మహిళలే ఎక్కువ 'ఆ పదాలు' వాడుతున్నారు!
లండన్ః సాంకేతిక విప్లవంలో భాగంగా స్మార్ట్ ఫోన్ల తయారీ భారీగా పెరిగిపోయింది. దీంతో పాటే ఇంటర్నెట్ సౌకర్యంకూడ అందుబాటులోకి రావడంతో సామాజిక మాధ్యమాల వాడకం కూడ ఎక్కువై పోయింది. తమ తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా ప్రకటించేందుకు, ప్రజలతో పంచుకునేందుకు ఆయుధంగా సామాజిక మాధ్యమాలను విరివిగా వినియోగించుకుంటున్నారు. అయితే ఆయా మాధ్యమాల్లో ఎక్కువగా సెక్స్ సంబంధిత పదాలను, బూతు పదాలను మగవారే ఎక్కువగా పోస్ట్ చేస్తారన్నఅభిప్రాయాన్ని పరిశోధకులు కొట్టి పారేశారు. బ్రిటిష్ ట్విట్టర్ యూజర్లపై పరిశోధనలు జరిపిన అధ్యయన కారులు ట్విట్టర్లో సెక్స్ పదాలను ఎక్కువగా మహిళలే పోస్టు చేస్తున్నట్లు కనుగొన్నారు.
సామాజిక మాధ్యమం ట్విట్టర్ యూజర్లపై బ్రిటిష్ థింక్ ట్యాంక్ బృందం అధ్యయనాలు నిర్వహించింది. ముఖ్యంగా ట్విట్టర్ లో స్త్రీలపై ద్వేషం, దుర్వినియోగం వంటి విషయాలను విశ్లేషించింది. మగవారితో పాటు మహిళలు కూడ అభ్యంతరకర, సెక్స్ సంబంధిత పదాలు వాడుతున్నారని, అందులో మహిళలే ఎక్కువగా సెక్స్ పదాలు పోస్ట్ చేస్తున్నారని బ్రిటిష్ థింక్ ట్యాంక్ బృందం తెలుసుకుంది. మూడు వారాలపాటు వినియోగదారులపై జరిపిన అధ్యయనాల ద్వారా ఈ సరికొత్త విషయాలను కనుగొన్నారు. ట్విట్టర్ లో పోస్టు చేసిన సుమారు 2,00,000 ట్వీట్స్ లో ఒకేరకమైన పదాలను దాదాపు ఒకే సమయంలో 80,000 వేల మంది వాడినట్లు పరిశోధకులు కనుగొన్నారు. మొత్తం 6500 ట్విట్టర్ వినియోగదారులు సెక్సియెస్ట్ ట్వీట్టే లక్ష్యంగా 10,000 వరకు ట్వీట్లు చేసినట్లు గుర్తించారు.
సామాజిక నెట్వర్కింగ్ దిగ్గజం ఫేస్ బుక్ కూడ సెక్సియస్ట్ పదాల వాడకంతోపాటు, జాత్యాహంకరం, దుర్వినియోగం వంటి విమర్శలను ఎదుర్కొంది. ఇటీవల ఓ బికినీ ధరించిన మోడల్ శరీర భాగాలను ప్రదర్శించే ప్రకటనను చూపించి క్షమాపణలు చెప్పుకుంది.