Work From Home Town
-
వర్క్ ఫ్రం హోంపై ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం
వర్క్ ఫ్రం హోమ్ విషయంలో దేశీ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ కీలక ప్రకటన చేసింది. ఇప్పటివరకూ ఇంట్లోంచే విధులు నిర్వర్తిస్తున్న వారు ఇకపై నెలకు కనీసం పది రోజులపాటు ఆఫీసులకు రావాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఎంట్రీ లెవెల్ నుంచి మధ్య స్థాయి ఉద్యోగులందరికీ ఇది వర్తిస్తుందని ప్రకటించింది. ఈ సమాచారాన్ని ఇప్పటికే ఈమెయిళ్ల ద్వారా ఉద్యోగులకు తెలియజేసినట్లు తెలిపింది. ‘‘బ్యాండ్ 5, 6 స్థాయుల్లో పనిచేస్తున్న ఉద్యోగుల (మిడ్-లెవల్ మేనేజర్లు, ప్రాజెక్ట్ హెడ్లు, ఎంట్రీ-లెవల్ ఉద్యోగులు)కు నెలలో 10 రోజులు కార్యాలయం నుంచి పని చేయాలని మెయిల్ పంపారు. కరోనా అనంతరం చాలా కంపెనీలు ఆఫీస్ నుంచి పని చేయడానికి ప్రాధాన్యం ఇస్తున్నాయి. రిమోట్ వర్క్‌తోపాటు హైబ్రిడ్‌వర్క్ కూడా సౌకర్యవంతంగా ఉంటుంది’ అని ఇన్ఫోసిస్ సీఈఓ సలీల్ పరేఖ్ ఇటీవల కంపెనీ క్యూ2 ఫలితాల సందర్భంగా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలు చేసిన కొన్ని రోజులకే కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. సంస్థలో అందరూ కలిసి ఒకచోట పనిచేయాలని భావిస్తున్నట్లు సలీల్ పరేఖ్ చెప్పారు. సాధారణంగా సౌకర్యవంతమైన విధానానికి తాము మద్దతిస్తామన్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్‌తో పాటు కొన్ని రోజులు కార్యాలయంలో పనిచేయడంతో ఎంతో ప్రయోజనం చేకూరుతుందని అభిప్రాయపడ్డారు. ఇదీ చదవండి: పెట్రోలియం క్రూడ్‌పై విండ్‌ఫాల్ పన్ను పెంపు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ఇటీవల వర్క్ ఫ్రం ఆఫీస్‌కే మొగ్గు చూపింది. దీనివల్ల సంస్థ అసోసియేట్లు, కస్టమర్ల మధ్య పరస్పర అవగాహన ఏర్పడుతుందని టీసీఎస్ భావిస్తోంది. సంస్థ ఉత్పత్తులను కస్టమర్లకు డెలివరీ చేయాలన్నా, వర్క్ అవుట్‌పుట్ మెరుగుపడాలన్నా వర్క్‌ఫ్రం ఆఫీస్ ద్వారానే సాధ్యం అని చెప్పింది. ఆఫీస్ సంస్కృతి, సహోద్యోగులతో ఎలా వ్యవహరించాలో తెలుస్తుందని, అందుకు సంబంధించి కంపెనీ మెంటార్‌గా వ్యవహరిస్తుందని టీసీఎస్ సీఈఓ కె కృతివాసన్ వివరించారు. -
‘సొంతూరు నుంచే పని’కి పెరుగుతున్న ఆదరణ
సాక్షి, అమరావతి: కరోనా సమయంలో ఉద్యోగులు సొంత ఊరు నుంచి పని చేసుకొనేలా దేశంలోనే తొలిసారిగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వర్క్ ఫ్రమ్ హోమ్ టౌన్ (డబ్ల్యూఎఫ్‌హెచ్‌టీ) విధానానికి ఆదరణ పెరుగుతోంది. ఒమిక్రాన్ రూపంలో కరోనా మూడో వేవ్ ప్రారంభమవడంతో కంపెనీలు తిరిగి వర్క్ ఫ్రమ్ హోమ్‌కు మొగ్గు చూపుతున్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వ డబ్ల్యూఎఫ్హెచ్టీలో భాగస్వామ్యం కావడానికి అనేక ఐటీ కంపెనీలు ముందుకు వస్తున్నట్లు ఏపీఎన్ఆర్టీ సొసైటీ ప్రెసిడెంట్ మేడపాటి వెంకట్ ‘సాక్షి’కి తెలిపారు. గత నెలలో పైలెట్ ప్రాజెక్టు 29 కేంద్రాల్లో 1,500 సీట్లు అందుబాటులోకి తెచ్చారు. ఇప్పుడు 25కి పైగా కంపెనీలు డబ్ల్యూఎఫ్‌హెచ్‌టీ విధానంపై ఆసక్తి చూపుతున్నాయి. దీంతో డిమాండ్ ఏకంగా 3,000 సీట్లకు పెరిగిందని వెంకట్ తెలిపారు. త్వరలోనే 100 కేంద్రాలను అధికారికంగా ప్రారంభించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఈ విధానంలో భాగస్వామ్యం కావాలని 1,000కు పైగా సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. రాష్ట్రానికి చెందిన రెండు లక్షల మంది దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తున్నట్లు ఏపీఎన్ఆర్టీ సర్వేలో వెల్లడయింది. వీరు సొంత ఊరు నుంచే పని చేసుకొనేలా డబ్ల్యూఎఫ్‌హెచ్‌టీ విధానం కింద కో–వర్కింగ్ స్పేస్‌ను రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తెస్తోంది. కనీసం లక్ష మంది సొంతూరులోనే పనిచేసేలా మౌలిక వసతులను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇందుకోసం ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ కార్యాలయాలు, ఇంజనీరింగ్ కళాశాలల్లో కో–వర్కింగ్ స్పేస్‌లను అభివృద్ధి చేయనున్నారు. ప్రస్తుతం పైలెట్ ప్రాజెక్టు కింద పని చేస్తున్న వారు మరింత వేగవంతమైన బ్యాండ్‌విడ్త్, సీసీ కెమెరాలు, రవాణా సౌకర్యం వంటివి కోరుతున్నారని, వీటిని పరిశీలించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని వెంకట్ తెలిపారు.