నాలుగైదు గంటలు కునుకు తీస్తారు. ఈ సమయంలో జీవక్రియ బాగా మందగించడంతో కొవ్వు పూర్తిగా నడుము భాగంలో చేరుతుంది. పొట్ట, పిరుదులు, నడుం, తొడలు భారీ సైజ్‌లో తయారవుతాయి.
లేచిన తర్వాత అలా బయట ఓ రౌండ్ వేసేసి మళ్లీ 6 గంటలకు అంతే మొత్తంలో ఆహారాన్ని స్వీకరిస్తారు. గంట, రెండు గంటల పాటు చిన్న చిన్న ప్రాక్టీస్, కుర్రాళ్లకు మెలకువలు నేర్పి రాత్రి 10 గంటలకు విశ్రమిస్తారు.
ప్రొఫెషనల్ సుమోలు...
ఈ క్రీడను ప్రొఫెషనల్‌గా ఎంచుకునే వారు ఉంటారు.
ఒక్కసారి ప్రొఫెషన్ కెరీర్ మొదలుపెట్టాక వారి జీవితం ఓ ప్రత్యేకమైన మార్గంలో వెళ్తుంది. సుమోల నడవడి, ప్రవర్తన, ఆటలో నైపుణ్యాన్ని సుమో అసోసియేషన్లు ఎప్పటికప్పుడు అంచనా వేస్తుంటాయి.
తప్పులు చేస్తే సస్పెన్షన్లు, జరిమానాలు, అవసరమైతే వేటు కూడా వేస్తారు.
సుమో జీవితం మొదలుపెట్టాకా (ఎడో పిరియడ్) జుట్టును పొడవుగా పెంచి పైభాగంలో నీట్‌గా ముడివేయాలి. జపాన్ సంప్రదాయ దుస్తులను మాత్రమే ధరించాలి. జనాలు గుర్తించేందుకు ఇలా చేస్తారు.
సుమోల ర్యాంక్‌ను బట్టి వాళ్ల డ్రెస్ ఆధారపడి ఉంటుంది. ర్యాంక్ ఏదైనా ఓ మందమైన బట్టను నడుంచుట్టు గోచి మాదిరిగా చుట్టుకుంటారు.
ప్రొఫెషనల్ సుమోలకు సొంత ఇళ్లు, అపార్ట్మెంట్లు ఉంటాయి. వీళ్లు పెళ్లిళ్లు కూడా చేసుకుంటారు. అయితే జూనియర్ సుమోలు మాత్రం డార్మిటరీ రూమ్‌ల్లోనే బస చేయాలి. సీనియర్ల పట్ల విధేయత చాటుకోవాలి.
ఉదయం 5 గంటలకు లేచి కొద్దిసేపు ప్రాక్టీస్ తర్వాత ఆహారం తయారు చేయడం, సీనియర్ల బట్టలు ఉతకడం, ఇతర అవసరాలను పూర్తి చేయాల్సి ఉంటుంది.
సీనియర్లు తిన్న తర్వాతే జూనియర్లు తినాలి. ఈ విషయంలో చాలా స్ట్రిక్ట్‌గా ఉంటారు.
సీనియర్ సుమో రింగ్‌లో నిలబడితే అతని మోకాలు, చేతులను పక్కకు జరుపుతూ ‘పట్టు’ను నేర్చుకోవాలి.
సుమోలకూ నెలవారీ జీతం
ప్రొఫెషనల్ సుమోలకు నెలవారీ జీతాలతో పాటు ప్రత్యేక బోనస్‌లు, అలవెన్సులు ఇస్తారు. ప్రతి ఏడాది టోర్నీలను బట్టి ఇందులో పెరుగుదల ఉంటుంది. సుమోల ర్యాంక్‌లను బట్టి వారి జీతంలో పెరుగుదల ఉంటుంది. రెండో డివిజన్ కంటే తక్కువగా ఉన్న సుమోలను ట్రెయినీలుగా పరిగణిస్తారు. వీళ్లకు కేవలం జీతం మాత్రమే ఉంటుంది. సుమోల కేటగిరీని బట్టి జీతం ఇలా ఉంటుంది.
యోకోజునా - 30,500 డాలర్లు
ఒజెకి - 25 వేల డాలర్లు
సన్ యూకీ - 18 వేల డాలర్లు
మెగషీరా - 14 వేల డాలర్లు
జూర్యో - 11 వేల డాలర్లు
జీవిత చరమాంకంలో బాధలు
సుమోగా రిటైర్ అయిన తర్వాత చాలా రకాల బాధలు వెంటాడుతాయి. సాధారణ జపాన్ మనిషితో పోలిస్తే వీళ్ల జీవిత కాలం 10 (60 నుంచి 65) ఏళ్లు తక్కువగా ఉంటుంది. అధిక బరువు వల్ల డయాబెటిస్, బీపీ, హృద్రోగం సంభవిస్తుంటాయి. అధిక మొత్తంలో ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కాలేయ సమస్యలు ఉత్పన్నమవుతాయి. కీళ్ల మధ్య అరుగుదల రావడంతో అర్థరైటిస్‌కు గురవుతారు. ఈ మధ్య కాలంలో సుమోల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని శరీర బరువును కాస్త తగ్గించేలా ప్రణాళికలు చేస్తున్నారు.
ప్రొఫెషనల్ సుమో టోర్నీలు
ప్రతి ఏడాది మూడు నుంచి ఐదు వరకు గ్రాండ్ టోర్నీలు జరుగుతాయి. రయోగోక్, టోక్యో, ఒసాకా, నగోయో, ఫకునాలో ఈ టోర్నీలను నిర్వహిస్తారు. ఆదివారం మొదలయ్యే ఈ ఈవెంట్ 15 రోజుల పాటు జరుగుతుంది. అగ్రస్థాయి సుమో రోజుకు ఒక్క బౌట్లో మాత్రమే పాల్గొంటాడు. జూనియర్స్‌కు రెండు రోజులకు ఒకటి ఉంటుంది. బౌట్లో పాల్గొనే సుమోల గురించి ముందు రోజే ప్రకటిస్తారు.
సుమోలో రకాలు
సుమోలో ముఖ్యంగా ఆరు రకాలు ఉన్నాయి. మకూచి (42 మంది), జూర్యో (28 మంది), మకుషితా (120 మంది), సందాన్మీ (200 మంది), జోనిదాన్ (185 మంది), జోంకూచి (40 మంది).
మకూచిలో ఉండే సుమోలకు అత్యధిక అభిమానులు, ప్రైజ్‌మనీ, స్పాన్సర్లు, గిఫ్టులు లభిస్తాయి.