కలప వస్తువులే బెటర్ అట..
రోమ్: ఇంట్లోని టేబుల్, కుర్చీ, మంచం లాంటి ఫర్నీచర్ కలపతో చేసిందయితేనే పర్యావరణానికి మంచిదట. ఇల్లు కూడా కాంక్రీట్ మెటీరియల్‌తో కట్టింది కాకుండా రిసైక్లింగ్ కలపతో చేసిందయితే ఇంకా మంచిదట. ఫర్నీచర్ తయారీకి ఉపయోగించే కలప కోసం అడవులను అక్రమంగా నరికి వేస్తున్నారని, అడవులు అంతరించి పోవడం వల్ల పర్యావరణం దెబ్బతింటోందని, వాతావరణంలో కర్బన ఉద్గారాలు పెరుగుతున్నాయని ఇంతకాలం అందరం భావిస్తూ వచ్చాం. ఇందులో కొంతవరకే వాస్తవం ఉందని, వాస్తవానికి ఫర్నీచర్ కోసం కలపకు బదులుగా ప్లాస్టిక్, అల్యూమినియం, ఇనుము, ఉక్కుతో తయారు చేస్తున్న వస్తువుల వల్లనే పర్యావరణానికి ఎక్కువ ప్రమాదమని ఐక్యరాజ్యసమితి ‘ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఏఓ)’ ఓ నివేదికలో వెల్లడించింది.
ప్లాస్టిక్, ఇతర మెటీరియల్‌తో ఫర్నీచర్ తయారు చేయడానికి శిలాజ ఇంధనం ఎక్కువ అవసరమవుతుందని, ఈ ఇంధనం ఖర్చు వల్ల వాతావరణంలో కర్బన ఉద్గారాలు పెరుగుతున్నాయని, ఇది భూతోపన్నతికి దారి తీస్తోందని ఆ నివేదిక పేర్కొంది. ప్లాస్టిక్ వస్తువులు, వాటి రీసైక్లింగ్ వల్ల కూడా ఇంధనం ఖర్చు ఎక్కువగా పెరుగుతోందని తెలిపింది. పైగా ఈ వస్తువులకు కార్బన్‌ను పీల్చుకునే గుణాలు కూడా లేవు. అదే ఫర్నీచర్ తయారీకి మెటల్ మెటీరియల్‌ను కాకుండా కలపను ఉపయోగించినట్లయితే ఫర్నీచర్ తయారీకి ఎలాంటి ఇంధనం అవసరం ఉండదని, కలపను కట్ చేయడానికి మాత్రం విద్యుత్‌ను ఉపయోగించాల్సి వస్తుందని ఎఫ్‌ఏఓకు చెందిన ఫారెస్ట్ అసిస్టెంట్ డెరైక్టర్ జనరల్ రెనీ కాస్ట్రో సలాజర్ తెలియజేశారు. పైగా కలపకు కర్బన ఉద్గారాలను కొన్నేళ్లపాటు తనలో ఇముడ్చుకునే గుణం ఉందని, పైగా కలప ఫర్నీచర్‌ను ఆరు బయట పడేస్తే అది సేంద్రీయ పదార్థంగా కూడా మరుతోందని ఆయన చెప్పారు.
ప్రపంచవ్యాప్తంగా వెలువడుతున్న కర్బన ఉద్గారాల్లో 12 శాతమే కలప కోసం అడవులను అక్రమంగా నరికి వేయడం వల్ల జరుగుతోందని ఎఫ్ఏఓ నివేదిక వెల్లడించింది. అదే ఇంట్లోని ఫర్నీచర్‌తోపాటు ఇంటిని కూడా రీసైక్లింగ్ కలపతో నిర్మించుకున్నట్లయితే ఏటా 13.5 కోట్ల టన్నుల కర్బన ఉద్గారాలను అరికట్టవచ్చని, ఇది ఒక బెల్జియం దేశం ఏటా విడుదల చేసే కర్బన ఉద్గారాలకన్నా ఎక్కువని నివేదిక పేర్కొంది. ఈ అంచనాల ప్రకారం కలపకు బదులుగా మనం ఉపయోగిస్తున్న ప్రత్యామ్నాయ మెటీరియల్ వల్లనే పర్యావరణం ఎక్కువ దిబ్బతింటోంది. అలా అని కలప కోసం అడవులను అడ్డంగా నరకడాన్ని నియంత్రించాల్సిందే. కర్బన ఉద్గారాలను తన కడుపులో ఇముడ్చుకునే చెట్లను పరిరక్షించుకోవాల్సిందే.
ఓ పక్క సమృద్ధిగా చెట్లను పెంచుతూనే మానవ అవసరాలకు కలపను సమన్వయంతో ఉపయోగించుకుంటే పర్యావరణానికి మేలు చేసిన వారమవుతాం. మనకు తెలియకుండానే మైనర్ పిల్లలతో తయారు చేస్తున్న చెప్పులను, బూట్లను కొనుగోలు చేస్తుంటాం. తెలిశాక అలాంటి బ్రాండ్లకు దూరంగా ఉండాలనుకుంటాం. అలాగే మనకు వస్తున్న కలప అక్రమంగా వస్తుందా, సక్రమంగా వస్తుందా, సమృద్ధిగా ఉన్న చోట నుంచి వస్తుందా ? తెలసుకొని వ్యవహరించే విచక్షణ మనకుంటే అడవులను కాపాడుకోవచ్చు. మన కలప అవసరాలను తీర్చుకోవచ్చు. సక్రమమైన కలపంటూ సర్టిఫై చేయడానికి ‘ఫారెస్ట్ స్టీవర్డ్ కౌన్సిల్’ లాంటి అంతర్జాతీయ సంస్థల సేవలను వినియోగించుకోవచ్చు.