‘హెచ్చరిక’లపై కలకలం
సాక్షి, రంగారెడ్డి జిల్లా : విద్యాశాఖలో సరికొత్త వివాదానికి తెరలేచింది. అధికారులు, ఉపాధ్యాయుల మధ్య తలెత్తిన ఈ వివాదానికి శనివారం హయత్‌నగర్ మండలం వర్డ్ అండ్ డీడ్ పాఠశాల కేంద్రమైంది. పదో తరగతి పరీక్షల్లో చేపట్టిన సంస్కరణలపై ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు విద్యాశాఖ అవగాహన కల్పిస్తోంది. ఇందులో భాగంగా శుక్రవారం వికారాబాద్ డివిజన్ టీచర్లకు వికారాబాద్ మండల కేంద్రంలో అవగాహన ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ పరీక్షల సంచాలకులు మన్మథరెడ్డి హాజరయ్యారు.
ప్రస్తుతం కొందరు టీచర్లు విధినిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ విమర్శించి.. అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన చేసిన హెచ్చరికలను ఉపాధ్యాయ సంఘ నేతలు తప్పుబట్టారు. దీంతో శనివారం వర్డ్‌అండ్‌డీడ్ పాఠశాలలో జరుగుతున్న రెండోవిడత అవగాహన కార్యక్రమానికి వచ్చి పరీక్షల సంచాలకులు మన్మధరెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
అలసత్వాన్ని సహించం..
అభివృద్ధిలో కీలకమై విద్యావ్యవస్థలో ఉపాధ్యాయుడి పాత్ర ప్రధానమని, విధినిర్వహణలో అలసత్వం వహిస్తే ఉపేక్షించే ప్రసక్తే లేదని మన్మథరెడ్డి ఉపాధ్యాయులకు స్పష్టం చేశారు. అవగాహనలో భాగంగా ఆయన వర్డ్‌అండ్‌డీడ్ పాఠశాల సదస్సులో మాట్లాడుతూ నిర్లక్ష్య ఉపాధ్యాయుల వైఖరిని ఎండగడుతూ.. విధినిర్వహణలో జాగ్రత్తలు, మెళకువలపై జీహెచ్ఎంలకు హితబోధ చేశారు. ఈక్రమంలో పలువురు ఉపాధ్యాయ సంఘాల నేతలు అక్కడికి చేరుకుని పరీక్షల డెరైక్టర్‌తో మాట్లాడే ప్రయత్నం చేయగా.. ఆయన వారికి అవకాశం ఇవ్వకుండా తన పని పూర్తి చేశారు.
టీచర్లు బాధ్యులు కాదు : ఉపాధ్యాయ సంఘాలు
విద్యావ్యవస్థలో లోపాలన్నీ టీచర్లపైనే రుద్దుతున్నారంటూ ఉపాధ్యాయ సం ఘ నేతలు మండిపడ్డారు. ప్రతి చిన్న విషయానికి సస్పెండ్ చేస్తామని బెది రించడం సరికాదని మాణిర్రెడ్డి (యూటీఎఫ్), పోచయ్య (ఎస్టీఎఫ్), సదానంద్ (ఎస్టీయూ), శ్రీనివాస్‌రెడ్డి (టీపీయూఎస్) తదితరులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు టీచర్లను పావులుగా వాడుకుంటున్నారంటూ ఎమ్మెల్సీ జనార్దన్‌రెడ్డి పేర్కొన్నారు.
మాటలొద్దు.. చేతల్లో చూపండి
వర్డ్‌అండ్‌డీడ్ పాఠశాలలో జరిగిన సంఘటనపై ఉపాధ్యాయులు మరోవిధంగా స్పందించారు. కొందరు ఉపాధ్యాయుల కారణంగా వ్యవస్థకు చెడ్డపేరు వస్తున్నదని, వారిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పలువరు టీచర్లు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఓ ప్రధానోపాధ్యాయుడు స్పందిస్తూ.. అధికారులు పదేపదే హెచ్చరికలు చేయడం కంటే నిర్లక్ష్యం వహించే వారిపై చర్యలు తీసుకుంటే సత్ఫలితాలు వస్తాయన్నారు.